: పోలీసైతే కొట్టేస్తారా? అంటూ ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో ఓటేసేందుకు వచ్చిన రైల్వే ఉద్యోగిపై స్థానిక ఎస్సై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగి తనను ఎందుకు కొట్టారని నిలదీశారు. అంతే సాక్షాత్తూ ఎస్సై అయిన తననే ప్రశ్నించడంతో ఆయన అహం దెబ్బతింది. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. దీంతో రైల్వే ఉద్యోగి 'తాను కూడా ఉద్యోగినేనని, ఉద్యోగాలు ప్రజాసౌకర్యం కోసం ఉన్నవన్న విషయాన్ని మర్చిపోవద్దని' హిత బోధ చేశారు.
దీంతో మరింత మండిపడ్డ ఎస్సై అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అతను కూడా కలబడ్డాడు. ఈ క్రమంలో ఎస్సై డ్రెస్ కు ఉండే స్టార్ పడిపోయింది. దాంతో పోలీసు ఉద్యోగానికే అవమానం జరిగిందని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా చూస్తున్న స్థానికులు పోలీసు జులుం నశించాలంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. రైల్వే ఉద్యోగిని విడుదల చేస్తే కానీ ఓటింగ్ నిర్వహించనీయమని పోలింగ్ బహిష్కరించారు.