ముఖ్యమంత్రి అంచనాలను అందుకోలేకపోయాం: సునీల్ మిట్టల్
భారతీ ఎయిర్ టెల్ సీఈవో సునీల్ మిట్టల్ ముఖ్యమంత్రి చంద్రబాబును విశాఖలో కలుసుకున్నారు. సెల్ ఫోన్ ఆపరేటర్లతో సమీక్ష సమయంలో వచ్చిన ఆయనకు ఇంకా పునరుద్ధరణ కాని ఎయిర్ టెల్ కమ్యూనికేషన్ గురించి బాబు వివరించారు. అనంతరం మిట్టల్ మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే పనుల్లో వెనుకపడ్డామన్నారు. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
ఎయిర్ టెల్ నెట్వర్క్ పునరుద్ధరణలో సిబ్బంది 48 గంటల పాటు శ్రమించారన్నారు. ఎల్లుండిలోగా అన్ని ప్రాంతాల్లో తమ నెట్వర్క్ సేవలు వస్తాయని, సాయంత్రానికి మరో ఐదు ప్రాంతాల్లో ఎయిర్ టెల్ సేవలు పునరుద్ధరిస్తామని మిట్టల్ తెలిపారు. ఇంకా ఆరు ప్రాంతాల్లో యాంటెనాలను అమర్చాల్సి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అంచనాలను అందుకోలేకపోయామన్న మిట్టల్, ప్రభుత్వం సహాయ చర్యలు అభినందనీయమన్నారు.