సమాజ్ వాదీ పార్టీపై మళ్లీ కేంద్రమంత్రి దూకుడు
సమాజ్ వాదీ పార్టీపై కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎస్పీకి నాలుగు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఆ తర్వాత ఆ పార్టీకి అంత్యక్రియలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మాయావతి పార్టీ బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో 36 సీట్లు అవలీలగా గెలుచుకుంటుందన్నారు.
ఇదిలావుంటే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు తీవ్రవాదులతో సంబంధాలున్నాయని మంత్రి బేణీ ఇంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించడంతో, అనంతరం తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని బేణీ వివరణ ఇచ్చారు కూడా. ఇప్పుడు మళ్లీ ములాయం టార్గెట్ గా బేణీ వాక్బాణాలు సంధిస్తుండడం గమనార్హం. గతంలో సమాజ్ వాది పార్టీలో పనిచేసిన బేణీ ప్రసాద్ వర్మ కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.