హాలోజెన్ ఓవెన్లతో అన్ని రకాల వంటలూ ఈజీ.. కొనే ముందు ఇవి తెలుసుకోండి!

మనకు ఓవెన్లు అనగానే మైక్రోవేవ్ ఓవెన్లు గుర్తుకువస్తాయి. అవి చాలా కాలంగా అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో జనానికి చేరువకాలేదు. మైక్రోవేవ్ ఓవెన్లను వినియోగించడం ఎలాగో తెలియకపోవడం, రేడియేషన్ విడుదల చేస్తుందనే భయాలు, ధరలు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. ఇలాంటి పరిస్థితుల్లోనే సరికొత్తగా హాలోజెన్ ఓవెన్లు మార్కెట్ లోకి వచ్చాయి. సంప్రదాయంగా చేసుకునే అన్ని రకాల వంటకాలు కూడా దీనితో సులువుగా, వేగంగా చేసుకునే అవకాశం ఉండడంతోపాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండడం హాలోజెన్ ఓవెన్ల ప్రత్యేకత. మరి ఈ హాలోజెన్ ఓవెన్లు ఎలా పనిచేస్తాయి, వాటితో ప్రయోజనాలు ఏమిటి, ఏదైనా ప్రమాదం ఉంటుందా, ధరలు ఎలా ఉంటాయి తదితర అంశాలను తెలుసుకుందాం..

ఏమిటీ హాలోజెన్ ఓవెన్?

 హాలోజెన్ ఓవెన్లు చూడగానే కాస్త చిత్రంగా, ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని పరికరాల్లాగా కనిపిస్తాయి. పూర్తిగా ఖాళీ గాజు పాత్ర తరహాలో ఉండి.. కేవలం పైన బోర్లించే మూతలోనే వేడిని విడుదల చేసే హాలోజెన్ పరికరాలు, డిస్ప్లే, స్విచ్ లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. దీంతో ఈ ఓవెన్ ను ఆపరేట్ చేయడం ఎలా, వంటలు చేయడం ఎలాగనే సందేహాలు తలెత్తుతాయి. కానీ దీనిలో చాలా సులువుగా వంటలు చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉషా, రస్సెల్, రెడ్మండ్, ఓస్టర్ తదితర బ్రాండ్ల హాలోజెన్ ఓవెన్లు లభిస్తున్నాయి. వీటి ధరలు రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు ఉన్నాయి.

ఎలా పనిచేస్తుంది?

హలోజెన్ ఓవెన్ లో పైన బోర్లించే మూతలో హాలోజెన్ బల్బు, ఉష్ణోగ్రతను నియంత్రించే థర్మోస్టాట్, చిన్నపాటి ఫ్యాన్లు ఉంటాయి. పైన ఉన్న స్విచ్ ల ద్వారా మనకు వంట చేసేందుకు కావాల్సినంత వేడిని, సమయాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ వివరాలు కనిపించేందుకు డిస్ప్లే కూడా ఉంటుంది.ఈ ఓవెన్ మూతలో కిందివైపు ఉన్న హాలోజన్ బల్బు వెలగడంతో.. ఓవెన్ లోకి వేడి కాంతి (ఇన్ ఫ్రారెడ్) విడుదలవుతుంది. ఇక ఓవెన్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ తిరగడం ద్వారా వేడి ఓవెన్ అంతటా సమానంగా విస్తరిస్తుంది. ఈ వేడికి ఓవెన్ లో మనం పెట్టిన ఆహార పదార్థాలు ఉడుకుతాయి.
  • ఓవెన్ లోని థర్మోస్టాట్ ఎప్పటికప్పుడు ఓవెన్ లోని వేడిని గమనిస్తూ.. మనం ఎంపిక చేసిన మేరకు ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. వేడి ఎక్కువైతే హాలోజన్ బల్బును ఆఫ్ చేస్తుంది. వేడి తగ్గగానే తిరిగి ఆన్ చేస్తుంది. ఇలా బల్బు ఆన్, ఆఫ్ అవుతూ ఓవెన్ లో వేడి సమానంగా కొనసాగుతుంది.

ఎన్నో ప్రయోజనాలు..

  • సాధారణ మైక్రోవేవ్-కన్వెక్షన్ ఓవెన్లతో పోలిస్తే దాదాపు మూడు రెట్ల వేగంతో వంటలు చేసుకోవడానికి వీలవుతుంది.
  • మైక్రోవేవ్ ఓవెన్లలో ద్రవ పదార్థాలు, కోడిగుడ్లు వంటివి ఉడికించడం ప్రమాదకరమైన పని. ఎందుకంటే వాటిలో ద్రవ పదార్థాలు వేడయ్యాక.. కదిలిస్తే ఒక్కసారిగా ఎగజిమ్ముతాయి. కోడిగుడ్లు అయితే పేలుతాయి. అదే హలోజెన్ ఓవెన్లలో ఇలాంటి ప్రమాదం ఉండదు. 
  • హలోజెన్ ఓవెన్ల పరిమాణం చిన్నగా ఉండడం వల్ల వంట గదిలో స్థలం సమస్య కూడా ఉండదు. 
  • పూర్తిగా గాజు వంటి పాత్రతో ఉండడంతో.. వంట ఎలా ఉడుకుతోంది, ఏమవుతోందనేది ఎప్పటికప్పుడు గమనించేందుకు వీలుగా ఉంటుంది.
  • ఓవెన్ నడుస్తుండగా ఒకవేళ మూతను పైకి తీస్తే.. వేడిని విడుదల చేసే హాలోజెన్ బల్బు దానంతట అదే వెంటనే ఆగిపోతుంది. మళ్లీ మూత పెట్టేయగానే.. ఆన్ అయి అప్పటికే కొనసాగుతున్న వంటను పూర్తి చేస్తుంది.

కేకులు వంటివి సులువుగా చేసుకోవచ్చు..

హాలోజెన్ ఓవెన్లలో కేకులు, పఫ్ లు వంటివి అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మన ఇళ్లలో ఉండే స్టవ్ లు, మైక్రోవేవ్ ఓవెన్లలో ఇవి తయారు చేయడం కష్టం. అదే హాలోజెన్ ఓవెన్ లో అయితే బాగా చేసుకోవచ్చు. ఇందుకోసం ఓవెన్ ను ప్రత్యేక సెట్టింగ్ లో ఉపయోగించుకోవాలి.

విద్యుత్ వినియోగమూ తక్కువే..

సాధారణంగా హాలోజెన్ బల్బు అనగానే అత్యధిక మోతాదులో విద్యుత్ వినియోగించుకుంటుందని అనుకుంటాం. అది కొంతవరకు నిజమే కూడా. కానీ హాలోజెన్ ఓవెన్లలో వంట ఏకంగా మూడు రెట్లు వేగంగా అవుతుంది కాబట్టి మైక్రోవేవ్ ఓవెన్లతో పోలిస్తే తక్కువ విద్యుత్ వినియోగం అవుతుందని చెప్పవచ్చు. 

కొనే ముందు ఇవి గమనించండి

హాలోజెన్ ఓవెన్లు వివిధ పరిమాణాల్లో, వివిధ మోడళ్లలో లభిస్తుంటాయి. అందులో మనకు కావాల్సిన పరిమాణం, సౌకర్యాలతో పాటు మనం పెట్టగలిగే ధర స్థాయి వంటి వాటిని కొనుగోలు సమయంలో పరిగణనలోకి తీసుకోవాలి.
  • ముఖ్యంగా పలు మోడళ్ల హాలోజన్ ఓవెన్లలో కేవలం హీట్ (వేడి) సెట్టింగ్స్ మాత్రమే కాకుండా.. వివిధ రకాల వంటలకు సంబంధించి ప్రీ కుకింగ్ సెట్టింగులు ఉంటున్నాయి. అంటే ఏదైనా కేవలం ఆవిరిపై ఉడకబెట్టడం, చికెన్ లేదా ఫిష్ ఫ్రై చేయడం వంటి సెట్టింగ్స్ ఉంటాయి. ఆయా వంటకాలకు సంబంధించి ఎంత వేడి, ఏ విధంగా కావాలన్నది దీంతో ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. వంట కూడా సులువుగా అవుతుంది.
  • హాలోజెన్ ఓవెన్లలో బేసిక్ మోడళ్లలో పైన ఉండే మూతను పూర్తిగా తీసి పక్కన పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల మూత తీసి పక్కన పెట్టడంలో జాగ్రత్త తీసుకోకపోతే దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే వీటి ధర తక్కువ. చిన్నగా ఉండి తక్కువ స్థలంలో ఇమిడిపోతాయి. 
  • హాలోజెన్ ఓవెన్లలో వినియోగించుకునేందుకు వీలుగా వివిధ పాత్రలు, ఉపకరణాలు కూడా ఇస్తుంటారు. ఆవిరిపై ఉడకబెట్టుకునేందుకు వీలుగా, ఫ్రై,గ్రిల్, కేకుల వంటివి చేసుకునేందుకు వీలుగా, ఇంకా వివిధ రకాల వంటలు సులువుగా చేసుకునేందుకు తోడ్పడే పాత్రలు, ఉపకరణాలు ఉంటాయి. వీటిలో ఓవెన్ తోపాటు ఏమేం ఉచితంగా ఇస్తున్నారో, ఏవి విడిగా కొనుక్కోవాలో చూసుకోవాలి.
  • కొన్ని కంపెనీలు వంట ఉపకరణాలతోపాటు ఆ ఓవెన్లో ఏయే వంటలు ఎలా చేసుకోవాలో తెలిపే పుస్తకాలను కూడా అందజేస్తాయి. వీటితో వంటలు చేసుకోవడం సులువవుతుంది.  ముఖ్యంగా కేకులు తయారు చేసుకోవడం వంటి వాటికి తోడ్పడుతుంది.
  • కొన్ని రకాల మోడళ్లలో మూత కూడా బిగించి ఉండేలా ఏర్పాటు ఉంటుంది. అంటే మూతను పూర్తిగా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా.. ఓ పక్కకు జరిపేలా ఏర్పాటు ఉంటుంది. 
  • సెల్ఫ్ క్లీనింగ్ ఆప్షన్ ఉందో లేదో చూడండి. ఉంటే ఓవెన్ ను శుభ్రం చేయడం చాలా సులభంగా పూర్తవుతుంది.
  • ఇక మన బడ్జెట్, అవసరాన్ని బట్టి ఓవెన్ ను ఎంచుకోవాలి. లేకపోతే అటు డబ్బు వృథా కావడంతోపాటు, ఇటు ఓవెన్ ను కూడా పూర్తిగా వినియోగించుకోలేం.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు

హాలోజెన్ ఓవెన్లతో వంటలు చేసుకోవడం సులువే అయినా కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రుచికరమైన వంటలను వేగంగా చేసుకోవడం తోపాటు ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చు. అంతేగాకుండా ఓవెన్ ఎక్కువ కాలం పాటు మన్నుతుంది.
  • హాలోజెన్ ఓవెన్ల మూత భాగంలోనే హాలోజెన్ బల్బు వంటి కీలక పరికరాలన్నీ ఉంటాయి. అందువల్ల మూతను తీసి పక్కన పెట్టినప్పుడు, తిరిగి అమర్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే పరికరం దెబ్బతింటుంది.
  • ముఖ్యంగా హాలోజెన్ ఓవెన్, దాని మూత కూడా గాజుతోనే తయారై ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పగిలే అవకాశం ఉంటుంది.
  • ఈ ఓవెన్లలో వంటలేవైనా చేసినప్పుడు వెలువడే పొగ ప్రధానంగా మూతకు, హీటింగ్ ఎలిమెంట్ కు తగులుతుంది. దీనివల్ల జిడ్డుగా తయారవుతుంది. దీనిని జాగ్రత్తగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.


More Articles