Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణకు దసరా ముందే వచ్చేసిందన్న జానా

తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు దసరా పండుగ ముందే వచ్చేసినట్టు ఫీలవుతున్నారని రాష్ట్ర మంత్రి జానారెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తన నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టి-నోట్ ఆమోదించిన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్, అధినేత్రి సోనియా, కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కోసం కృషి చేసిన ప్రజాసంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నెల 18 నుంచి తెలంగాణ జిల్లాల్లో జైత్రయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాల్లో సభలు జరుపుతామని పేర్కొన్నారు. ఈ యాత్ర ముగిసిన తర్వాత హైదరాబాదులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వివరించారు. త్వరలో తేదీ ఖరారు చేస్తామన్నారు.ఇక సీమాంధ్ర ప్రజల ఆందోళన బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆందోళనలు కొనసాగితే విద్వేషాలు ప్రబలే ప్రమాదం ఉందని జానా అభిప్రాయపడ్డారు. ఉద్యమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, బొత్సను టార్గెట్ చేయడం సరికాదన్నారు. అపోహలను, అనుమానాలను తొలగించుకునేందుకు సీమాంధ్ర ప్రజలకు సహకరిస్తామన్నారు.

More Telugu News