Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హైదరాబాద్'లో సుడిగాళ్ళు!

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్-6లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రస్థానం మొదలెట్టిన జట్టు. ఆరు మ్యాచ్ లు పూర్తయ్యే సరికి పాయింట్ల పట్టికలో తొలి మూడు జట్లలో స్థానం. గత సీజన్ల ఫలితాలతో పోల్చితే ఇది అద్వితీయ ప్రదర్శనే. ఐపీఎల్ లో ఐదు సీజన్లపాటు డెక్కన్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళే ఇప్పుడు సన్ రైజర్స్ కు ఆడుతున్నారు. అప్పుడు కనిపించని సమష్టితత్వం తాజాగా భారీ ఎత్తున వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు తేలిపోయినట్టు కనిపించిన ఆటగాళ్ళు నేడు అరివీర భయంకరుల మల్లే చెలరేగిపోతున్నారు.

బ్యాటింగ్ లో సంగక్కర ,వైట్, పెరీరా, ఆశిష్ రెడ్డి, పార్థివ్ పటేల్ తమ శక్తిమేర రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. బౌలింగ్ లో అయితే స్టెయిన్, ఇషాంత్ లు ప్రత్యర్థి జట్టు టాపార్డర్ లకు కొరకరాని కొయ్యలుగా పరిణమించడం విశేషం. ఇక స్పిన్ లో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాయాజాలం కొనసాగుతోంది. మిశ్రా ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసి పుణే వారియర్స్ చేతుల్లోంచి మ్యాచ్ ను లాగేసుకోవడం నిజంగా అద్భుతం.

ఇలా ప్రతి ఆటగాడు జట్టుకు ఏదోలా ఉపయోగపడుతూ, కష్టసాధ్యమైన పరిస్థితుల్లో సైతం అసమాన ప్రదర్శనలతో, అంతకుమించి అదృష్టంతో సుడిగాళ్ళను తలపించడం లేదూ? లీగ్ దశలోనే కాకుండా, ఆ తర్వాత నాకౌట్ సమరాల్లోనూ సన్ రైజర్స్ ఇలాంటి ఆటతీరుతో దూసుకెళితే టైటిల్ ఖాతాలో చేరడం తథ్యం కాదా..!?

More Telugu News