గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జేఎన్టీయూ వీసీ

Related image

హైదరాబాద్: జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈరోజు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ను రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ యూనివర్సిటీలో పరిశోధనలు, అభివృద్ధి, ఇన్నోవేషన్ పెంపుదలకు కృషి చేయాలని సూచించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత దేశము సైన్స్, టెక్నాలజీ రంగాలలో స్వయం సమృద్ధి సాధించడానికి అభివృద్ధి పరిశోధనలు, ఇన్నోవేషన్ అత్యంత ఆవశ్యకమని డాక్టర్ తమిళిసై అన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా విశ్వవిద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలని గవర్నర్ సూచించారు.

విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ బలోపేతం చేయవలసిందిగా గవర్నర్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కు సూచించారు. పూర్వ విద్యార్థుల సేవలు ఉపయోగించుకొని యూనివర్సిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే అవకాశం ఉందని డాక్టర్ తమిళిసై వివరించారు. ఈ దిశగానే రాజ్ భవన్ ఆధ్వర్యంలో చాన్సలర్ కనెక్ట్ అల్యూమిని అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి తాను రచించిన నానో టెక్నాలజీ అనే పుస్తకాన్ని, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో గతంలో వైస్ ఛాన్సలర్ గా రిటైర్ అయినప్పుడు సహచరులు శ్రేయోభిలాషులు ప్రచురించిన మరో పుస్తకాన్ని గవర్నర్ కు అందజేశారు.

More Press Releases