దేశవాళీ క్రికెటర్ రిటైర్మెంట్ పై స్పందించిన సచిన్
బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా ముంబయి క్రికెట్ కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ ఆటకు వీడ్కోలు పలికాడు. సహచరుడి రిటైర్మెంట్ పై బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. మజుందార్ తన క్రీడాస్ఫూర్తితో ప్రత్యేక ముద్ర వేశాడని, అతనేంటన్నది అతని బ్యాటింగే చెప్పిందని సచిన్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపిన సచిన్, రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్ళ బృందంలోకి మజుందార్ కు 'వెల్ కమ్' చెప్పాడు. అటు, స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ కూడా మజుందార్ వీడ్కోలు ప్రకటనపై స్పందించాడు. మజుందార్ ఎప్పుడూ ఆటలో పూర్తిగా లీనమైపోతాడని, ముంబయి క్రికెట్లో అతనికి రావాల్సినంత పేరు రాలేదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ దేశవాళీ క్రికెట్లో తన తొలి సీజన్ ను ముంబయి తరపున మజుందార్ కెప్టెన్సీలోనే ఆడాడు.
మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడి 48.13 సగటుతో 11,167 పరుగులు చేశాడు. వాటిలో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే... ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 6 వికెట్లు తీశాడు. ముంబయి స్కూల్ క్రికెట్లో సచిన్, కాంబ్లీ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సమయంలో వారిద్దరి తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్నది మజుందారే. కానీ, మిత్ర ద్వయం నాటౌట్ గా నిలవడంతో మజుందార్ కు బ్యాటింగ్ కు దిగే అవకాశం రాలేదు. మజుందార్ గత రంజీ సీజన్ లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.