కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శితో సమావేశమైన మంత్రి గంగుల

Related image

  • నిన్న ధాన్యం అంశాలపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ని కలిసిన మంత్రులు కేటీఆర్, గంగుల
  • కేంద్ర మంత్రి ఆదేశాలతో కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారుల అత్యున్నత సమావేశం
  • 2020‌-21 యాసంగి బాయిల్డ్  రైస్ వాటా పెంపు, గత యాసంగి బియ్యంపై 30 రోజులు అదనపు సీఎంఆర్ గడువు, వచ్చే వానాకాలం 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుపై  ముందడుగు
  • మంత్రి గంగుల విజ్ఞప్తితో మధ్యాహ్నం ఎఫ్.సీ.ఐ ఉన్నతాధికారులతో సమావేశం
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు కేటీఆర్ గంగుల కమలాకర్ లు నిన్న కేంద్రమంత్రి పియూష్ గోయల్ని కలిసి రాష్ట్ర అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేసిన విషయం విదితమే. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన పియూష్ గోయల్ కేంద్ర ఆహార పౌరసరఫరాల కార్యదర్శి సుదాన్షు పాండేకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్యదర్శిని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కమీషనర్ అనిల్ కుమార్ లు ధాన్యం  సమస్యలపై ఢిల్లీ కృషి భవన్లో ప్రత్యేక భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శికి మూడు ప్రధాన సమస్యలపై సమగ్ర వివరాలు అందించారు రాష్ట్ర  మంత్రి గంగుల. ఈ యాసంగిలో పారాబాయిల్డ్ రైస్ 50లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్.సి.ఐ తీసుకొని రైతులకు మేలు చేయాలని, గతంలో 2019-20 రబీలో నష్టపోయిన ముప్పై రోజుల్ని భర్తీ చేసి మిగిలిన బియ్యాన్ని అందించడానికి మరో ముప్పై రోజుల గడువుని పెంచాలని, రాబోయే వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలని కోరారు. గతంలో సైతం ఇదే రీతిన కొనుగోళ్ళు జరిగాయని వాటికి సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్యదర్శికి అందించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్.

ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో సమగ్రంగా చర్చించిన మంత్రి  గంగుల, తెలంగాణలో మిల్లింగ్ కొనసాగుతున్నందున సత్వర పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గంగుల విజ్ఞప్తి మేరకు కేంద్ర కార్యదర్శి మధ్యాహ్నం ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులు, రాష్ట్ర అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తద్వారా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తోపాటు కేంద్ర కార్యదర్శి సుదాన్షు పాండే, తెలంగాణ సివిల్ సప్లయిస్ కమీషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

More Press Releases