: గిటార్ పట్టిన వాట్సన్... స్టెప్పులతో దుమ్మురేపిన కోహ్లీ, గేల్!: సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు సంబరాలకు అవధులే లేవు. మైదానంలో జయాపజయాలెలా ఉన్నా, ఆ జట్టు యాజమాన్యం మాత్రం తన క్రికెటర్ల కోసం నిత్యం పార్టీలు ఏర్పాటు చేస్తోంది. సదరు పార్టీలతో మస్తు మజా చేస్తున్న ఆ జట్టు సభ్యులు రిఫ్రెష్ అవుతున్నారు. బెంగళూరులో ఇటీవల ఏర్పాటైన పార్టీలో ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ తనలోని గిటార్ నైపుణ్యాన్ని బయటకు తీశాడు. సఫారీ స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ భార్య డేనియేలా పాటందుకుంది. ఆ తర్వాత మరికొంత మంది వాద్య కళాకారులతో కలిసి వాట్సన్ గిటార్ ట్యూన్స్ ఇవ్వగా... టీమిండియా చిచ్చరపిడుగు విరాట్ కోహ్లీ, విండీస్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ స్టెప్పులతో దుమ్మురేపారు. కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న గేల్ స్టెప్పులతో హోరెత్తిస్తే... అతడికి దీటుగా కోహ్లీ సరికొత్త స్టెప్పులతో శివాలెత్తిపోయాడు. వీరిద్దరి డ్యాన్స్ కు పార్టీకి హాజరైన వారంతా ఫిదా అయిపోయారు. కేకలు, విజిల్స్ తో పార్టీని హోరెత్తించారు. వివిధ దేశాల క్రికెట్ జట్లకు చెందిన వాట్సన్, డివిలియర్స్, గేల్, కోహ్లీ ప్రస్తుతం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. వాట్సన్ గిటార్ పట్టుకోగా... కోహ్లీ, గేల్ స్టెప్పులేసిన సదరు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.