బ్యాంకు డిపాజిట్లపై ఆదాయపన్ను శాఖ నిఘా... ఏం చేయాలి?

వడ్డీ ఆదాయం ఎంతో మందికి అదనపు ఆదాయ వనరు. సామాన్యులు ఎక్కువగా బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లకే మొగ్గు చూపుతుంటారు. కేవలం సామాన్యులనే కాదు సంపన్నులు కూడా ఎఫ్ డీలు చేయడం సర్వ సాధారణం. వీటిపై వడ్డీ రూపంలో ఎంతో కొంత ఆదాయం వస్తుంటుంది. ఇన్నాళ్లూ వీటి గురించి పెద్దగా పట్టించుకోని ఆదాయపన్ను శాఖ ప్రస్తుతం వీటిపైనా కన్నేసింది.


ఫిక్స్ డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించని వారు, లేదా పన్ను రిటర్నులు ఫైల్ చేయని వారిని గుర్తించే పనిని ఆదాయపన్ను శాఖ చేపట్టింది. వీలున్నంత మేర అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవడమే ఆ శాఖ పనిగా పెట్టుకుంది. కనుక ఈ విషయంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ ఫిక్స్ డ్ డిపాజిట్ల ఆదాయం, పన్ను విషయాల గురించి తెలుసుకోవడం అవసరంగా ఏర్పడింది. వాస్తవానికి వడ్డీ ఆదాయంపై పన్ను విషయంలో చాలా మందిలో పెద్దగా స్పష్టత ఉండడం లేదు. దీనిపై ఎన్నో అపోహలు కూడా ఉన్నాయి. అందుకే చట్టం గురించి తెలుసుకోవడం అవసరం.

representational imageపన్ను అధికారులకు తమ ఫిక్స్ డ్ డిపాజిట్ల గురించి తెలియదని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై మూలం వద్ద విధించే పన్ను (టీడీఎస్) చాలు పట్టివ్వడానికి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల రూపంలో వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 దాటితే బ్యాంకులు టీడీఎస్ వసూలు చేసి సంబంధిత డిపాజిట్ దారుడి పాన్ నంబర్ ఆధారంగా ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. వడ్డీ ఆదాయంలో టీడీఎస్ కింద 10 శాతాన్నే బ్యాంకులు వసూలు చేస్తాయి. ఒకవేళ డిపాజిట్ దారుడి ఆదాయం 20 శాతం పన్ను పరిధిలో ఉంటే వార్షిక రిటర్నుల సమయలో వడ్డీ ఆదాయాన్ని చూపించి అవసరమైతే మిగిలిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయంగా రిటర్నుల్లో చూపించాలి. వడ్డీ ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. అప్పుడు మొత్తం ఆదాయంపై ఏ పన్ను వర్తిస్తుందో అది మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వడ్డీ ఆదాయంపై టీడీఎస్ రూపంలో బ్యాంకు 10 శాతాన్ని మినహాయిస్తే వార్షిక రిటర్నుల్లో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాల్సి వస్తే టీడీఎస్ పోను మిగిలినది చెల్లిస్తే సరిపోతుంది. ఫిక్స్ డ్ డిపాజిట్ మాత్రమే కాదు. పన్ను మినహాయింపు ఉన్న పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల ఆదాయాన్ని కూడా రిటర్నుల్లో చూపించాలి.

representational imageటీడీఎస్ ఎగ్గొట్టే ప్రయత్నం వద్దు
ఏడాదిలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే టీడీఎస్ పడుతుందన్న ఆలోచనతో కొందరు... ఫిక్స్ డ్ డిపాజిట్లను వేర్వేరు బ్యాంకుల్లో చిన్న మొత్తాల్లో చేస్తుంటారు. ఉదాహరణకు మీరు రూ.లక్షను ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారనుకోండి. 7 శాతం వడ్డీ రేటు ప్రకారం మీ ఆదాయం రూ10,000 దాటదు. నిపుణులు మాత్రం టీడీఎస్ ఎగ్గొట్టే చర్యలు వద్దనే సూచిస్తున్నారు. డిపాజిట్ చేసే సమయంలో పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి. కనుక డిపాజిట్ల సమాచారం ఆదాయపన్ను శాఖకు తెలియకుండా దాచి ఉంచడం అసాధ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. పాన్ నంబర్ ఇవ్వడమనే నిబంధన కారణంగా ఫిక్స్ డ్ డిపాజిట్లను చిన్న చిన్న మొత్తాల్లో వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినా వాటి గురించి పన్ను అధికారులకు తెలుస్తుందంటున్నారు.

ఫామ్ 15జీ, 15హెచ్
కొందరు టీడీఎస్ చెల్లించకుండా ఫామ్ 15జీ, 15 హెచ్ పత్రాలను బ్యాంకుల్లో సమర్పిస్తుంటారు. తమ ఆదాయం సంబంధిత సంవత్సరానికి పన్ను వర్తించే ఆదాయం లోపే ఉంటుందని, కనుక టీడీఎస్ విధించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఇచ్చే డిక్లరేషన్ పత్రాలు ఇవి. దీంతో బ్యాంకులు టీడీఎస్ విధించవు.

ఫామ్ 15జీని ఫైల్ చేయాలంటే సంబంధిత ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయం బేసిక్ మినహాయింపు అయిన రూ.2.5 లక్షలకు మించి ఉండరాదు. అలాగే, వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం కూడా రూ.2.5 లక్షలు దాటరాదు. మొత్తం వడ్డీ ఆదాయం అంటే పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇతర పెట్టుబడులపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం కూడా కలిపి చూడాలి..

ఫామ్ 15 హెచ్ అన్నది 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించినది. వీరి ఆదాయం వార్షికంగా రూ.3 లక్షలకు మించకుండా ఉంటే ఫామ్ 15 హెచ్ కు అర్హులు. 80 ఏళ్లు పైబడిన వారు అయితే, ఈ మిననహాయింపు రూ.5 లక్షలుగా అర్థం చేసుకోవాలి.

representational imageఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ ఇచ్చినట్టయితే బ్యాంకుల్లో ప్రశ్నించడం ఏమీ ఉండదు. కానీ, వీటిని సమర్పించిన తర్వాత బ్యాంకులు టీడీఎస్ విధించకుండా వాటిని పక్కన పడేస్తాయని అనుకోవద్దు. సంబంధిత వ్యక్తుల పేర్లు, వారి పాన్ నంబర్లను టీడీఎస్ రిటర్నుల్లో పేర్కొనే అవకాశం ఉందని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సుభమ్ అగర్వాల్ తెలిపారు. ఇలా రిటర్నుల్లో పేర్కొన్నప్పుడు ఆ సమాచారం సంబంధిత వ్యక్తుల పాన్ నంబర్ ఆధారంగా ఫామ్ 26ఏఎస్ లో చేరిపోతుంది.

అంటే ఒకటికి మించిన బ్యాంకుల్లో ఫామ్ 15జీ లేదా హెచ్ పత్రాలను సమర్పించినా ఆ వివరాలన్నీ దీనిలో తేటతెల్లమవుతాయి. ఒకవేళ ఈ పత్రాలను దుర్వినియోగం చేసినట్టు తేలితే చట్టం ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సి రావడంతోపాటు విచారణ ఎదుర్కొనే అవకాశాలూ ఉంటాయి. తప్పు నిరూపణ అయితే మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుందని ట్యాక్స్ స్పానర్ అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ తెలిపారు.

ట్యాక్స్ స్పానర్ అనే సంస్థ ద్వారా దాఖలయ్యే పన్ను రిటర్నులను పరిశీలించినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే దాదాపు 90 శాతం మంది తమ వడ్డీ ఆదాయం గురించి రిటర్నుల్లో పేర్కొనడం లేదని. వాస్తవానికి పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు, పన్ను చెల్లింపుదారులు అందరికీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలు ఉంటాయి. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ ఆదాయం ఏడాదిలో రూ.10,000 వరకు సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. ఆపై ప్రతిరూపాయిపైనా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, రూ.10,000 దాటినాగానీ దీనిపై బ్యాంకులు టీడీఎస్ విధించవు. దీంతో ఈ ఆదాయం గురించి దాదాపుగా ఎవరూ తెలియజేయరు. ఇప్పుడైతే బ్యాంకుల మధ్య సమాచారం పంపిణీ లేదు కానీ, భవిష్యత్తుల్లో డేటాను షేర్ చేసుకోవడం మొదలు పెడితే వివిధ బ్యాంకుల్లో ఒకే వ్యక్తి చేసిన డిపాజిట్ల వివరాలన్నీ బయటకు వస్తాయి. దీంతో టీడీఎస్ కోతలు తప్పవు. వివిధ బ్యాంకుల్లో ఒకే పాన్ నంబర్ పై నమోదైన డిపాజిట్ల వివరాలను ట్రాక్ చేసే వ్యవస్థ ఇప్పటికే ఉందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సేవల నిపుణుడు ఎంకే అగర్వాల్ తెలిపారు.

representational imageకుటుంబ సభ్యుల పేరిట
ఇక పన్ను నుంచి తప్పించుకునేందుకు కొందరు కుటుంబ సభ్యుల పేరిట డిపాజిట్ చేస్తుంటారు. ఉద్యోగం చేయని భార్య, మైనర్ల పేరుతో డిపాజిట్ చేయడం చూస్తుంటాం. భార్యా, పిల్లలకు ఇచ్చే బహుమానంపై పన్ను పడదు. కానీ, వారి పేరిట ఇచ్చిన మొత్తాన్ని పెట్టుబడిగా మళ్లిస్తే దానిపై వచ్చే ఆదాయం ఇచ్చిన వారి ఆదాయంలోనే కలుస్తుంది. అంటే భార్య పేరిట భర్త రూ.1,00,000 ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడనుకుంటే వచ్చే వడ్డీ ఆదాయం అతని ఆదాయంలోనే కలుస్తుంది. ఈ వడ్డీ ఆదాయాన్ని ఇన్వెస్ట్ చేస్తే దానిపై వచ్చే ఆదాయం మాత్రం స్వీకరించిన వారి ఖాతాలోకే వెళుతుంది. ఒకవేళ చిన్న పిల్లల పేరిట డిపాజిట్ చేస్తే వడ్డీ ఆదాయం తండ్రి ఆదాయంలోనే కలుస్తుంది. కాకపోతే ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరి పేరుతో వార్షికంగా రూ.1,500 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను ఉండదు.

తల్లిదండ్రుల విషయంలో వేరు...
భార్య, మైనారిటీ తీరని పిల్లల పేరిట చేసే పెట్టుబడుల ఆదాయం మాత్రమే సంబంధిత వ్యక్తి ఆదాయంలో కలుస్తుంది. అంతేగానీ, తల్లిదండ్రుల పేరిట చేసే డిపాజిట్ల ఆదాయం మాత్రం కలవదు. ఒకవేళ తల్లిదండ్రుల ఆదాయం పెద్దగా లేకుంటే వారి పేరిట గిఫ్ట్ గా ఇచ్చేసి డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంగానే పరిగణించడం జరుగుతుంది. 60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా రూ.3లక్షల  ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. సెక్షన్ 80సీ కింద ఇన్వెస్ట్ చేస్తే రూ.4.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. కనుక పన్ను తగ్గించుకోవాలనుకుంటే తల్లిదండ్రులకు బహుమానంగా ఇవ్వడం ఒక మార్గం. ఇది చట్ట ప్రకారం సక్రమమే.


More Articles