తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వం మరోమారు పదవి చేపట్టబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలిత, శనివారమే జైలుకెళ్లారు. అంతేగాక, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కోర్టులో దోషిగా తేలిన జయలలిత సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే హోదానూ కోల్పోయారు. ఈ నేపథ్యంలో, తమిళనాడుకు కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నేడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తన స్థానంలో ఎవరిని ఎన్నుకోవాలన్న విషయంపై జయలలిత, శనివారమే పార్టీకి సీల్డ్ కవర్ ను అందజేసినట్లు సమాచారం. 2001లో టాన్సీ భూముల కేసుల్లో జయలలిత, సీఎం కుర్చీ దిగిపోగా, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. తనకు నమ్మినబంటుగా పేరుపడ్డ పన్నీర్ సెల్వంను నాడు జయలలిత, సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. తాజాగా, ఆయన కంటే జయలలితకు నమ్మిన బంటు ఎవరూ లేరనే చెప్పాలి. అంతేగాక, నాడు జయలలిత సీటులో కూర్చున్న పన్నీర్ సెల్వం, సీఎం కుర్చీలో కాకుండా, పక్కనే మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తద్వారా జయలలితపై ఆయన తన విధేయతను చాటుకున్నారు. ఇక, నిర్ణయాల పరంగా చూసినా, ఆయన జయ మాట దాటలేదు. దీంతో, ఈ దఫా కూడా పన్నీర్ సెల్వమే సీఎంగా నియమితులు కానున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక, సీఎం రేసులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్, స్పీకర్ ధనపాల్, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత తంబిదురై, రాజ్యసభ సభ్యుడు నవనీత కృష్ణన్ ఉన్నారు. అయితే, వీరందరిలోకి పన్నీర్ సెల్వంకే అవకాశాలెక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. నేటి మధ్యాహ్నంలోగా కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారన్న విషయం తేలిపోనుంది.

More Telugu News