టేస్టీ వెజిటబుల్ పిజ్జా చేసుకుందాం ఇలా...!

 పిజ్జా ప్రియులు ఆ రుచి కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు... వందల రూపాయలు ఖర్చు చేయక్కర్లేదు! ఇంట్లోనే రుచికరమైన పిజ్జాను చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓపిక, కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. పిజ్జా తయారీకి ముడి పదార్థాలు కూడా తెచ్చుకోవాలి.  


పిజ్జాను పిల్లల దగ్గర్నుంచి, పెద్దల వరకు చాలా మంది ఇష్టపడతారు. ఇది అన్ని వేళలా తీసుకోతగిన ఆహారం. బయట తీసుకునే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత ఎంతదన్నది సందేహమే. అందుకే మంచి రుచికరమైన పిజ్జాను ఇంట్లోనే చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం...

representational imageకావాల్సినవి
రెండు కప్పుల మైదా పిండి, రెండు టీ స్పూన్ల డ్రై ఈస్ట్, ఒక టీ స్పూన్ నూనె, పావు టీ స్పూన్ షుగర్ లేదా తేనె, అర టీ స్పూన్ సాల్ట్, కప్పు వార్మ్ వాటర్ ఇవన్నీ పిజ్జా బేస్ కోసం అవసరం. లేదంటే మార్కెట్లో రెడీమేడ్ పిజ్జా బేస్ కూడా లభిస్తుంది. పిజ్జాపై అలంకరణ కోసం.... ఒక ఉల్లిగడ్డ (తరిగి ఉంచుకోవాలి), క్యాప్సికమ్ లో గ్రీన్, రెడ్, యెల్లో మూడు రకాలు లభిస్తే ఒక్కోటీ అర మిరపకాయను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. లేదంటే గ్రీన్ క్యాప్సికమ్ ఒకటిన్నర తరుగుకుంటే సరిపోతుంది. ఒక టమాటా (తరుగుకోవాలి), రెండు పచ్చి మిరపకాయలు (సన్నగా తరుగుకోవాలి), రెండు టీ స్పూన్ల తాజా స్వీట్ కార్న్ గింజలు పిజ్జా తయారీకి సిద్ధం చేసుకోవాలి.

తయారీ విధానం
పిజ్జా బేస్, దానిపై మిగిలిన పదార్థాల అలంకరణ, మైక్రోవేవ్ ఓవెన్ లో ఉడికించడం ఈ మూడు ప్రక్రియలు పిజ్జా తయారీలో ఉంటాయి.
  • ముందుగా కప్పు వార్మ్ వాటర్ లో రెండు టీ స్పూన్ల డ్రై ఈస్ట్, పావు చెంచాడు షుగర్ లేదా తేనె వేసి గరిటెతో బాగా కలిపి 15 నిమిషాల పాటు ఉంచేయాలి. దాంతో కప్పులోని పరిమాణం రెట్టింపవడాన్ని గమనించొచ్చు. 
  • ఇప్పుడు పెద్ద పాత్ర తీసుకుని అందులో రెండు కప్పుల మైదా పిండిని, అర టీ స్పూన్ సాల్ట్ వేసి కలపాలి, దీనికి ఈస్ట్ మిశ్రమాన్ని కూడా కలిపి, ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోవాలి. జారుగా అయితే కొంచెం పిండి కలుపుకోవచ్చు. మరీ గట్టిగా ఉంటే కొంచెం వార్మ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా, సున్నితంగా మారే వరకూ పిండిని కలుపుతూనే ఉండాలి. కలిపిన పిండి మిశ్రమం సాఫ్ట్ గా సాగుతూ ఉండాలి. దాంతో చివర్లో ఈ కలిపిన పిండిపై చుక్క నూనె వేసి అంతా కవరయ్యేలా చూడాలి. ఆ తర్వాత దాన్ని ఓ రెండు గంటల పాటు పక్కన ఉంచాలి. 
  • representational imageరెండు గంటల తర్వాత చూస్తే కలిపిన పిండి మిశ్రమం పెద్దదవడాన్ని గమనించొచ్చు. దీన్ని నాలుగు సమాన సైజుల్లో ఉండలుగా చేసుకుని మళ్లీ ఓ 20-30 నిమిషాలు అలా ఉంచాలి. మరింత పెద్ద విస్తీర్ణంలో పిజ్జా కోరుకుంటే ఈ పరిమాణాన్ని రెండు సమాన ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. 
  • ఇప్పుడు ఒక బాల్ ను తీసుకుని చపాతీ మాదిరిగా వత్తుకోవాలి. మందంగా ఉండాలి. పల్చగా చేసుకోకూడదు. కనీసం పావు అంగుళం మందమైనా ఉండాలి. సైజు ఎంతన్నది మీ ఇష్టం. కానీ, దీని మందం మాత్రం పావు అంగుళం ఉండాలి. ఇప్పుడు వత్తుకున్న పిండి బేస్ పై ఒక చెంచాడు పిజ్జా సాస్ వేసి అంతటా అంటేలా స్పూన్ తో అప్లయ్ చేయాలి. 
  • దీనిపై తరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిరపకాయలు అలంకరించాలి. దీన్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్ లో 350 డిగ్రీల ఫారిన్ హీట్ లో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు సాధారణంగా ఉడికించాలి. పిజ్జా రెడీ అయిందనడానికి గుర్తు ఏంటంటే, బేస్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. కూరగాయల ముక్కలు ఉడుకుతాయి. ఇలా అయితే పిజ్జా రెడీ అయినట్టే. 
  • representational imageదీన్ని నేరుగా  లేదా  సాస్ యాడ్ చేసుకుని గానీ తినొచ్చు. కోరుకుంటే మిరియాల పొడి చల్లుకుని తినేయవచ్చు. బేస్ కోసం కలిపిన పిండిని గాలి చొరబడని పాత్రలో ఉంచి ఫ్రిజ్ లో ఉంచుకుంటే మరుసటి రోజైనా చేసుకోవచ్చు.
ప్రిపరేషన్ సమయం 20 నిమిషాలు, వండేందుకు పట్టే సమయం 15 నిమిషాలు. మొత్తం 35 నిమిషాలు పిజ్జా తయారీకి తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చిన పరిమాణంతో నాలుగు మీడియం సైజు పిజ్జాలు అవుతాయి. ఒక్కో పిజ్జాతో 320 కేలరీలు శరీరానికి అందుతాయి. అదనంగా పిజ్జాలు కావాలంటే అంత మేర పిండి, ఇతర పదార్థాలను పెంచుకోవాలి. లేదంటే చిన్న సైజువి చేసుకుంటే సంఖ్య పెరుగుతుంది.


More Articles