‘జెమిని’ మణిది సహజ మరణం కాదా?... ‘మిస్టరీ’ గుట్టు విప్పేందుకు రంగంలోకి పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘జెమిని’ మణిది సహజ మరణం కాదా?... ‘మిస్టరీ’ గుట్టు విప్పేందుకు రంగంలోకి పోలీసులు

దక్షిణాది చలన చిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కళాభవన్ మణి (జెమిని ఫేం) అంత్యక్రియలు నిన్న ఆయన సొంతూరు కేరళలోని త్రిశూర్ జిల్లా చలక్కుడిలో పూర్తయ్యాయి. మణి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆయన మృతి చెందిన వైనంపై అనుమానాలు రేకెత్తాయి. దీనిపై కాస్తంత వేగంగా స్పందించిన పోలీసులు అంత్యక్రియలకు ముందే మణి మృతదేహానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మణి శరీరం నుంచి పలు శాంపిళ్లను సేకరించిన వైద్యులు వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తరలించారు. ఇదిలా ఉంటే, పోస్టుమార్టం సందర్భంగా మణి శరీరంలో అనుమానాస్పద రసాయనాలున్నాయన్న వైద్యుల సందేహాలతో రంగంలోకి దిగిన పోలీసులు మణి మృతిని అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ ఆదివారం రాత్రే కేసు నమోదు చేశారు. మణి మరణించిన అవుట్ హౌస్ ను పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. తాజా ఘటనతో కేరళ సినీ వర్గాల్లో కలకలం రేగింది.

More Telugu News