: పెళ్లి మండపంలో స్టెప్పులేసిన వధువు!... నిశ్చేష్టులైన అతిథులు


పెళ్లి... జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అరుదైన ఘట్టం. అందుకే సదరు ఘట్టాన్ని మరుపురాని గురుతుగా మలచుకునేందుకు అటు అబ్బాయిలతో పాటు, ఇటు అమ్మాయిలు కూడా శతథా యత్నిస్తారు. ఉన్నంతలో గొప్పగా చేసుకుంటారు. వినూత్న రీతిలో పెళ్లి జరుపుకుంటున్న పలువురు ఈ వేడుకను రికార్డులకు ఎక్కిస్తున్నారు. రికార్డుల సంగతి అలా పక్కన బెడితే... తన వివాహాన్ని వెరైటీగా చేసుకోవాలని తలచింది ఓ అమ్మాయి. పెళ్లి మండపం తయారైంది. పెళ్లి కొడుకు వచ్చేశాడు. ఆహూతులతో పెళ్లి మండపం నిండిపోయింది. అందరిలాగే స్నేహితురాళ్లతో పెళ్లి మండపం ప్రధాన వేదిక వద్దకు వచ్చిన ఆ అమ్మాయి అక్కడి వారినందరినీ షాక్ కు గురి చేసింది. స్నేహితురాళ్ల మధ్య నిలబడిన ఆ అమ్మాయి... ఫ్రెండ్స్ తో పాటే స్టెప్పులేయడం మొదలుపెట్టింది. ఏ ఒకటో, రెండో స్టెప్పులతో సరిపెట్టలేదు. సాంతం పెళ్లి వేదిక వద్దకు స్టెప్పులేసుకుంటూనే వచ్చేసింది. కొద్దిసేపు డ్యాన్స్ చేసిన స్నేహితురాళ్లు అక్కడి నుండి మాయం కాగా, వారి స్థానంలో అమ్మాయి మగ స్నేహితులు వచ్చి చేరారు. ఆహూతులంతా నోరెళ్లబెట్టి చూస్తున్నా, అవేమీ పట్టించుకోని నవ వధువు తనదైన శైలిలో స్టెప్పులతో హోరెత్తించింది. మరి స్టెప్పులేయడానికి ఆ అమ్మాయి ఏ డ్రెస్సులో వచ్చిందనుకుంటున్నారు? నిండా నగలు పెట్టుకుని, పెళ్లి కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన పెళ్లి పట్టుచీరలోనే ఎంటరైన ఆమె, ఆ డ్రెస్సుతోనే సాంతం నృత్యంతో హోరెత్తించింది. నాలుగేళ్ళ క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ప్రస్తుతం జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News