Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధ్యప్రదేశ్ క్రీడా శాఖ ఆరోపణలపై సానియా వివరణ

మధ్యప్రదేశ్ లోని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను గొంతెమ్మ కోరికలు కోరానంటూ వచ్చిన వార్తలపై టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు. ఈ వార్తలపై సానియా వ్యవహారాలను చూసే ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే ప్రకటనను సానియా ట్విట్టర్ లో కూడా పోస్టు చేసింది. కార్యక్రమానికి హాజరు కావడానికి తాను డబ్బులు అడగలేదని, ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలని మాత్రమే అడిగానని చెప్పింది. అదే రోజు గోవాలో మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్నందునే అలా అడిగానని, అందులో తప్పేమీ లేదని పేర్కొంది. దానికి సంబంధించి ఏజెన్సీ వివరణ ఒకసారి చూస్తే, "నవంబర్ 28వ తేదీన భోపాల్ లో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు సానియా సిద్ధంగానే ఉన్నారు. దానిపై చర్చలు జరిగాయి. రూ.5 లక్షలు సానియా డిమాండ్ చేయలేదు. అయితే గోవాలో 29న జరిగే మరో కార్యక్రమానికి కూడా సానియా అంగీకరించారు. కమర్షియల్ ఫ్లైట్ లో భోపాల్ నుంచి గోవాకు వెళ్లడానికి 7 గంటల సమయం పడుతుంది. భోపాల్ నుంచి గోవాకు ప్రైవేట్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తే తప్ప రెండు చోట్ల ఉండడం ఆమెకు సాధ్యం కాదు. అందుకే ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలని కోరారు. గోవా కార్యక్రమం నెల రోజులకు ముందే ఖరారైంది. ఆ కార్యక్రమానికి సానియా వెళ్లడం బాధ్యతగా భావించారు" అని తెలిపింది. అయితే సానియాపై కొన్ని వర్గాలు చేసిన అవాంఛనీయమైన, నష్టం కలిగించే వ్యాఖ్యలకు తాము తీవ్రంగా ఆవేదన చెందామని ఏజెన్సీ తెలిపింది.

More Telugu News