మేకపాటి మృతి తీరని లోటు : ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి

  • ఆప్కో కేంద్ర కార్యాలయంలో సంతాప సభ
  • నివాళి అర్పించిన చేనేత, జౌళి శాఖ సిబ్బంది
విజయవాడ: అనతికాలంలోనే రాజకీయాలలో ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్న చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమరెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు అన్నారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం, అడిగిన వారందరికీ చేతనైన సాయం చేయటం ఆయన ప్రత్యేకతలని కొనియాడారు. మంత్రి మేకపాటి హఠాన్మరణం నేపథ్యంలో సోమవారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. మేకపాటి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ మేకపాటి మృతి చేనేత రంగానికి తీరని లోటని, ఈ రంగం సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తరుణంలో ఆయన అకాల మృత్యువాతకు లోనుకావటం కలిచి వేసిందన్నారు. వివాదరహితుడిగా, విమర్శలకు దూరంగా అజాత శత్రువుగా వ్యవహరించారన్నారు. సంతాప కార్యక్రమంలో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, సుదర్శన్, ఉప సంచాలకులు మురళి కృష్ణ, ఆర్డిడి బి.నాగేశ్వరరావు, సహాయ సంచాలకులు నాగరాజు, ప్రత్యేక అధికారి జగదీష్, మార్కెటింగ్ అధికారి బివి రమణ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వారణాసిలో ఎన్నికల విధులలో ఉన్న చేనేత జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి మంత్రి మేకపాటి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు.

More Press News