: కొండెక్కి ప్రపోజ్ చేశాడు... ఆ వెంటనే జైలుకెళ్లాడు!


ప్రేయసికి ప్రపోజ్ చేయడం కోసం విదేశాల్లో యువకులు రకరకాల కొత్త మార్గాలు ఎంచుకుంటూ వుంటారు. అలాంటి ప్రయత్నమే చేసిన ఓ అమెరికా కుర్రాడు ఆనక జైలుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కాలిఫోర్నియాకు చెందిన మైఖేల్ బాంక్స్ (27) సెంట్రల్ కోస్ట్ లోని 600 అడుగుల ఎత్తున్న మొర్రో రాక్ అనే కొండను ఎక్కాడు. శిఖరాగ్రాన చేరి 'ఫేస్ టైమ్' వీడియో ద్వారా 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగాడు. ఆ దృశ్యాన్ని లైవ్ వీడియోలో వీక్షించిన ప్రేయసి.. ప్రియుడి సాహసాన్ని అభినందించి, కొండ దిగివస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో కొండను దిగుతుండగా మైఖేల్ కొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ విషయం ప్రియురాలికి 'ఫేస్ టైమ్' ద్వారా తెలిపాడు. వెంటనే స్పందించిన ఆమె అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన అగ్నిమాపక దళం హెలికాప్టర్ సాయంతో అతనిని రక్షించారు. అనంతరం అతనిని తీసుకెళ్లి జైలులో పెట్టారు. అనుమతి లేకుండా నిషేధించిన కొండను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడంతో అతనిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News