ఓటీటీ రివ్యూ ' అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి ('ఆహా'లో)

  • 'ఆహా'లో 'అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి' స్ట్రీమింగ్ 
  • నిర్మాతగా .. హీరోగా ఈ సినిమాను రూపొందించిన అలీ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • నిరాశ పరిచే చిత్రీకరణ 
  • సహజత్వం లోపించిన సన్నివేశాలు
కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా అలీ కొన్ని సూపర్ హిట్ సినిమాలు చేశాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆయన కమెడియన్ గానే కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న అలీ, తానే హీరోగా ఒక సినిమా చేశాడు .. ఆ సినిమా పేరే 'అందరూ బాగుండాలి .. అందులో నేనుండాలి'. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మౌర్యాని కథానాయికగా నటించగా, ముఖ్యమైన పాత్రలలో నరేశ్ .. పవిత్ర లోకేశ్ .. మంజు భార్గవి .. తనికెళ్ల భరణి .. సప్తగిరి తదితరులు కనిపిస్తారు. ఈ రోజునే 'ఆహా'లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది.

కథలోకి వెళితే ... సమీర్ (అలీ) దుబాయ్ నుంచి సెలవులపై ఇండియాకి వస్తాడు. తల్లి .. చెల్లి .. అన్నావదినలు .. మేనమామ అతని కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అయితే ఎప్పటికప్పుడు సెల్ఫీలు .. వీడియోలు తీసేసి పోస్ట్ చేయడం ఆయన హాబీ. ఇదిలా ఉంటే .. శ్రీనివాసరావు (నరేశ్)కి మాటలు రావు. తన భార్యా పిల్లలతో అతను ఒక ఇంటిలో రెంట్ కి ఉంటూ సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటాడు. లైబ్రరీలో తాను చేసే పని పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఉంటాడు. 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే తత్వం ఆయనది. ఒకసారి తన కొడుక్కి విపరీతమైన ఫీవర్ వస్తుంది. దాంతో హాస్పిటల్లోనే శ్రీనివాసరావు నిద్ర లేకుండా రెండు రోజుల పాటు ఉండిపోతాడు. 


అలా అలసిపోయినా శ్రీనివాసరావు మెట్రో ట్రైన్ లో సీట్లో పడుకుంటాడు. ఆ ట్రైన్ లో ప్రయాణిస్తూ అది చూసిన సమీర్, వెంటనే ఒక ఫొటో తీస్తాడు. ఫుల్లుగా తాగేసి మెట్రో ట్రైన్ లోని సీట్లో పడుకున్నాడని పోస్టు పెడతాడు. దాంతో ఆ వీడియో వైరల్ అవుతుంది. సమీర్ పెట్టిన ఆ పోస్టు కారణంగా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అవమానాల పాలవుతారు. శ్రీనివాసరావు ఉద్యోగం పర్మినెంట్ కాకపోగా సస్పెండ్ అవుతాడు. శ్రీనివాసరావు గురించి  తెలిసినా ఆ ఇంటి యజమాని కూతురు, ఆ కుటుంబం పడుతున్న బాధను మరో వీడియోతో జనంలోకి తీసుకుని వెళుతుంది. 

నిజం తెలుసుకున్న జనం .. శ్రీనివాసరావు పరిస్థితికి కారకుడైన వ్యక్తిపై కారాలు మిరియాలు నూరుతుంటారు. మరో వైపున శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. ఈ విషయాన్ని అన్ని టీవీ చానల్స్ లోను ప్రసారమవుతుంది. తనకి ఇష్టమైన యువతితో పెళ్లికి సిద్ధపడుతున్న సమీర్ కి ఈ విషయం తెలుస్తుంది. సమస్య అంతకంతకూ ముదిరిపోతుండటంతో భయపడిపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

దర్శకుడు శ్రీపురం కిరణ్ తయారు చేసుకున్న ఈ కథలో ఒక సినిమాకి అవసరమైనంత బలం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక షార్టు ఫిలిమ్ ద్వారా సందేశాన్ని ఇవ్వవలసిన పాయింటు ఇది. కానీ దానిని సినిమా కోసం లాగడమనేది ప్రేక్షకులను అసహనాన్ని కలిగిస్తుంది. నిజాలు నిజాలు తెలుసుకోకుండా ప్రతి విషయాన్ని వైరల్ చేయడానికి ట్రై చేయకండి.  ఒక్కోసారి తెలియక చేసే తప్పులు తలకి చుట్టుకుంటాయనేదే ఈ కథలోని సారాంశం .. సందేశం కూడాను. ఈ పాయింటు చుట్టూ మిగతా కథను పట్టుగా .. పకడ్బందీగా నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

కథాకథనాల్లో బలం లేకపోవడం వలన పాత్రలు కూడా తేలిపోతుంటాయి. కొన్ని అంశాలను అవసరానికి మించి చూపించినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీనివాసరావు వీడియోలో అంత విషయం లేకపోయినా, అందరూ అది చూసి నవ్వుకోవడం కాస్త ఓవర్ గా కనిపిస్తుంది. కథలో కాస్త కామెడీ .. ఇంకాస్త ఎమోషన్ ఉన్నప్పటికీ, సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించలేకపోవడం వలన చూసేవారు కనెక్ట్ కాలేకపోతారు. నరేశ్ పాత్రపై కేవలం సానుభూతి కలగడం కోసం ఆ పాత్రకీ మాటలు రావని చెప్పేసి, అటు నరేశ్ ను .. ఇటు ప్రేక్షకులను కూడా ఇబ్బందిపెట్టేశారు. 

సంగీతం .. కెమెరాపనితనం .. ఫరవాలేదు. ఎడిటింగ్ విషయానికొస్తే ట్రిమ్ చేయవలసిన సీన్స్ .. లేపేయవలసినవి కొన్ని కనిపిస్తాయి. అలీ .. నరేశ్ .. పవిత్ర లోకేశ్ . మధుసూదన్ రావు .. ఇలా ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. ఈ సినిమా ద్వారా ఇవ్వదలచుకున్న సందేశం కరెక్టుగానే ఉంది. కానీ సమస్యనే బలంగా లేదు. అందువల్లనే  సన్నివేశాలు నిలబడలేకపోయాయి .. ఆకట్టుకోలేకపోయాయి. నిర్మాణపరమైన విలువలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ప్రేక్షకుల అసంతృప్తికి కొంతవరకూ కారణమని చెప్పుకోకుండా ఉండలేం.

Movie Details

Movie Name: Andaru Bagundali Anduulo Nenundali

Release Date:

Cast: Ali, Naresh, Pavitra Lokesh, Sapthagiri, Madhu Sudan

Director: Kiran Sripuram

Producer: Ali

Music: Rakesh

Banner: Ali Wood

Andaru Bagundali Anduulo Nenundali Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews