ఆండ్రాయిడ్ లో అవసరమైన సెట్టింగ్స్... తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే

నేడు దాదాపుగా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. మరీ ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రవేశం తర్వాత స్మార్ట్ ఫోన్, డేటా వాడకం ఓ అలవాటుగా మారిపోయిందంటే ఆశ్చర్యం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ పై పనిచేస్తున్నవే ఉంటున్నాయి. సాధారణంగా ఎక్కువ మంది ఫోన్ ను వాడుకోవడం మినహా ఆ ఫోన్లో ఏమున్నాయి? వాటి అవసరం గురించి తెలుసుకునే వారు తక్కువే. కానీ, ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిన కీలకమైన సెక్యూరిటీ సెట్టింగ్స్ కొన్ని ఉన్నాయి.


పటిష్టమైన పాస్ కోడ్

representational imageఈ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్లలో ఐవోఎస్, ఆండ్రాయిడ్ తో నడిచేవి 98 శాతం. ఈ రెండింటిలోనూ ఆండ్రాయిడ్ మార్కెట్ షేరు 85 శాతానికి పైగా ఉంటుంది. ఆ తర్వాత గణనీయమైన వాటా ఐవోఎస్. అయితే, యాపిల్ ఐవోఎస్ సాఫ్ట్ వేర్ భద్రతా పరంగా పటిష్టమైంది. కానీ ఆండ్రాయిడ్ అలా కాదు. ప్రపంచంలో ఎక్కువ మంది దీన్ని వాడుతున్నారు. దీంతో హ్యాకర్లు ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్లో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని యూజర్లను టార్గెట్ చేసుకుంటున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఫోన్ సెట్టింగ్స్ లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని నివారించొచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్ కు పాస్ కోడ్ పెట్టుకోవాలి. మరొకరు ఊహించని విధంగా ఉండాలి.

ఫోన్ ను ఎన్ క్రిప్ట్ చేసేయండి

representational imageమీ ఫోన్ ను, ఫోన్ లోని వ్యక్తిగత డేటాపై ఎవరూ నిఘా వేయకుండా ఉండాలంటే, హ్యాకర్ల నుంచి రక్షణ పొందాలంటే ఎన్ క్రిప్షన్ చేసుకోవడం మంచిది. ఫోన్ లోని సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఆప్షన్ కు వెళ్లాలి. అందులో ఎన్ క్రిప్ట్ డివైజ్ అనే మరొక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఒక మెస్సేజ్ కనిపిస్తుంది. ‘‘మీ అకౌంట్లు, సెట్టింగ్స్, డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్, దానిలోని డేటా, మీడియా, ఇతర ఫైల్స్ ఎన్ క్రిప్ట్ అవకుండా పాస్ కోడ్ లేదా ప్యాటర్స్ లేదా న్యూమరిక్ పిన్ ను సెట్ చేసుకోవాలని అడుగుతుంది. ఆ తర్వాత ఫోన్ పవర్ ఆన్ చేసిన ప్రతీసారీ ఈ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ ను తిరిగి డీక్రిప్ట్ చేయాలంటే ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేసుకోవాల్సిందే. ఇదొక గంట వరకు సమయం పట్టొచ్చు. తగినంత చార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జింగ్ పెట్టి ఎన్ క్రిప్షన్ ఎంచుకోవాలి’’ అంటూ ఆ సందేశంలో ఉంటుంది. కింద ఎన్ క్రిప్ట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేసుకోవాలి.

బ్యాకప్

representational imageఆండ్రాయిడ్ ఫోన్ లో మరో ముఖ్యమైన ఫీచర్ డేటా బ్యాకప్ చేసుకోవడం. ఫోన్ లో క్లౌడ్ ఆధారిత బ్యాకప్ ఎంచుకోవడం వల్ల మీ ఫోన్లోని డేటా అంతా వెళ్లి కంపెనీల సర్వర్లలో చేరిపోతుంది. దీనికంటే కూడా మెమొరీ కార్డులోకి లేదా పెన్ డ్రైవ్ లోకి లేదా సిస్టమ్ లోకి బ్యాకప్ తీసుకుంటే నయం. క్లౌడ్ ఆధారిత బ్యాకప్ ఆన్ చేసుకోవడం వల్ల ప్రయోజనం కూడా ఉంది. ఒకవేళ మీ ఫోన్ పోగొట్టుకుంటే అటువంటి సందర్భంలో డేటా బ్యాకప్ అక్కరకు వస్తుంది. పాత ఫోన్ లో ఉన్న డేటా సమాచారం, సెట్టింగ్స్ ను కొత్త ఫోన్ లో పొందొచ్చు. బ్యాకప్ ఆన్ చేసుకుని ఉంటే ఓ యాప్ డిలీట్ అయి మళ్లీ ఇన్ స్టాల్ చేసుకుంటే అంతకుముందున్న సెట్టింగ్స్, బ్యాకప్ డేటాను తిరిగి పొందడానికి వీలుంటుంది. సెట్టింగ్స్ లోనే బ్యాకప్ అండ్ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే బ్యాకప్ మై డేటా అనే ఆప్షన్ టాప్ లో కనిపిస్తుంది. వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆన్ లో ఉంచాలి.

గూగుల్ యాడ్స్

representational imageగూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ యూజర్ల అవసరాలు, అభిరుచులను వారి బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా గమనించి వారి కోసమే ప్రత్యేకమైన ప్రకటనలను పంపిస్తుంటుంది. మీకు ఏవి ఇష్టం, ఏవి ఇష్టం లేదు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, అలవాట్లను గూగుల్ తో పాటు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఇతర కంపెనీలు కూడా ట్రాక్ చేస్తాయి. ఈ ప్రకటనల గోల వద్దనుకుంటే గూగుల్ యాడ్ ట్రాకింగ్ ను ఆఫ్ చేసుకోవాలి. ఫోన్ లోని సెట్టింగ్స్ లో గూగుల్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులోనే ఏడీఎస్ కూడా ఉంటుంది. ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ యాడ్స్ పర్సనలైజేషన్’ అనే ఆప్షన్ డిఫాల్ట్ గా ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని ఆన్  చేసుకోవాలి. గూగుల్ అన్నది  చాలా ఇంటెలిజెంట్ అసిస్టెంట్ లా పనిచేస్తుంది. కావాల్సిన సమాచారాన్ని చిటికెలో అందిస్తుంది. ఇందుకోసం మన ఫోన్లోని డేటాను ఎత్తుకుపోయేందుకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మీ ఫోన్లో జీ అనే సింబల్ తో ఉన్న గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో పైన మూడు అడ్డగీతల దగ్గర క్లిక్ చేస్తే అందులో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అందులో చాలా ఆప్షన్లు ఉంటాయి. ఒక్కోదాన్ని జాగ్రత్తగా పరిశీలించి అవసరం లేదనుకున్నవి ఆఫ్ చేసుకోవాలి.

లొకేషన్ హిస్టరీ

మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవర్ని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈ తరహా సమాచారాన్ని ట్రాక్ చేయడం ద్వారా గూగుల్ సందర్భోచితమైన ప్రకటనలను ప్రదర్శిస్తుంది. గోప్యత కావాలనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో లొకేషన్ ఆప్షన్ కు వెళ్లాలి. ఇక్కడ పైన కనిపించే ఆప్షన్ ను ఆఫ్ చేసుకోవడం, అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవడం చేయొచ్చు. ఇక్కడే కింది భాగంలో గూగుల్ లొకేషన్ హిస్టరీ అని ఒకటుంటుంది. దీన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. లొకేషన్ హిస్టరీని చెరిపేయవచ్చు. దీంతో గూగుల్ సర్వర్ల నుంచి ఆ సమాచారం తొలగిపోతుంది.

స్లీప్ టైమ్ అవుట్ ను తగ్గించండి

representational imageఫోన్ లో స్లీప్ టైమవుట్ ను 30 సెకండ్లు అంతకంటే తక్కువ సమయానికి సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ సమయం తర్వాత ఫోన్ లాక్ అవుతుంది. తక్కువ సమయం సెట్ చేసుకుంటే ఉదాహరణకు 15 సెకండ్లుగా నిర్ణయిస్తే... ఫోన్ స్క్రీన్  15 సెకండ్లు ఆపరేట్ చేయకుండా ఉంటే వెంటనే లాకవుతుంది. దీంతో ఇతరులు యాక్సెస్ చేయకుండా ఫోన్ కు కొంత వరకు రక్షణ లభిస్తుంది. మళ్లీ కావాలంటే అన్ లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇలా స్లీపింగ్ టైమ్ ను తగ్గించిన తర్వాత మరో ఆప్షన్ కూడా ఎంచుకోవడం మంచిది.

సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఆప్షన్ లో ఆటోమేటికల్లీ లాక్ అనే ఆప్షన్ ను ఇమీడియట్లీ అని పెట్టుకోవాలి. అంటే స్క్రీన్ ఆఫ్ అయిన వెంటనే లాక్ కూడా అయిపోతుంది. ఇమీడియట్లీ కాకుండా మీరు 5 సెకండ్లు లేదా 15 సెకండ్లు పెట్టారనుకుందాం. అప్పుడు ఫోన్ స్క్రీన్ 15 సెకండ్లకు ఆఫ్ అయినప్పటికీ లాక్ వెంటనే కాదు. మీరు ఆటోమేటికల్లీ లాక్ ను ఎంత సమయానికి నిర్దేశిస్తే అప్పుడే లాక్ అవుతుంది. అందుకే ఇమీడియట్లీ అని పెట్టుకుంటే స్క్రీన్ ఆఫ్ అయిన వెంటనే ఫోన్ కూడా లాక్ కూడా అయిపోతుంది.

ఎరేజ్

ఎన్ని లాక్స్ పెట్టుకున్నప్పటికీ ఎవరో ఒకరు మీ ఫోన్ యాసెస్ కోసం అనధికారికంగా ప్రయత్నిస్తే రక్షణ కల్పించేందుకు ఎరేజ్ ఆప్షన్ ఒకటుంది. ఫోన్ ను అన్ లాక్ చేసేందుకు వరుసగా పది ప్రయత్నాలు ఫెయిలైతే వెంటనే ఆ ఫోన్ లోని మొత్తం డేటాను ఆండ్రాయిడ్ సిస్టమ్ ఎరేజ్ చేస్తుంది. ఇందుకోసం ఫోన్ లో సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఆప్షన్ కు వెళ్లాలి. ఆటోమేటికల్లీ వైప్ అనే సెట్టింగ్ ను ఆన్ చేసుకోవాలి. చైనా బ్రాండ్ ఫోన్లలో అసలు సెక్యూరిటీ ఆప్షనే ఉండదు. దీంతో చైనా బ్రాండ్లను వాడే వారికి ఈ అవకాశం లేదు.  

స్క్రీన్ పై అన్ని నోటిఫికేషన్లు వద్దు

స్క్రీన్ లాక్ లో ఉన్నప్పుడు ఏవైనా మెస్సేజ్ లు వచ్చినా, కాల్స్ వచ్చినా పైన నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ లు వచ్చే విషయం తెలుసు. ఆ మేస్సేజ్ ఎవరి నుంచి వచ్చిందన్న స్వల్ప సంకేతం కూడా అక్కడ కనిపిస్తుంది. కానీ, ఇలా ప్రతీ నోటిఫికేషన్ ను బయటకు చూపించడం వల్ల మీ సున్నిత సమాచారం ఇతరుల కంట్లో పడే అవకాశం ఉంటుంది. అందుకని నోటిఫికేషన్లు కనిపించకుండా ఆఫ్ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ లో సౌండ్ అండ్ నోటిఫికేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో కింది భాగంలో ‘వెన్ డివైజ్ ఈజ్ లాక్డ్’ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. మూడు ఆప్షన్లుంటాయి. షో ఆల్ నోటిఫికేషన్ కంటెంట్, హైడ్ సెన్సిటివ్ నోటిఫికేషన్ కంటెంట్, డోంట్ షో నోటిఫికేషన్ ఎట్ ఆల్ అనే ఆప్షన్లలో మీకు కావల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. హైడ్ సెన్సిటివ్ నోటిఫికేషన్ కంటెంట్ ఎంచుకుంటే మాత్రం మీకు మెస్సేజ్, మెయిల్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ గా తెలియజేస్తుంది. కానీ, ఎవరి నుంచి వచ్చిందన్న సోర్స్ బయటకు కనిపించదు.

గుర్తింపులేని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవద్దు

representational imageఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ నుంచే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోగలం. కానీ, ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ పై గూగుల్ ప్లేస్టోర్ అనుమతి లేని యాప్స్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల మాల్వేర్ దాడులు జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మాల్వేర్ చెక్ చేసిన యాప్స్ నే డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా సెట్టింగ్స్ లో సెక్యూరిటీ ఆప్షన్ కు వెళ్లి అన్ నౌన్ సోర్సెస్ ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేసినప్పటికీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావాల్సిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అప్ డేట్

ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి వచ్చే సెక్యూరిటీ ఆప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఫోన్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ ను క్లిక్ చేస్తే సిస్టమ్ అప్ డేట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే అప్ డేట్ ఉందీ, లేనిదీ తెలుస్తుంది.

మీ ఫోన్ ఎక్కడుందో?

representational imageఫోన్ కనిపించకుండా పోయినా, చోరుల చేతిలో పడినా అది ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ఉపయోగపడుతుంది. గూగుల్ లో ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ అని టైప్ చేస్తే సంబంధిత లింక్ కనిపిస్తుంది. లేదా ప్లే స్టోర్ కు వెళ్లి ఫైండ్ మై డివైజ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. వీటి ద్వారా ఎక్కడుందీ గుర్తించవచ్చు. ఇలా తెలుసుకోవాలంటే ఫోన్ సెట్టింగ్స్ లో డివైజ్ అడ్మినిస్ట్రేటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో డివైజ్ పాలసీ, ఫైండ్ మై డివైజ్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఈ రెండింటినీ ఆన్ లో ఉంచుకోవాలి.

బ్రౌజర్ లో పాస్ట్ వర్డ్స్

మొబైల్ బ్రౌజర్ లో లాగిన్ పాస్ వర్డ్స్ ను ప్రతీసారి టైప్ చేసే తలనొప్పి లేకుండా ఉండేందుకు కొందరు రిమెంబర్ పాస్ వర్డ్ ను ఓకే చేసుకుంటుంటారు.  పొరపాటున మీ ఫోన్ వేరొకరి చేతికి వెళితే మీరు లాగిన్ అయి ఉన్న వాటిని యాసెస్ చేసేందుకు వీలుంటుంది. ఒక్కోసారి దీనివల్ల నష్టంతో పాటు కొన్ని తలనొన్పులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే లాగిన్ అయ్యే సమయంలో రిమెంబర్ పాస్ వర్డ్ అంటూ వచ్చే పాపప్ లను పట్టించుకోకండి. ఒకవేళ ఇప్పటికే లాగిన్ రిమెంబర్ పాస్ వర్డ్ లు ఇచ్చి ఉంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన యూఆర్ఎల్ అడ్రస్ బార్ పక్కన మూడు చుక్కలు ఉన్న చోట క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళితే సేవ్ పాస్ వర్డ్స్ ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయాలి. ఇంకా గూగుల్ కు సంబంధించిన సెట్టింగ్స్ అన్నింటినీ ఓ సారి పరిశీలించి అవసరం లేని వాటిని ఆఫ్ చేసుకోవాలి.


More Articles