జూన్ తర్వాత కూడా విభజన ప్రక్రియ: జైరాం రమేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూన్ తర్వాత కూడా విభజన ప్రక్రియ: జైరాం రమేశ్

జూన్ రెండో తేదీకల్లా కొంతమేరకు అవసరమైన విభజన ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత కూడా కొంత ప్రక్రియ ఉంటుందని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. విభజన ప్రక్రియ తీరుపై తాను రాష్ట్ర గవర్నర్, చీఫ్ సెక్రటరీలతో సమావేశమై సమీక్షించానని ఆయన తెలిపారు. విభజన విషయమై ఆయన హైదరాబాదులో ఇవాళ మీడియాతో మాట్లాడారు. విభజన ప్రక్రియపై ఏర్పాటైన 21 కమిటీలు ఈ నెలాఖరు కల్లా నివేదికలు ఇస్తాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 26 లక్షల ఫైళ్లను గుర్తించి డిజిటలైజ్ చేశామని ఆయన చెప్పారు. లక్షా 40 వేల ఒప్పందాలు, కాంట్రాక్టులను గుర్తించామని, వాటిలో ఏపీకి 75 వేలు, తెలంగాణకు 62 వేలు, మిగిలినవి ఉమ్మడివని వివరించారు.

ఇక ఉమ్మడి రాజధాని అయిన జీహెచ్ఎంసీ పరిధిలో 85 వేల చదరపు మీటర్ల భవనాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 3.40 లక్షల ఫించనుదారులుండగా వ్యయం రూ.700 కోట్లు ఉంటుందని, అలాగే తెలంగాణలో 2.40 లక్షల మంది పెన్షనర్లపై రూ.500 కోట్ల వ్యయం ఉంటుందని అన్నారు. కమలనాథన్ కమిటీ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకుంటుందని జైరాం తెలిపారు.అయితే, ఆప్షన్స్ ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పలేనని, విభజన ప్రక్రియలో ఆప్షన్స్ తీసుకోవడం ఒక పద్ధతి మాత్రమేనని అన్నారు.

119 కంపెనీలు, కార్పొరేషన్ లను విభజించాల్సి ఉందని, తుంగభద్ర బోర్డును కర్ణాటక, తమిళనాడు, ఏపీ సభ్యులతో కేంద్రం పునరుద్ధరిస్తుందని జైరాం రమేష్ చెప్పారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ ది ప్రత్యేక బాధ్యతని పునర్విభజన చట్టంలో ఉందని, దానిపైనే గవర్నర్ కేంద్రాన్ని వివరణ కోరారని తెలిపారు.

More Telugu News