: 2016లో సంపదను పెంచుకునే ఉత్తమ మార్గాలివి!


ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లు అద్భుత రీతిలో పయనించి 15 శాతం రాబడులను అందిస్తాయి... 2015 ఆరంభంలో అత్యధిక మార్కెట్ నిపుణుల అంచనా ఇది. కానీ వాస్తవానికి జరిగింది వేరు. మార్కెట్ 6 శాతం నష్టపోయింది. 2014లో ఒకటి లేదా రెండు సంవత్సరాల కాలపరిమితికి పెట్టుబడులు పెట్టిన వారంతా నష్టపోయారు. వారికి సాధారణ సేవింగ్స్ ఖాతాల్లో లభించేంత వడ్డీకి సమానమైన రాబడి కూడా రాలేదు. ఇక అదే ఐదారేళ్ల పెట్టుబడి కాలపరిమితిలో ఉన్న నిధులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగలేదు. ఇక ఫిక్సెడ్ డిపాజిట్లపై 8.5 శాతం రాబడి అందగా, బంగారం ధరలు 5.3 శాతం తగ్గాయి. నిర్మాణ రంగం పరిస్థితీ అంతే. సగటున గృహాల ధరలు 3.5 శాతం పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో పెట్టుబడులు ఏ రంగాల్లో ఎలా ఉంటే మేలన్న విషయమై 'ఎకనామిక్ టైమ్స్ వెల్త్' ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో 95 శాతం మంది సంపద సృష్టికి 2016 ఉత్తమ వత్సరంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్పీఎస్ ఖాతా: నేషనల్ పెన్షన్ స్కీములో కొత్త ఖాతాను ప్రారంభించడం ద్వారా సాలీనా రూ. 50 వేల పన్ను రాయితీతో పాటు వడ్డీ రాబడి కూడా ఉంటుంది. ఎన్పీఎస్ ఖాతా ప్రారంభం అత్యుత్తమమని 19.1 శాతం మంది, మంచిదని 44.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఖాతాలపై 8 శాతం వడ్డీ (సంవత్సరాంతానికి చక్రవడ్డీ) లభిస్తుంది. ఓ పదిహేనేళ్లు ఖాతాను కొనసాగిస్తే, సాలీనా సగటున 10 శాతం వృద్ధి సాధ్యమే. ఈ-వాలెట్ ప్రారంభం: 2016 కచ్చితంగా ఈ-వాలెట్ విధానానిదే అంటున్నారు నిపుణులు. ఆన్ లైన్ కొనుగోళ్లు, బిల్లు చెల్లింపులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బ్యాంకు ఖాతాల మోసాలు జరుగకుండా ఈ-వాలెట్ సహకరిస్తుందని అంచనా. ఇప్పటికే పేటీయం, పేయూ, మొబీక్విక్ వంటి సంస్థలు ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ లతో ఈ-వాలెట్ సేవలు అందిస్తున్నాయి. ఇక ఈ విధానంలో బిల్లు చెల్లింపులు జరిపితే లాభాలూ ఉంటాయి. మొబైల్ రీచార్జి, విద్యుత్, డీటీహెచ్, గ్యాస్, నిత్యావసరాలు, క్యాబ్ బుకింగ్స్, ఆన్ లైఫ్ ఫుడ్ ఆర్డర్లు, సినిమాలు తదితరాలకు నెలకు రూ. 12,500 వరకూ ఖర్చు పెడతారని భావిస్తే, ఈ-వాలెట్ వినియోగిస్తే, రూ. 1,395 వరకూ ఆదా అవుతుంది. సంవత్సరంలో ఆ మొత్తం రూ. 15 వేలకు పైగా మిగుల్చుకోవచ్చు. ఈ -వాలెట్ ప్రారంభం అత్యుత్తమమని 21.3 శాతం మంది, మంచిదని 44.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. మ్యూచువల్ ఫండ్స్: మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థుతుల్లో ఫండ్స్ ను నమ్ముకోవడం అత్యుత్తమమని 6.4 శాతం మంది, మంచిదని 29.8 శాతం మంది, ఫర్వాలేదని 31.9 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఫండ్స్ లో రూ. లక్ష పెట్టిన వారికి ఈ సంవత్సరం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల ఆదాయం చేతిలో ఉన్నట్టు. ఇక ఇప్పుడు ప్రవేశించినా అదే విధమైన ఆదాయాన్ని భవిష్యత్తులో అందుకోవచ్చని సూచిస్తున్నారు. ఫిక్సెడ్ డిపాజిట్ల స్థానంలో డెట్ ఫండ్స్: తక్కువ వడ్డీలను ఇచ్చే ఫిక్సెడ్ డిపాజిట్లతో పోలిస్తే, 2016 డెట్ ఫండ్స్ కు మరింత లబ్దిని చేకూరుస్తుందని అత్యధికుల అంచనా. డెట్ ఫండ్స్ పెట్టుబడులు అత్యుత్తమమని 31.9 శాతం మంది, మంచిదని 40.4 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటిపై పన్ను లాభాలూ ఉంటాయి. బంగారం నగదీకరణ: ఇంట్లో మూలన పడి వాడకంలో లేని బంగారాన్ని పెట్టుబడిగా పెట్టడం ద్వారా, ఎటువంటి పన్నులూ లేని 2.75 శాతం వడ్డీని పొందవచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్లలో ఈ విధానం అత్యుత్తమమని 21.3 శాతం మంది, మంచిదని 46.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. వడ్డీ తక్కువే అయినప్పటికీ, 2016లో బంగారం ధర ఓ 5 శాతం పెరిగిందనుకుంటే, వార్షిక రాబడి 7.75 శాతమవుతుంది. ఇక ప్రస్తుతం రూ. 26 వేల వద్ద ఉన్న బంగారం ధర రూ. 30 వేలకు చేరితే, బంగారం నగదీకరణలో భాగంగా పెట్టిన పెట్టుబడి సంపద సృష్టించే మంత్రదండమే అవుతుంది. సుకన్యా స్కీమ్: మీకు ఓ కూతురుండి తనకు 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసుంటే, ఈ పథకం అత్యుత్తమమని 17 శాతం మంది, మంచిదని 31.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. జనవరి 2015లో ప్రారంభమైన ఈ స్కీమ్, ప్రస్తుతానికి ఇంకా పరుగులు పెట్టనప్పటికీ, భవిష్యత్ అవసరాలను తీర్చే కల్పవృక్షమే అవుతుందని అంచనా. కనీసం రూ. 1000తో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీపై అదనంగా ముప్పావు శాతం సుకన్యా స్కీములో లభిస్తుంది. అమ్మాయి 21 సంవత్సరాలు వచ్చే వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. పన్నులూ ఉండవు. ఇంటి కొనుగోలు యత్నాలు: గడచిన ఏడాదిన్నరగా నిర్మాణ రంగం కుదేలైన వేళ, 2016లో సొంతింటి కల మరింత సులువుగా నెరవేర్చుకోవచ్చని నిపుణుల అంచనా. కొత్త గృహ యత్నాలు చేయడం అత్యుత్తమమని 17 శాతం మంది, మంచిదని 27.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేయవచ్చని సలహా ఇస్తున్నారు. కుటుంబ భవిష్యత్తు కోసం: దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు, ఆధారపడ్డ వారి భవిష్యత్తుకు ఇబ్బందులు లేకుండా చూడటం కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన జన్ ధన్ ఖాతాలు, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అత్యుత్తమమని 68.1 శాతం మంది, మంచిదని 27.7 శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక ఎంత ఆదాయం వస్తుంది, అందులో ఖర్చలెంత? ఎంత సేవింగ్స్ సాధ్యం... తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులను వివిధ విభాగాల్లో పెట్టడం మంచిదని సూచన.

  • Loading...

More Telugu News