నార్త్ కొరియా గురించి ఏది నిజం?

ఈ ప్రపంచంలో అన్ని దేశాలూ నాణెంలో బొమ్మ వైపు ఉంటే ఉత్తరకొరియా మరోవైపు ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దేశం ఓ నియంత పాలనలో కొనసాగుతోంది. అతడే కిమ్ జాంగ్ ఉన్. కిమ్ కుటుంబ పాలనలో మగ్గిపోతున్న ఉత్తరకొరియా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

representational imageచైనా, దక్షిణ కొరియాల మధ్య ఉన్న చిన్న దేశమే ఉత్తరకొరియా. ఇక్కడి జనాభా 2.5 కోట్లు. రాజధాని ప్యాంగ్యాంగ్ లో 30 లక్షల మంది నివసిస్తున్నారు. 1948 నుంచి ఈ దేశం కిమ్ కుటుంబ పాలనలోనే మగ్గిపోతోంది. ఈ దేశ మొదటి పాలకుడు కిమ్ ఐఎల్ సంగ్. ఇతడు 1994 వరకు పాలించాడు. హార్ట్ ఎటాక్ వల్ల చనిపోవడంతో ఆయన బాధ్యతల్లోకి  కుమారుడు కిమ్ జాంగ్ ఐఎల్ వచ్చాడు. ఈయన కూడా 2011 డిసెంబర్ లో గుండెపోటుతోనే చనిపోయాడు. దీంతో ఆయన వారసుడు, ప్రస్తుత నేత అయిన కిమ్ జాంగ్ ఉన్ పాలన మొదలైంది.

1945లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొరియా రెండు భాగాలుగా విడిపోయింది. అవి ఇప్పుడు దక్షణ కొరియా, ఉత్తరకొరియాగా చలామణి అవుతున్నాయి. ఉత్తరకొరియా వ్యవసాయ ఆధారిత దేశమే.

ఉత్తర కొరియాలో ప్రజా జీవితం
ఈ ప్రపంచంలో బాగా అణచివేతతో కూడిన దేశాల్లో ఉత్తరకొరియా కూడా ఒకటని సాక్షాత్తూ మానవ హక్కుల పరిశీలన వేదిక నొక్కి చెప్పింది. ఈ సంస్థ స్వయంగా వెల్లడించిన వివరాల మేరకు... ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తూ ప్రజల్ని తనకు నిర్బంధ విధేయతతో ఉండేలా చేస్తున్నాడు. దేశం నుంచి పారిపోకుండా, విదేశాల్లో ఆశ్రయం పొందే అవకాశం లేకుండా రవాణాపై ఆంక్షలున్నాయి. దేశ విదేశాల్లో మతపరమైన సంబంధాలను కలిగి ఉన్న వారిని హింసించడం కిమ్ అనుసరించే చర్యల్లో ఒకటి.

నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష
తప్పు చేసిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను లేబర్ క్యాంపులకు పంపడం ఇక్కడ చూడొచ్చు. ఈ కేంద్రాల్లోనే హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, బలవంతపు గర్భస్రావాలు, లైంగిక వేధింపులు సర్వసాధారణం. ఇక్కడ నిర్బంధించిన వారి జీవితం ఇక్కడ ముగిసిపోవాల్సిందే. ఒక వ్యక్తి నేరం చేస్తే మూడు తరాల వారు శిక్ష అనుభవించాలి. నేరం చేసిన వ్యక్తి, అతడి వారసులు, వారసుల సంతానం వరకు కారాగార క్యాంపుల్లో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఈ తరహా నిబంధన మరెక్కడా లేదు. చట్టాన్ని ఉల్లంఘించినా సరే నిర్బంధ కారాగార క్యాంప్ కు పంపిస్తారు. అలాగే, వారి సంతానం, వారి సంతానానికి కలిగే సంతానం కూడా ఆ క్యాంపుల్లో మగ్గిపోవాల్సిందే. ఈ దేశంలో ప్రభుత్వమే స్త్రీ, పురుషులకు కలిపి 28 రకాల హెయిర్ స్టయిల్స్ ను ఖరారు చేసింది. ప్రజలు వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టయిల్ మాత్రం మరే తలపైనా కనిపించకూడదు. ఇక్కడ ప్రజల మానవ హక్కుల హననం జరుగుతోందని ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ కూడా పేర్కొంది. దేశంలో ఉన్న ఆరు భారీ రాజకీయ కారాగార క్యాంపుల్లో 2,00,000 మంది వరకు ఉంటారని ప్రకటించింది.

ఆధునిక సౌకర్యాలు కొందరికే
representational imageఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ ఒక్కటే అభివృద్ధి చెందిన నగరంగా కనిపిస్తుంది. అందంగానూ ఉంటుంది. రాజధాని 30 లక్షల మందికి ఆశ్రయం ఇస్తోంది. రాజభక్తి కలిగిన వారు, ప్రభుత్వ ఉద్యోగులకే ఇక్కడ చోటు. ఇక్కడ ట్రాఫిక్ ను మహిళా ట్రాఫిక్ ఇన్ స్ట్రక్టర్లు నియంత్రిస్తుంటారు. విదేశీ ఫ్యాషన్ వస్త్రాలు సైతం ఇక్కడి దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. ఇక్కడి ప్రజల్లో కొంత మందికే ఇంట్రానెట్ సదుపాయం ఉంది. 30 వెబ్ సైట్లకు మించి రావు. ప్రభుత్వంలోని ఐటీ విభాగం సొంతంగా రెడ్ స్టార్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించింది.

ప్రభుత్వ ఉద్యోగులే ఇక్కడ సంపన్నులు. వీరే డిజైనర్ వస్త్రాలు ధరించడం, రెస్టారెంట్లను ఆస్వాదించడం చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. ఇక్కడ విద్యుత్ కొరత అతిపెద్ద సమస్య. రాజధాని తోపాటు దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు తప్పవు. ప్యాంగ్యాంగ్ లో భూమికి 110 మీటర్ల కింద ట్రాక్ తో మెట్రో కూడా ఉంది. ఎస్కలేటర్ సాయంతో ప్లాట్ ఫామ్ పైకి వెళ్లేందుకు మూడున్నర నిమిషాలు పడుతుంది. ఈ దేశంలో పాలన ఇప్పటికీ గత పాలకులు నిర్ణయించిన నియంతృత్వ విధానాలతోనే కొనసాగుతోంది.

representational imageఏటా జూలై 8, డిసెంబర్ 17న పుట్టిన రోజు సంబరాలు చేసుకునేందుకు అనుమతి లేదు. ఎందుకంటే కిమ్ సంగ్, కిమ్ జాంగ్ ఐఎల్ మరణించిన రోజులివి. కిమ్ జాంగ్ ఉన్ తన తండ్రి కిమ్ జాంగ్ ఐఎల్ మృత దేహాన్ని అద్దాల బాక్స్ లో పెట్టించి ప్రదర్శనగా ఉంచే ఏర్పాటు చేశాడు. ఈ దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నిక జరుగుతుంది. కానీ బ్యాలట్ పేపర్ పై కిమ్ జాంగ్ ఉన్ పేరు ఒక్కటే ఉంటుంది. ఉత్తరకొరియా కేలండర్ కూడా మొదటి పాలకుడైన కిమ్ ఐఎల్ సంగ్ పుట్టిన సంవత్సరం 1912 (ఏప్రిల్ 15) నుంచే మొదలైంది. దీంతో 2017 సంవత్సరం అక్కడి వారికి 106వ సంవత్సరం అవుతుంది. ఇక్కడ గంజాయి సాగు, పంపిణీ, వినియోగం అన్నీ చట్టబద్ధమే. బైబిల్ కలిగి ఉన్నా, దక్షిణ కొరియా సినిమాలు చూసినా, పోర్నోగ్రఫీ వీడియోలు పంపిణీ చేసినా ఉరికి వేలాడాల్సిందే.

ఈ దేశంలో ప్రతీ కిలోమీటrepresentational imageర్ కు ఒక కింగ్ సంగ్ విగ్రహం కనిపిస్తుంది. ఆయన్నే దేవుడిగా ఆరాధించాలి. దేశ వ్యవస్థాపకుడైన ఇతడి పట్ల తమ విధేయతను ప్రజలు బ్యాడ్జీ ధరించడం ద్వారా చూపించాల్సి ఉంటుంది. కింగ్ పాలకుల విగ్రహాలను ముందు నుంచే పూర్తి రూపాన్ని ఫొటోలుగా తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. సగం తీసుకునేందుకు, వెనుక నుంచి ఫొటోలు తీసుకునేందుకు అనుమతి లేదు. దేశంలో ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే అనుమతి అవసరం.

 అమెరికా సామ్రాజ్యవాదానికి గుర్తు అయిన జీన్స్ ను ఇక్కడ ధరించడం నిషిద్ధం. దేశంలో మూడే టీవీ చానల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా పరిమిత వేళల పాటు వచ్చేవే. అందులోనూ ప్రభుత్వం గురించి అనుకూల కథనాలే ఉంటాయి. ప్రతీ ఇంట్లోనూ రేడియో ఉంటుంది. ఇందులో ప్రభుత్వ నియంత్రిత ప్రసారాలే ఉంటాయి. ఇక్కడ 26,000 కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం ఉంది. 5,200 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం ఉంది.

ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలుగా ఉత్తరకొరియా, సోమాలియాలను 2015 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకటించింది. ఇక్కడ వైద్య సౌకర్యాలు చాలా పరిమితం. విద్యా సౌకర్యాలు ఫర్వాలేదు. ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కూర్చుని వీక్షించగలిగే సామర్థ్యం ఉన్న రంగనాథో మేడే స్టేడియం ప్యాంగ్యాంగ్ లో ఉండడం విశేషం. ఈ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 1,50,000 మంది.

సైన్యం
representational imageద కొరియన్ పీపుల్స్ ఆర్మీ (కేపీఏ) ఈ దేశ సైనిక విభాగం. ఇందులో 11,06,000 మంది నిరంతరం పనిచేసే సైనికులు కాగా, 83,89,000 మంది రిజర్వ్ సైనికులు. అవసరమైనప్పుడు రంగంలోకి దిగుతారు.

అమెరికా-కొరియా వైరం ఎందుకు
1950-53 మధ్య ఉత్తరకొరియా, దక్షిణ కొరియాల మధ్య యుద్ధం జరిగింది. ఈ సందర్భంలో అమెరికా దక్షిణ కొరియాకు అండగా నిలబడింది. ఆ సమయంలో ఉత్తరకొరియాకు అండగా నిలిచింది చైనా మాత్రమే. దక్షిణ కొరియా అమెరికాకు ఆరో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ కారణాలతో ఉత్తరకొరియా అమెరికాకు వ్యతిరేకంగా మారిపోయింది. స్వీయ రక్షణ కోసం అణు క్షిపణుల తయారీ, ప్రయోగాలపై దృష్టి పెట్టింది. ఇవన్నీ అమెరికాకు కంటగింపుగా మారిపోయాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి.

చైనా ఉత్తర కొరియాకు సర్ది చెప్పడం లేదెందుకు?
ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా ఉత్తరకొరియాకు సద్దిచెప్పాలన్నది అమెరికా డిమాండ్. కానీ అది చైనాకు ఇష్టం లేదు. ఉత్తరకొరియాను చైనా రక్షణగోడగా భావిస్తోంది. ఉత్తరకొరియాను దారిలో పెట్టి, రెండు కొరియాల మధ్య స్నేహం చిగురు తొడిగితే అప్పుడు కొరియాలు రెండు ఏకం అయ్యే అవకాశం లేకపోలేదు. అది చైనాకు మింగుడుపడని అంశం. ఎందుకంటే కొరియాలు రెండూ ఏకమైతే అమెరికా ఇప్పటికే దక్షిణ కొరియా మిత్ర దేశంగా ఆ దేశ భూభాగాన్ని వినియోగించుకోగలదు. దాంతో చైనా సమీపానికి చేరుకుంటుంది. అందుకే చైనా తన స్వప్రయోజనాల కోసం నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలకు సహకారం అందిస్తూనే ఉంది. అలాగే, మరో అంశం కూడా ఉంది. ఉత్తరకొరియాలో కిమ్ జాంగ్ ఉన్ పదవీచ్యుతుడు అయితే ఆ దేశం అస్థిరతలోకి వెళుతుంది. దాంతో లక్షల సంఖ్యలో ప్రజలు పక్కనే ఉన్న చైనాకు వలసపోతారు. ఇది కూడా చైనాకు తలనొప్పి సమస్య.

పరిష్కారం
representational imageఉత్తరకొరియా అణు క్షిపణి కార్యక్రమానికి స్వస్తి పలకడం లేదా అమెరికాయే ఉత్తరకొరియాను అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశంగా గుర్తించడం సమస్యకు పరిష్కారంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దాదాపు ఈ రెండూ అసాధ్యమే. ఎందుకంటే ఉత్తరకొరియా అణు క్షిపణులను త్యజించే పరిస్థితే లేదు. నిజానికి విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాల ప్రకారం చూస్తే ఉత్తరకొరియాను కాపాడుతున్నది అణు క్షిపణులే. అవే లేకపోతే ఇరాక్, అఫ్ఘానిస్తాన్, సిరియా తదితర దేశాల మాదిరిగా ఉత్తరకొరియాపైనా అమెరికా ఇప్పటికే దాడులు చేసి ఉండేది. అమెరికాను తాకే క్షిపణులు ఉత్తరకొరియా దగ్గర ఉండడంతో అగ్ర రాజ్యం మాటలతో, హెచ్చరికలతో మిన్నకుండిపోతోంది. అయితే, అమెరికా వద్ద క్షిపణి నిరోధక వ్యవస్థ ఉంది. తమ దేశంపైకి వచ్చే క్షిపణులను కూల్చేయగలదు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఒకవేళ దాడికి దిగినా అగ్రరాజ్యం నష్టపోయేది తక్కువే. కానీ, అమెరికా ప్రతి దాడికి దిగితే ఉత్తరకొరియా తీవ్రంగా నష్టపోక తప్పదు. ఇక ఉత్తరకొరియా క్షిపణి కార్యక్రమానికి మద్దతు పలికే స్థితిలో అమెరికా లేదు. అమెరికాకు జపాన్, దక్షిణ కొరియాలు వాణిజ్య భాగస్వాములు, మిత్ర దేశాలు. చైనా కూడా అతిపెద్ద వాణిజ్య భాగస్వామే అయినప్పటికీ ఆ దేశం అగ్రరాజ్యానికి కంటగింపు దేశమే. మరి చైనాకు మిత్ర దేశమై, జపాన్, దక్షిణకొరియాలకు శత్రుదేశంగా మారిన ఉత్తరకొరియాను అగ్రరాజ్యం అక్కున చేర్చుకునే అవకాశం లేదన్నది పరిశీలకుల అభిప్రాయం.

ఇతర దేశాలతో సంబంధాలు
representational imageఉత్తరకొరియాకు చుట్టుపక్కల చైనా, రష్యా, దక్షిణ కొరియా, జపాన్ ఉన్నాయి. ఈ ప్రాంతంపై అమెరికా దాడికి దిగితే ప్రాంతీయంగా అస్థిరతకు దారితీస్తుంది. అందుకు రష్యా సైతం ఉత్తరకొరియాకు అనుకూలంగా అమెరికాపై గళం విప్పుతూ ఉంటుంది. పైగా ఉత్తరకొరియా ఇంధన రంగంలో రష్యా భారీగా పెట్టుబడులు పెట్టి ఉంది. రెండు దేశాల మధ్య రైల్వే నెట్ వర్క్ విస్తరణపైనా చర్చలు నడిచాయి. రష్యా, చైనాలతో తప్ప ఇతర దేశాలతో ఉత్తరకొరియాకు స్నేహ సంబంధాలేమీ లేవు. ఈ దేశంలో 99 శాతం అక్షరాస్యులే అని ప్రకటించినప్పటికీ నిజంగా ఎంతమంది అక్షరాస్యులన్నది తెలియదు.

కిమ్ జాంగ్ ఉన్ పాలన
representational imageతండ్రి మరణంతో దేశాధినేత అయిన కిమ్ జాంగ్ ఉన్ వెంటనే తన సొంత బాబాయి జాంగ్ సాంగ్ తాక్ దగ్గర్నుంచి రాజకీయ, సైనిక ప్రత్యర్థుల వరకు అందర్నీ ఉరితీయించాడు. అణు క్షిపణి కార్యక్రమాలను ప్రోత్సహించాడు. తన తర్వాత మరే వ్యక్తి పవర్ ఫుల్ గా ఉండకూడదన్నది ఉన్ పాటించే సూత్రం. ఒకవేళ మరెవరైనా బలపడుతున్నారంటే వారిని వెంటనే చంపిస్తాడని దక్షిణ కొరియా భద్రతా విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉన్ కు సోదరుడైన కిమ్ జాంగ్ నామ్ కౌలాలంపూర్ లో హత్యకు గురికావడం వెనుక ఉన్ ఆదేశాలు ఉన్నాయని విశ్లేషకుల భావన. ఉత్తరకొరియాలో ప్రస్తుతం అమల్లో ఉన్న అణచివేత విధానాలన్నీ కూడా అతడి, తండ్రి, తాతల హయాంలో మొదలైనవే. కాకపోతే వాటిని కిమ్ మరింత దారుణంగా అమలు చేయడమే గమనించాల్సింది. కిమ్ జాంగ్ ఉన్ కు బాస్కెట్ బాల్ అంటే పిచ్చి. మైఖేల్ జోర్డాన్ అంటే అభిమానం.


More Articles