ఉద్యోగంలో పాతుకుపోవాలంటే ...? మెరుగైన వేతనం అందుకోవాలంటే ..?

నలుగురిలో ఒకరిలా ఉద్యోగం చేసుకుంటూ వెళ్లడం వేరు... నలుగురిలోకీ భిన్నంగా పనిచేసుకుంటూ వెళ్లడం వేరు. గుంపులో గోవిందయ్య తరహాలో కంపెనీపై మీరు ఆధారపడకుండా... కంపెనీయే మీపై ఆధారపడేలా మీ బాధ్యతలు, విధులను నిర్వహించడం మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నట్టు. ఉద్యోగిగా మీరు రాణించినట్టు. ఇందుకోసం ఏం చేయాలన్నది చూద్దాం.


కంపెనీకి మంచిగా పనిచేసే ఉద్యోగుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. అందుకే క్లిష్ట సమయాల్లోనూ మంచి ఉద్యోగులను వదులుకునేందుకు ఇష్టపడవు. పైగా అటువంటి వారిని తమతోనే కలసి కొనసాగేందుకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్టాక్ ఆప్షన్లు ఇలా పలు రూపాల్లో ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తుంటాయి. అందుకే మంచి ఉద్యోగి అన్న బ్రాండ్ ను సృష్టించుకోవాలి. దాన్ని కొసాగించాలి.

representational imageకీలకమైన అంశాల్లో నైపుణ్యాలు
కంప్యూటర్ సాఫ్ట్ వేర్ అయినా, విదేశీ భాష అయినా సరే అందులో నైపుణ్యం సంపాదిండం వల్ల ప్రయోజనం ఉంటుంది. కంపెనీ ప్రధాన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. పైగా కంపెనీలో ఇతర ఉద్యోగులు ఆసక్తిగా లేని విభాగంలోనూ నైపుణ్యాలను సంతరించుకోవాలి. దాంతో కంపెనీకి మీరు అనివార్యం అవుతారు.

ఉద్యోగులకు సహకారం
జూనియర్ ఉద్యోగులకు మార్గదర్శకుడిగా వ్యవహరించే ఉద్యోగిని కంపెనీలు తప్పకుండా గౌరవిస్తాయి. చక్కని మార్గదర్శకుడిగా ఉండే వారు కొత్తగా వచ్చిన ఉద్యోగులకు విజ్ఞానాన్ని, అనుభవాన్ని అందివ్వడానికి ఎప్పుడూ సందేహించరు. కానీ, దీన్ని అందరూ చేయలేరు. సాధారణంగా తాము మాత్రమే ఎదిగిపోవాలనే ధోరణితో ఉన్న వారే ఎక్కువ మంది ఉంటారు. ఇతరులకు చెబితే తమ స్థానాన్ని భర్తీ చేస్తారేమోనన్న భయం వారిలో ఉంటుంది. కానీ, ఇతరుల విజయాన్ని ఆస్వాదించే వారూ ఉన్నారు. ఇలా మార్గదర్శక పాత్రను పోషించే వారికి ఎటువంటి అభద్రత అవసరం లేదు. ఇటువంటి వారు నిర్వహించే పాత్రపై కంపెనీలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయి.

representational imageనిరంతర అధ్యయనం
ఇచ్చిన పనిని ఎప్పుడూ ఒకే మాదిరిగా కాకుండా ఇంతకుముందు ఎన్నడూ చేయనంత గొప్పగా ట్రై చేసి చూడండి. వచ్చే రియాక్షన్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతీ వారం కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. దీనివల్ల కొద్ది కాలంలోనే మీరు ఎన్నో నైపుణ్యాల మేళవింపుగా మారతారు. దాంతో కంపెనీకి మీ అవసరం మరింత పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలే పెద్ద మార్పులకు కారణం అవుతాయి. కొత్త టెక్నాలజీలు వచ్చేస్తున్నాయి. దాంతో మానవ వనరుల అవసరాలు తగ్గిపోతున్నాయి. కానీ, చేస్తున్న పని యాంత్రాలకు అతీతమై ఉండేలా చూసుకోవాలి. అందుకోసం మీరు పనిచేస్తున్న కంపెనీ వినియోగించే టెక్నాలజీలకు సంబంధించి ఎప్పటికప్పుడు సాంకేతికతపై దృష్టి పెట్టాలి. పాత విధానాలతోనే వేలాడేవారికంటే కొత్తదనాన్ని ఆహ్వానించే వారు, నూతన నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఎప్పుడూ ఉంటుంది.

పరిష్కారాలు
సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను సూచించే ఉద్యోగులు కంపెనీల ప్రయోజనాలకు కీలకం. ఏదైనా సమస్యకు పరిష్కారం మీ దగ్గర ఉంటే సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికతో బాస్ దగ్గరకు వెళ్లాలి. సమస్యకు మీ పరిష్కారం గురించి తెలియజేస్తే, ఒకవేళ అది సక్సెస్ అయితే మీ స్థానం మరింత బలోపేతం అయినట్టే.

representational imageసంబంధాలు
సహచర ఉద్యోగులు, బాస్ తో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాలి. దీంతో సీనియర్లతో చాలా చక్కగా అనుసంధానం కాగలరు. వ్యక్తిగత సంబంధాలు, నెట్ వర్క్ సామర్థ్యాలు ఉద్యోగ అర్హతల్లో భాగం.

  • ఇచ్చిన బాధ్యతల్ని ఎంత వేగంగా చేశారన్నది కాకుండా ఎంత సమర్థవంతంగా చేశారన్నది మొదటి విషయం అవుతుంది. ఆ తర్వాతే సమయం. అంటే ఆలస్యం అయినా ఫర్వాలేదని కాదు. కంపెనీ ఇచ్చిన సమయంలో సాధ్యమైనంత వేగంతో, సమర్థవంతంగా నిర్వహించడం తెలుసుకోవాలి.
  • ఇతరులకు మార్గదర్శనంగా ఉండడమే కాదు, ఇతరులను కలుపుకుని, సమష్టిగా పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.-  కొన్ని సందర్భాల్లో కంపెనీలు ఆధారపడ తగిన ఉద్యోగుల నుంచి అసాధారణ సేవలు ఆశిస్తుంటాయి. చాలా వేగంగా పని పూర్తి చేయాల్సి రావడం, ఓవర్ టైమ్ పనిచేయాల్సి రావడం, అవసరమైతే వీకాఫ్ వదులుకుని పనిచేయడం అనివార్యం కావచ్చు. వీటిని సంతోషంగా స్వీకరించడం ద్వారా కంపెనీకి మీ అవసరాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు.
  • రోజువారీ బాధ్యతలే కాకుండా ఉద్యోగంలో తీరిక దొరికితే కార్యాలయంలోనే ఇతర బాధ్యతల్లో పాలు పంచుకోవడం మీ అంకిత భావాన్ని తెలియజేస్తుంది.
  • విధులను మరింత భిన్నంగా చేయాలని భావిస్తుంటే బదిలీ చేయాలని, లేదంటే షిప్ట్ మార్చాలని కోరడం వల్ల ఉపయోగం ఉంటుంది.
  • ఫేస్ బుక్, చాట్లపై ఎక్కువ సమయం ఉండొద్దు. చాలా తక్కువ సమయమే వీటికి పరిమితం కావాలి.
అధిక వేతనం కోసం...?
సాధారణంగా అధిక వేతనం ఆశించేవారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టడం సహజం. కానీ, ఉన్న ఉద్యోగంలోనే తమను తాము నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దుకుంటే ఉన్నచోటే అధిక వేతనం అందుకునే అవకాశాలు పెరుగుతాయి.

representational imageసరైన ఉద్యోగం
మీకు నచ్చినది, మీ నైపుణ్యాలు, ఆసక్తులకు సరిపోలే ఉద్యోగంలో స్థిరపడడం వల్ల మీరు మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైతే మరింత కష్టపడి చక్కని ఫలితాలు తీసుకువచ్చేందుకూ వెనుకాడరు.

ఉత్సాహం
పనిచేసే చోట వాతావరణం ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. కార్యాలయానికి వెళ్లిన వెంటనే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం, బాస్ మెచ్చుకున్నప్పుడు థ్యాంక్యూ చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎదుటి వారిని నవ్వుతూ పలకరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముందు మీరే
కార్యాలయంలో బాస్ కు చేదోడు వాదోడుగా ఉండడం ఉద్యోగం పట్ల, సంస్థ పట్ల అంకిత భావానికి నిదర్శనమే. సమావేశాలు, డెడ్ లైన్ లోపు పనులు పూర్తి చేయడం, కొత్తగా ఏవైనా బాధ్యతలు ఇవ్వజూపితే వెనుకాడకుండా ముందడుగు వేసి తీసుకోవడం వల్ల మేలు చేస్తుంది.

పారదర్శకత
మీరు చేసిన పని, చేస్తున్న పని, చేయాల్సినవి వీటి గురించి ప్రతి రోజూ పని ముగిసిన తర్వాత బాస్ కు మెయిల్ రూపంలో వివరంగా తెలియజేయడం మంచిది.


More Articles