ఎత్తు పెరిగేందుకు మార్గాలు ఏవైనా ఉన్నాయా...?

ఆరడుగుల ఎత్తు... ఆజాను బాహువుగా ఉన్నవారి వైపు సహజంగానే చుట్టూ ఉన్నవారి చూపులు వెళ్లిపోతుంటాయి. తాను ఆరడుగుల ఎత్తులో ఉండాలని ప్రతి ఒక్క పురుషుడూ కోరుకుంటాడని అనడంలో సందేహం లేదు. అయితే, మన దేశంలో ఈ మాత్రం పొడవు ఉండే వారి సంఖ్య అత్యల్పం. కనీసం 5.9 అడుగుల ఎత్తున్న వారి సంఖ్య కూడా తక్కువే. ఎక్కువ శాతం మంది 5.6 నుంచి 5.8 మధ్య వారే. కొందరైతే మరీ తక్కువ పొడువుతో ఉంటారు. ఎందుకన్నది అంతుబట్టదు. కానీ తాము పొడవుగా ఉండాలన్న కాంక్ష చాలా మందిలో బలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎత్తు పెరిగేందుకు దారితీసే అంశాలు, తమ వంతు ఏం చేయవచ్చన్న అంశాలు తెలుసుకుందాం...


representational imageఓ మనిషి ఆరడుగుల ఎత్తు ఎదగడానికి, పొట్టిగా ఉండడానికి వారి జన్యు సంబంధిత అంశాలు, పర్యావరణ, ఇతర అంశాల ప్రభావం ఉంటుంది. ఒక్కసారి గ్రోత్ ప్లేట్స్ మూసుకుపోయాయంటే ఇక ఆ తర్వాత వారి ఎత్తు అంతటితో నిలిచిపోయినట్టే. ఇవి మూసుకుపోకముందే పొడవు పెరిగేందుకు తమ వంతు కృషి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

జన్యువుల పాత్ర
representational imageమీ ఎత్తు ఎంతుండాలన్నది మీ కుటుంబ సభ్యుల భిన్న రకాల జన్యువులే నిర్దేశిస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా సంక్రమంచిన జన్యువులే ఎత్తుకు కారణం అవుతాయి. వీటినే పాలీజెనిక్ అంటారు. తల్లి, దండ్రి ఇద్దరూ పొట్టిగా ఉంటే వారికి పుట్టే పిల్లలు పొట్టిగా ఉండాలనేం లేదు. అలాగే, తల్లిదండ్రులు పొడువుగా ఉంటే వారి పిల్లలు పొడవుగా ఉంటారని కచ్చితంగా చెప్పడానికి లేదు. ఇరువైపుల వారు పొట్టిగా ఉంటే మాత్రం పుట్టే పిల్లలు ఎత్తు తక్కువగానే ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. తాము ఎంత పొడవు అవుతామన్నది శారీరక ఎదుగుదల ముగిసే వరకూ తెలియదు. 18 ఏళ్లకు సమీపంలోకి వస్తే కానీ పూర్తి స్థాయి ఎత్తు బయటపడదు.

వ్యతిరేక చర్యలు వద్దు...
ఓ వ్యక్తి పొడవులో జన్యువుల పాత్ర ఎంత ముఖ్యమో, ఇతర అంశాల పాత్ర కూడా అంతే ఉంటుంది. తమంతట తామే ఎత్తు పెంచుకుందామంటే అందుకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ, సహజ ఎత్తు పెరిగేందుకు అడ్డు పడే అంశాలను నియంత్రించడం ద్వారా ఫలితం పొందొచ్చు. పోషకాహార లోపం ఉంటే పూర్తి స్థాయి ఎత్తు ఎదగలేరు. డ్రగ్స్, ఆల్కహాల్ ఎదుగుదలను నిరోధించేవి. కెఫైన్ నేరుగా ఎదుగుదలపై ప్రభావం చూపించదు. కానీ, శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే నిద్రను దూరం చేస్తుంది. చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారికి కనీసం 9-10 గంటల నిద్ర అవసరం. కొలంబియా యూనివర్సిటీ ఇంటర్నెట్ హెల్త్ రీసోర్స్ పరిశోధనా ఫలితాల ప్రకారం... పొగతాగినా, ఇతరులు తాగి వదిలిన పొగను పీల్చినా శారీరక పొడవుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్ధారణ అయింది. ఇక స్టెరాయిడ్స్ ఔషధాల వినియోగం వల్ల కూడా ఎత్తుపై ప్రభావం పడుతుంది.

సరిపడినంత నిద్ర
representational imageహ్యుమన్ గ్రోత్ హార్మోన్ (హెచ్ జీహెచ్) మన శరీరంలో పిట్యూటరీ గ్రంధిలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా నిద్ర సమయంలోనే ఇది చురుగ్గా ఉంటుంది. మంచి నిద్ర వల్ల హ్యుమన్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొన్ని కేసుల్లో హెచ్ జీహెచ్ ను మందుల ద్వారా వైద్యులు సూచించొచ్చు. వీటివల్ల దుష్ప్రభావాలు అధికం. ఈ విషయమై వైద్యుల సమక్షంలోనే సందేహాలు తీర్చుకోవడం మంచిది. నిద్ర సమయంలో నిటారుగా, వెల్లకిలా వెన్నుపై నిద్రించాలి. సాధ్యమైనంత వరకూ శరీరాన్ని తిన్నగా ఉండేలా చూసుకోవాలి. మొదట్లో కొన్ని రోజుల పాటు అసౌకర్యంగా అనిపించినా ఇలా చేయడం వల్ల పొడవు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అలాగే, తలకింద దిండు లేకుండా పడుకుంటే అది వెన్నుకు మంచిది.

పోషకాహారం
representational imageపొడవు పెరిగేందుకు కీలకమైన అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందేలా చూసుకోవాలి. సరైన పోషకాహారం అందడం లేదని భావిస్తే వైద్యుల సూచనతో సప్లిమెంట్లను తీసుకోవాలి. చిన్నారులకు కార్బోహైడ్రేట్స్, కేలరీలు, క్యాల్షియం అధికంగా అవసరం అవుతాయి.

శారీరక ఎదుగుదలలో ఎముకల వృద్ధి కీలకం. చిన్నారుల్లో ఎముకలు, కండరాల వృద్ధికి విటమిన్ డి తోడ్పడుతుంది. మన శరీరంలోని ఎముకలు క్యాల్షియం తగినంత గ్రహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోజూ కొంత సమయం పాటు సూర్యుని వెలుగు చర్మాన్ని తాకేలా చూసుకుంటే విటమిన్ డి అందుతుంది. ప్రొటీన్లు తగినంత అందేలా చూసుకునేందుకు గుడ్లు, బీన్స్, చీజ్, మాంసం తీసుకోవచ్చు. ప్రొటీన్లు తగినంత అందకపోతే ప్రొటీన్ పౌడర్ పాలతో కలిపి తీసుకోవాలి.

అలాగే, జింక్ లోపించినా ఎదుగుదల ఉండాల్సినంత ఉండదు. ఉదయం మంచి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలి. ఎగ్స్, పాలు, డ్రైఫ్రూట్స్ ఇవ్వొచ్చు. ఇచ్చే వాటిలో క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. పండ్లు, పాలకూర, క్యారట్స్ కూడా ఆహారంలో భాగం చేయాలి.శరీరానికి సరైన ఇంధనం అందితే అన్ని రకాల వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. రక్త సరఫరా మెరుగై, అధిక మెటబాలిక్ రేటుతో, ఎముకలు బలంగా, పొడవుగా తయారవుతాయి. ఇవన్నీ సరైన సమతుల, పోషకాహారంతో సాధ్యం. అలా అని బాగా దండిగా తినేసి శరీర బరువును పెంచుకోవడం కాదు. బరువు అధికమైతే ఎత్తుకు ప్రతిబంధకం అని తెలుసుకోవాలి.

రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా
సరైన పోషకాహారం, తగినంత నిద్ర, నిరంతరం వ్యాయామం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొన్ని రకాల వ్యాధులు ఎదుగుదలకు అడ్డు పడతాయి. అందుకే ఆయా వ్యాధులపై పోరాడడానికి గాను రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా అందేలా చూసుకుంటే అది రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది. విటమిన్ సి కమలా, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష పండ్లలో సమృద్దిగా లభిస్తుంది. ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, కేలరీలు లేని ఆహారం, ఫ్యాట్ అధికంగా ఉండే వాటిని దూరంగా ఉంచాలి.

శారీరక వ్యాయామాలు
representational imageశారీరక వ్యాయామాలు ఎత్తు ఎదిగేందుకు చక్కగా సాయపడతాయి. కొందరిలో 20-25 ఏళ్ల వరకు వ్యాయామాల కారణంగా ఎత్తు పెరిగేందుకు అవకాశాలుంటాయి. స్ట్రెచింగ్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి.
  • మనిషి పొడవు పెరిగేందుకు ఈత సాయపడుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.
  • తాడుతో స్కిప్పింగ్ చేయడం కూడా ఎత్తు పెరిగే వ్యాయామాల్లో ఒకటిగా పేర్కొంటారు. రక్త సరఫరా మెరుగుపడి ఎముకలపై ఒత్తిడి పడేలా చేసి పొడవు పెరిగేందుకు సాయపడుతుంది. కనీసం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు స్కిప్పింగ్ చేయాలి.
  • బాస్కెట్ బాల్, టెన్నిస్ సైతం పిల్లలు పొడవు పెరిగేందుకు దోహదం చేస్తాయి.
  • పులప్స్ కూడా ఎత్తు పెరిగేందుకు సాయపడే వ్యాయామమే.
  • ఫ్లోర్ పై నిటారుగా నించుని శరీరాన్ని పక్కకు వంచి 15 సెకండ్ల పాటు అలానే ఉంచేసిన తర్వాత తిరిగి నిటారుగా రావాలి. అలాగే, మరోవైపునకూ శరీరాన్ని బెండ్ చేసి ఇంతే చేయాలి.
  • representational imageనడుమును ముందుకు వంచి చేతులతో నేలను పట్టుకోవాలి. ఈ సమయంలో మోకాళ్లు వంగకుండా చూసుకోవాలి. దీంతో స్పైన్ కు సాగే గుణం అలవడుతుంది.
  • క్రీడలు పిల్లల్లో ఎదుగుదలను ఎంతగానో ప్రేరేపిస్తాయి.
  • అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వ్యాయామాల వల్లే ఎత్తు పెరగడం అసాధ్యం. కాకపోతే ఇవి ఎత్తు పెరిగేందుకు శరీరంలోని జాయింట్లకు, కండరాలకు ప్రేరణను కలిగిస్తాయి. ఈ వ్యాయామాల వల్ల ఓ పావు అంగుళం నుంచి అర అంగుళం వరకు అదనంగా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంది.
మంచి భంగిమ
representational imageఓ వ్యక్తి పూర్తి స్థాయి పొడవు పెరిగేందుకు సరైన భంగిమ కూడా ముఖ్యమన్న విషయం చాలా మందికి తెలియదు. నిటారుగా నించోవడం ఇందుకు సాయపడుతుంది. దీనివల్ల ఎముకల వృద్ధి సాఫీగా జరుగుతుంది. తల ఏ విధంగా ఉంచాలి, ఏ కోణంలో నించోవాలి, నడిచే సమయంలో ఏ విధంగా ఉండాలన్న విషయాలను వైద్య నిపుణుల నుంచి తెలుసుకోవచ్చు. దీంతో సాధ్యమైనంత పొడవు పెరుగుతారు.

వైద్య నిపుణుల సూచనలు
పొడవుగా ఉండే కుటుంబంలో ఉండి, టీనేజీ మధ్య వయసు నాటికీ సరైనంత పొడవు పెరగకుంటే వైద్యులను సంప్రదించడం అవసరం. ఎందుకంటే వైద్యులు గ్రోత్ హార్మోన్ లోపించిందా, లేక రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిందా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నది గుర్తించి చికిత్స సూచిస్తారు.


More Articles