బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి: ప్రభాస్
బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరానీ సినిమాలంటే ఇష్టమని 'బాహుబలి' ప్రభాస్ తెలిపాడు. 'బాహుబలి' దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్ తన ఇష్టాయిష్టాలపై మాట్లాడుతున్నాడు. రాజ్ కుమార్ హిరానీ సినిమాల్లో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్' సినిమాలు తనను బాగా ఆకట్టుకున్నాయని, వాటిని కనీసం 20 సార్లు చూసి ఉంటానని ప్రభాస్ తెలిపాడు.
'పీకే' చూశాను కానీ, అది అంతగా నచ్చలేదని ప్రభాస్ తెలిపాడు. బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయని, హడావుడిగా ఏవో ఒకటి ఒప్పుకోవాలని లేదని, మంచి సినిమాలైతే చేస్తానని ప్రభాస్ పేర్కొన్నాడు. మంచి సినిమాలెప్పుడూ పరాజయం పాలవ్వవని 'బాహుబలి' విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి రేపు విడుదల కానుంది.