: టెక్ కంపెనీల కొత్త రూటు... ప్రొడక్టివిటీ కోసం ఆఫీసుల్లో చీర్ లీడర్స్
పని చేస్తూ ఉంటే పొట్టి స్కర్టులు ధరించిన అందమైన అమ్మాయిలు దగ్గరికి వస్తారు. వారితో ముచ్చట్లు పెడతారు. ఏం కావాలో అడిగి తెలుసుకుని తీసుకొస్తారు. జోకులేసి నవ్విస్తారు. ఆటలాడతారు. ఆఫీసుల్లో ఉద్యోగులను ఉత్సాహపరిచి వారి నుంచి మరింత ఉత్పాదకతను రాబట్టేందుకు చైనాలోని టెక్నాలజీ కంపెనీలు పాటిస్తున్న కొత్త మార్గం చీర్ లీడర్స్. వీరిని ఐటీ ఇండస్ట్రీలో 'ప్రోగ్రామింగ్ చీర్ లీడర్స్' అని పిలుస్తారు. చైనాలో పలు ఐటీ కంపెనీలు ప్రస్తుతం వీరిని నియమించి ఉద్యోగులకు ఉల్లాసం కలిగిస్తున్నాయని 'ట్రెండింగ్ ఇన్ చైనా' ప్రకటించింది. అందమైన అమ్మాయిలను నియమించిన తరువాత కంపెనీ వాతావరణం మారిందని, ఉద్యోగులు, ముఖ్యంగా పురుషులు మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారని, ప్రొడక్టివిటీ పెరిగిందని ఓ కంపెనీ మానవ వనరుల విభాగం అధికారి వివరించారు. అయితే, ఈ కొత్త పోకడలను ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. పనిపట్ల చిత్తశుద్ధి ఉండాలేకానీ అందంగా ఉన్న అమ్మాయిలను చూసి పనులు చేస్తారా? అని మహిళా ఉద్యోగులు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా, చైనాలో ఈ తరహా ట్రెండ్ కొత్తేమీ కాదు. గతంలో ఫ్యాక్టరీల్లో మరింత ఉత్పత్తి కోసం విరామ సమయాల్లో కార్మికులకు అమ్మాయిలను ఎరవేసిన చరిత్ర కూడా చైనాకు ఉంది.