: రేపటి మ్యాచ్ గురించే మేం ఆలోచిస్తున్నాం!: విమర్శలపై అఫ్రిది స్పందన
తొలి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి, రెండో మ్యాచ్ లో బోర్లాపడడంతో పాకిస్థాన్ జట్టుపై వెటరన్ లు విరుచుకుపడ్డారు. వర్షంతో తడిసిన పిచ్ పై అదనపు స్పిన్నర్ ని తీసుకోకుండా తప్పు చేశాడని, వన్ డౌన్ లో ఫాంలో ఉన్న హఫీజ్ ను దించకుండా స్వయంగా అఫ్రిది దిగడంపై విమర్శలు పెరిగిపోతుండడంతో పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. విమర్శలు, ప్రశంసలు సర్వసాధారణమని పేర్కొన్నాడు. అయితే మైదానంలో దిగిన తరువాత నూటికి నూరుశాతం ప్రదర్శన ఇచ్చామా? లేదా? అనేదే ప్రధానమని అఫ్రిది చెప్పాడు. వంద శాతం ప్రయత్నం చేసిన తరువాత ఫలితం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. బౌలర్లు, బ్యాట్స్ మెన్ ఫాంలో ఉన్నారని, దాంతో తప్పిదాలు తగ్గించుకోవడంపై దృష్టిపెట్టామని అఫ్రిది చెప్పాడు. ఓటమి చెందిన మ్యాచ్ ల గురించి అంతా మాట్లాడుతుంటే, తాము మాత్రం గెలవాల్సిన రేపటి మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నామని అన్నాడు. రేపు న్యూజిలాండ్ తో పాక్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.