: వీకెండ్ జంక్ ఫుడ్ తో మరింత అనారోగ్యం తప్పదు!
వారంలో ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా, ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినప్పటికీ, వీకెండ్ లో జంక్ ఫుడ్ జోలికి వెళ్లేవారికి అనారోగ్యం తప్పదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ యూనివర్శిటీకి చెందిన ఫార్మకాలజీ విభాగాధిపతి మార్గరెట్ మోరిస్ వెల్లడించారు. ఈ అంశంపై నిర్వహించిన తాజా అధ్యయనానికి ఆమె నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మార్గరెట్ మాట్లాడుతూ, రోజూ తీసుకునే జంక్ ఫుడ్ కన్నా వీకెండ్ లో మితిమీరి తీసుకునే చిప్స్, బర్గర్ లతో అనారోగ్యం తప్పదన్నారు. జంక్ ఫుడ్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయమై ఎలుకల అన్న వాహికను పరిశీలించారు. మనుషుల అన్నవాహిక సుమారు 100 ట్రిలియన్ మైక్రోబియల్ సెల్స్ వరకు కలిగి ఉంటుంది. దీని ప్రభావం జీవక్రియ, జీర్ణం కావడం, ఇమ్యూన్ ఫంక్షన్ పై ఉంటుందని అన్నారు. ఏదైనా తేడా వస్తే పేగు సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ వంటి సమస్యలు తలెత్తుతాయని మార్గరెట్ పేర్కొన్నారు.