వైసీపీ ప్రభుత్వ 100 రోజుల పాలనపై అధ్యయనం చేస్తాం: పవన్ కల్యాణ్

  • 30 మంది సభ్యులతో 10 బృందాల నియామకం
  • అక్టోబర్ నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలు
  • ప్రభుత్వం అక్రమ కేసులతో కార్యకర్తలను వేధిస్తోంది.. కార్యకర్తలకు అండగా నిలుద్దాం
  • రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్

సెప్టెంబర్ 7వ తేదీనాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నందున ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ది వంటి విషయాలపై అధ్యయనం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు ఈ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఇప్పటివరకూ నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలపై సమీక్ష, ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల జరిగిన పవన్ కల్యాణ్ పర్యటన, రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై చర్చ జరిగింది. సెప్టెంబర్ మాసాంతానికి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలన్నింటినీ పూర్తి చేసి, పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈలోగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి వివరాలను క్రోడీకరించి సిద్ధపరచాలని, స్థానిక నాయకులకు తెలియచేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై అధ్యయనం చేయడానికి 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 30 మంది సభ్యులను నియమించారు.

More Press News