: చంద్రబాబు ఒక్కడే ఎంతని కష్టపడతాడు?...సహకరించండయ్యా బాబూ!: శివాజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కడే ఎంతని కష్టపడతాడని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఎలా ఉన్నత స్థాయికి తీసుకురావాలా? అని చంద్రబాబు అహోరాత్రులు కష్టపడుతున్నారని అన్నారు. ఆయన అంత కష్టపడుతుంటే కేంద్ర మంత్రులు, ఎంపీలకు చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన ఆరోపించారు. సీఎం అంత కష్టపడుతున్నప్పుడు మిగతా వారు ఆయన కంటే ఎక్కువ శ్రమపడి పనిచేయాల్సి ఉంటుందని సూచించిన శివాజీ, ఆయనతో జట్టుకట్టిన వారు మాత్రం కష్టపడడం లేదని అన్నారు. చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు తీసుకొస్తే బాగుంటుందో ఆలోచించాల్సిన కేంద్ర మంత్రులు, ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు తెలియదని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు వారు సంపాదించినది చాలని చెప్పిన ఆయన, ఇకనైనా రాబోయే తరాలకోసం కష్టపడాలని సూచించారు. రాజకీయ నాయకులెవరైనా అధికారంతోనే చస్తారా? అని ఆయన సూటిగా అడిగారు. ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతలు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం మీ బిడ్డలు మాత్రమే బాగుంటే చాలా? అని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రాయితీలు అందుతాయన్న ఆలోచన ఎవరికీ లేదని ఆయన మండిపడ్డారు. అంటే ప్రజా సంక్షేమం ఎవరికీ అవసరం లేదని అర్థమవుతోందని ఆయన స్పష్టం చేశారు. సంపాదించుకున్నది చాలు, ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచించాలని ఆయన కేంద్ర మంత్రులకు సూచించారు. అదీ చేతకాకపోతే చంద్రబాబునాయుడుకు నిజాయతీగా సహకరించాలని ఆయన కోరారు.