: ఇక నంది అవార్డులతో సంబంధం లేదా?...తెలంగాణ అవార్డుల కోసం కొత్త కమిటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సినిమాలను నంది అవార్డులతో సత్కరించేది. నంది అవార్డుల స్ధానంలో సినిమాలు, సినీ కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త అవార్డులు ఇవ్వాలని భావిస్తోంది. దీంతో ఇందుకోసం ఓ కమిటీని నియమించింది. కేవీ రమణాచారి అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులకు స్థానం కల్పించింది. అవార్డుల పేరు, అవార్డులకు విధి విధానాలు ఖరారు చేయడం ఈ కమిటీ విధి అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో సినిమా పరిశ్రమను పటిష్ఠం చేయడం, తెలంగాణ సినీ పరిశ్రమ ద్వారా కళాకారులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తుందని ఆదేశాల్లో తెలిపిందని సమాచారం.