Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరసింహన్ స్థానంలో జస్టిస్ సదాశివం?... గవర్నర్ మార్పుపై ఊపందుకున్న ఊహాగానాలు!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కేంద్రం తప్పించే దిశగా చర్యలు తీసుకుంటోందన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. గత నెల 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో ‘ఎట్ హోం’ పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులిద్దరూ హాజరు కాలేదు. దీంతో మనసు నొచ్చుకున్న నరసింహన్ తనను ఈ బాధ్యతలను తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే, ప్రతి అంశంలో తెలంగాణ వైపే మొగ్గుచూపుతున్నారంటూ నరసింహన్ పై ఏపీ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నరసింహన్ ను ఆ పదవి నుంచి తప్పించాలని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. మరోవైపు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని, పునర్విభజన చట్టంలోని ప్రతి అంశం నెరవేరాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది జరగాలంటే న్యాయపరమైన అంశాలపై పట్టు ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని కేంద్రం యోచిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న జస్టిస్ సదాశివం అయితే ఇందుకు సరిగ్గా సరిపోతారని కూడా కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో నరసింహన్ స్థానంలో జస్టిస్ సదాశివంను నియమించే దిశగా కేంద్రం అడుగులేస్తోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

More Telugu News