Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ తో మాగంటి గోపినాథ్ భేటీ!... త్వరలోనే గులాబీ గూటికి టీ టీడీపీ ఎమ్మెల్యే

టీడీపీ దివంగత నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోం మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి నిన్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగింది. జంట నగరాల్లో టీడీపీ కీలక నేతగా వ్యవహరిస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నిన్న హైదరాబాదులోనే ఉన్నారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాదు పార్టీ అధ్యక్షుడిగానూ ఆయన కీలక బాధ్యతల్లో ఉన్నారు. అలాంటి నేత నిన్నటి ఎలిమినేటి వర్ధంతికి డుమ్మా కొట్టారు. సాక్షాత్తు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రమ్మన్నారని పార్టీ నేతలు గుర్తు చేసినా ఆయన స్పందించలేదు. ఈ కార్యక్రమానికి హాజరు కాని మాగంటి నిన్న ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారట. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా టీఎస్ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మాగంటి కేసీఆర్ తో భేటీ అయ్యారట. ఈ విషయం నిన్నంతా బయటకు పొక్కకున్నా, నేటి ఉదయం గుప్పుమంది. మాగంటి గోపినాథ్ ను కలిసిన తర్వాతే కేసీఆర్ ముంబై వెళ్లారని తెలుస్తోంది. కేసీఆర్ తో భేటీ నేపథ్యంలో మాగంటి కూడా టీ టీడీపీకి చేయిచ్చి గులాబీ గూటికి చేరడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. తనతో పాటు టీ టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కూడా మాగంటి టీఆర్ఎస్ లోకి తీసుకెళుతున్నట్లు సమాచారం.

More Telugu News