మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ

మన శరీరంలో కళ్లు, ముక్కు, నోరు, గుండె, కాలేయం, కిడ్నీలు.. ఇలా ఎన్నో అవయవాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఇప్పటివరకు మనం గుర్తించని, గమనించినా అవయవంగా పరిగణించని కొత్త అవయవాలూ ఉన్నాయని మీకు తెలుసా? ఇటీవల శాస్త్రవేత్తలు అలాంటి రెండు అవయవాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భాగంగా ఉండే మిసెంటరీ (Mesentery) ఒక స్వతంత్ర అవయవమని ఐర్లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లిమరిక్ శాస్త్రవేత్త కెల్విన్ కొఫె జనవరి నెలలో ప్రకటించగా.. తాజాగా ఇంటర్ స్టిటియంగా పిలుస్తున్న ఓ అవయవ వ్యవస్థను అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తగా గుర్తించిన ఈ అవయవం ఎక్కడో ఓ మూలన ఉండేదికాదు.. శరీరమంతటా విస్తరించి ఉండేది కావడం గమనార్హం. మరి వైద్యారోగ్య సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన దశలోనూ మనలో మనకు తెలియని అవయవాలు వుండడం చిత్రం కదా.. మరి ఈ అవయవాల గురించి తెలుసుకుందాం...

ఎప్పుడో గుర్తించినా అవయవంగా పరిగణించని మిసెంటరీ

మన జీర్ణ వ్యవస్థలో చిన్న పేగులకు అనుసంధానంగా ఉండే భాగం మిసెంటరీ. ఈ భాగాన్ని కొన్ని వందల ఏళ్ల కిందే గుర్తించినా.. దానిని ప్రత్యేక అవయవంగా గుర్తించలేదు. చిన్నపేగులు, పెద్దపేగులను, పొట్టలోని ముందు భాగాన్ని అనుసంధానిస్తూ ఉండే ఈ అవయవం జీర్ణ వ్యవస్థను ఆవరించి ఉంటుంది. దీనిపై దాదాపు ఆరేళ్లపాటు పరిశోధన చేసిన పరిశోధకుడు కెల్విన్ కొఫె.. మిసెంటరీ స్వతంత్రంగా పనిచేసే వేరే అవయవంగా పలు ఆధారాలను గుర్తించారు. తన పరిశోధన వివరాలతో ‘ది లాన్సెట్’ మెడికల్ జర్నల్ లో వ్యాసం కూడా రాశారు.

కడుపు, జీర్ణ వ్యవస్థ పనితీరు, వ్యాధులపై ప్రభావం

సాధారణంగా మనం ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే.. సంబంధిత అవయవం పనితీరు దెబ్బతినడంగానీ, ఏదైనా వ్యాధికి లోనవడం గానీ జరుగుతుంది. జీర్ణ వ్యవస్థలో మిసెంటరీని కొత్త అవయవంగా గుర్తించడం, దాని పనితీరు కొంత విభిన్నంగా ఉన్నట్టు తెలుస్తుండటం నేపథ్యంలో.. జీర్ణ వ్యవస్థ పనితీరు, పొట్టకు సంబంధించిన వ్యాధులపై ప్రస్తుతం ఉన్న అవగాహన మారిపోయే అవకాశముందని కెల్విన్ కొఫె చెబుతున్నారు. మిసెంటరీ చేసే పనిమీద ఇంకా పూర్తి స్పష్టత రాలేదని.. మరికొంత పరిశోధన చేయాల్సి ఉందని అంటున్నారు. మిసెంటరీ అంతర్గత నిర్మాణాన్ని పూర్తిగా పరిశీలించామని తెలిపారు.

విభిన్న అవయవం ఇంటర్ స్టిటియం

వైద్య శాస్త్రంలో పెను మార్పులకు కారణమయ్యే అవకాశమున్న అవయవం ‘ఇంటర్ స్టిటియం’. ఇది శరీర కణజాలాలు, అవయవాల మధ్య వివిధ రకాలైన ద్రవ పదార్థాలతో నిండి.. వాటిని రవాణా చేసేందుకు వీలుగా, పూర్తిగా అనుసంధానమై ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలో చర్మం కింద, జీర్ణవ్యవస్థలో, ఊపిరితిత్తులు, మూత్రపిండ వ్యవస్థలలో, కండరాల చుట్టూరా ఈ ఇంటర్ స్టిటియమ్ అవయవ వ్యవస్థ ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన పథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నీల్ థైస్ వెల్లడించారు. దీనికి సంబంధించి సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించారు.

కణజాలాల మధ్య హైవేలుగా..

సాధారణంగా కణజాలాల మధ్య ఉండే ఖాళీల్లో కొల్లాజెన్ ప్లాస్మా స్థితి (అంటే ద్రవ స్థితి, ఘన స్థితులకు మధ్యలో ఉండే స్థితి)లో ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భావించేవారు. కానీ ఆ ఖాళీలు ప్లాస్మా వంటి స్థితి కాకుండా పూర్తిగా ద్రవాలు ప్రవహించే హైవేల వంటి నిర్మాణాలని తాజాగా గుర్తించారు. శరీరంలో కీలకమైన పలు రకాల ప్రొటీన్లు, ఇతర రసాయన పదార్థాలు ఈ ఇంటర్ స్టిటియమ్ ద్వారా ప్రవహిస్తున్నాయని నిర్ధారించారు. ఈ నిర్మాణాలు సాధారణ మైక్రోస్కోపిక్ స్లైడ్ లపై కనిపించకపోవడంతో ఇంతకాలం గుర్తించలేకపోయారని డాక్టర్ నీల్ థైస్ చెప్పారు. తాము ఈ కణజాలాన్ని అతిసన్నని ముక్కలుగా కత్తిరించి.. వివిధ రసాయనాలు, రంగులతో కలిపి అత్యాధునిక ఇమేజింగ్ టెక్నాలజీతో పరిశీలించినప్పుడు.. ఇంటర్ స్టిటియం మార్గాలను గుర్తించామని తెలిపారు.

అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది..

శరీరంలో కొత్తగా ఇంటర్ స్టిటియం వ్యవస్థను గుర్తించిన నేపథ్యంలో.. శరీరంలో పలు రకాల సమస్యలు, వ్యాధులకు సంబంధించి సరికొత్త పరిశోధనలు జరిగే అవకాశముందని డాక్టర్ నీల్ థైస్ చెప్పారు. ముఖ్యంగా శరీరంలో కేన్సర్ ఒక చోటి నుంచి మరో చోటికి విస్తరించే అంశానికి సంబంధించి కచ్చితమైన వాస్తవాలు వెలుగు చూసే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా మనం వినియోగించే ఔషధాల పనితీరు కూడా ఈ వ్యవస్థ వల్ల ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు. కణజాలాల మధ్య ద్రవంతో నిండి ఉన్న ఈ ఇంటర్ స్టిటియం నిర్మాణాలు.. మన నిత్య జీవితంలో శరీర భాగాలపై పడే ఒత్తిడి తట్టుకునేందుకు షాక్ అబ్జార్బర్లుగా పనిచేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే తాము గుర్తించిన కొత్త వ్యవస్థను ఇంకా అధికారికంగా నిర్ధారించలేదని చెప్పారు.

వైద్య శాస్త్రంలో భారీగా మార్పులకు అవకాశం

కొత్త అవయవాల గుర్తింపుతో మానవ శరీర శాస్త్రం, వైద్య శాస్త్రాలలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొత్త అవయవాలు పనిచేసే తీరు, ఇవి తమ చుట్టూ ఉన్న అవయవాలతో అనుసంధానమై ఉండడం, వాటి పనితీరును ప్రభావితం చేయడం వంటి అంశాల కారణంగా.. ఇతర అవయవాలకు సంబంధించిన అంశాల్లోనూ మార్పులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.
  • మిసెంటరీని విడిగా కొత్త అవయవంగా గుర్తించడం వల్ల పొట్ట, జీర్ణ వ్యవస్థల పనితీరు, సమస్యలు మారుతాయి. వాటికి వచ్చే వ్యాధులకు వినియోగించే ఔషధాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
  • మిసెంటరీని ప్రత్యేక అవయవంగా గుర్తించిన నేపథ్యంలో.. ఇప్పటికే దీనిపై వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించడం మొదలైందని, వైద్య పాఠ్య పుస్తకం గ్రేస్ అనాటమీలోకి కూడా మిసెంటరీ ఎక్కిందని శాస్త్రవేత్త కెల్విన్ కొఫె వెల్లడించారు.
  • ఇక ఇంటర్ స్టిటియం అనేది పూర్తి కొత్తగా గుర్తించిన అవయవం. శరీరంలో కణజాలాలు, అవయవాల మధ్య ద్రవ రూప రవాణా మార్గాలతో కూడిన ఈ వ్యవస్థ.. మన శరీరశాస్త్రం, వైద్య శాస్త్రాల్లో పెను మార్పులకు కారణమయ్యే అవకాశముంది. ఎందుకంటే మన శరీరంలో రక్తం, లింఫ్, ఇతర ప్రొటీన్లు, హార్మోన్ల రవాణా వంటి ఎన్నో కీలకమైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ కొత్త పరిశోధన వాటికి సంబంధించి మార్పులకు కారణమవుతుంది.
  • శరీరంలో లింఫ్, రక్తం రవాణా మార్గాల ద్వారానే కేన్సర్, ఇతర వ్యాధులు ఒక చోటి నుంచి మరో చోటికి విస్తరిస్తున్నట్టుగా భావిస్తున్నారు. తాజాగా ఇంటర్ స్టిటియం కూడా ఇందులో చేరనుంది.


More Articles