'కుబేర' - మూవీ రివ్యూ!

  • శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేర'
  • శ్రీమంతుడికి .. బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటం  
  • మనసున్నవాడే శ్రీమంతుడని తేల్చిన కథ
  • కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు 
  • ఆద్యంతం ఆకట్టుకునే ఎమోషన్స్     

కథ ఏదైనా .. సినిమా ఏదైనా, ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడంలో శేఖర్ కమ్ముల పేరే ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కథాకథనాలపై ఆయన పెట్టే దృష్టి .. సన్నివేశాలకు సహజత్వాన్ని కలుపుతూ చేసే కసరత్తు అందుకు కారణమని చెప్పాలి. అలా కొంత సమయం తీసుకుని ఆయన అందించిన సినిమానే 'కుబేర'. ధనుశ్ .. నాగార్జున ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

కథ: నీరజ్ మిత్ర ( జిమ్) పెద్ద బిజినెస్ మేన్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడం కోసం ఎంతకైనా తెగించే ఓ దుర్మార్గుడు. ఆయిల్ బావులపై అతని దృష్టి పడుతుంది. అయితే అందుకు రాజకీయనాయకులు .. అధికారులకు దాదాపు లక్ష కోట్లను సమర్పించవలసి వస్తుంది. దాంతో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున) సమర్థుడని ఆయన భావిస్తాడు. అయితే నిజాయితీపరుడైన దీపక్ చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉంటాడు. 

తన స్వార్థం కోసం దీపక్ ను విడిపించిన నీరజ్ మిత్ర, ఇకపై తన కోసం పనిచేయమని చెబుతూ, లక్ష కోట్ల వ్యవహారాన్ని దీపక్ కి అప్పగిస్తాడు. బినామీల పేరు మీదుగా ఈ లావాదేవి జరగాలని చెప్పిన దీపక్, ఏ మాత్రం అక్షర జ్ఞానం లేని నలుగురు బిచ్చగాళ్లను బినామీలుగా రంగంలోకి దింపుతాడు. వాళ్లలో తిరుపతిలో అడుక్కునే దేవా (ధనుశ్) కూడా ఉంటాడు. ఈ నలుగురు బిచ్చగాళ్లతో పని పూర్తికాగానే వాళ్లను చంపేయాలని నీరజ్ నిర్ణయించుకుంటాడు. 

బిచ్చగాళ్లతో పని పూర్తికాగానే వెనక్కి పంపించేయాలని దీపక్ అనుకుంటాడు. కానీ ఆ ఉద్దేశం నీరజ్ కి లేదని చివరి నిమిషంలో తెలుసుకున్న దీపక్ ఏం చేస్తాడు? తమని నమ్మించి తీసుకొచ్చారనీ, పని పూర్తికాగానే తమని చంపేస్తారనే విషయాన్ని గ్రహించిన దేవా ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితుల్లో అతనికి సమీరా (రష్మిక) తారసపడుతుంది?.  అతని వలన ఆమె ఎలాంటి చిక్కుల్లో పడుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. తనకి పర్ఫెక్ట్ గా అనిపించేంతవరకూ రాజీ పడడు. అందువల్లనే ఆయన కథలు కావ్యాల మాదిరిగా గుర్తుండిపోతూ ఉంటాయి. అలా ఆయన కసరత్తు ఫలితంగా వచ్చినదే 'కుబేర'. ఒక బిచ్చగాడిని కథానాయకుడిగా చేసి,  కథను ఆ పాత్ర చుట్టూనే తిప్పుతూ 'కుబేర' అనే టైటిల్ పెట్టడం ఆయనకే చెల్లింది. 'కుబేర' అనే టైటిల్ ను కథకు కనెక్ట్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. 

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు అనగానే కాలేజ్ క్యాంపస్ ల చుట్టూ .. లవ్ స్టోరీస్ చుట్టూ .. సున్నితమైన భావోద్వేగాలను కలుపుకుని తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా, స్కామ్ చుట్టూ .. అందులో చిక్కుకున్న బిచ్చగాడి చుట్టూ .. తప్పనిసరి పరిస్థితుల్లో చెడుకి చేయూత నిచ్చే సీబీఐ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. శేఖర్ కమ్ముల శైలికి విభిన్నంగా .. విలక్షణంగా ఈ కథ నడవడం విశేషం. విస్తృతమైన పరిధిలో కనిపించే ఈ కథను శేఖర్ కమ్ముల సమర్థవంతంగా డీల్ చేసినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే కాస్త నిడివి ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అంతే. 

తన గురించి మాత్రమే ఆలోచించే నీరజ్ మిత్రా .. తన ఫ్యామిలీని గురించి మాత్రమే ఆలోచించే సీబీఐ ఆఫీసర్ .. తనవాళ్లను గురించి ఆలోచించే ఒక బిచ్చగాడి కథ ఇది. ఈ మూడు పాత్రలు కథను పరిగెత్తిస్తాయి. ఇక సమీరాగా రష్మిక పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా కొత్తగా అనిపిస్తుంది. ఆ కొత్తదనం ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ గా ఈ కథ కనెక్ట్ అవుతుంది.  పాటలు కూడా చాలా లోతైన అర్థాలను వినిపిస్తాయి.

అయితే ఈ కథలో సిల్లీగా అనిపించే అంశమూ ఉంది. సందేశంగా తీసుకునే సారాంశమూ ఉంది.  లక్షల కోట్లకు అధిపతి .. రాజకీయాలను .. ఉన్నతాధికారులను ఆటాడించే ప్రతినాయకుడు, ఒక బిచ్చగాడికి భయపడి .. బిచ్చగాడి వేషంలో గుడిమెట్లపైకి వచ్చేయడం సిల్లీగా అనిపిస్తుంది. ఇక కాలమనేది లక్షల కోట్లు ఉన్నవాడిని కూడా వీధిలో నిలబెడుతుంది. బిచ్చగాడిని వేలకోట్లకు అధిపతిని చేస్తుంది అనే సందేశమూ ఉంది. 

పనితీరు
: దర్శకుడు కథాకథనాలను డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. కాకపోతే కాస్త నిడివి ఎక్కువగా ఉండి, అక్కడక్కడా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. నాగార్జున .. ధనుశ్ ..  రష్మిక .. జిమ్ నటన ఆకట్టుకుంటుంది. నికేత్ బొమ్మిరెడ్డి ఫొటొగ్రఫీ బాగుంది. దేవిశ్రీ నేపథ్య సంగీతం .. బాణీలు ఆకట్టుకుంటాయి. 'పోయిరా మావా' .. 'నా కొడుకా' బాణీలు మనసుకు పట్టుకుంటాయి. ఎడిటింగ్ పరంగా కార్తీక్ శ్రీనివాస్ ట్రిమ్ చేయవలసిన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. 

ముగింపు: శేఖర్ కమ్ముల తన ట్రాక్ లో నుంచి పక్కకి వచ్చి చేసిన సినిమా ఇది. ఆయన మార్క్ కి భిన్నంగా కొనసాగినప్పటికీ, అక్కడక్కడా లాజిక్కుకి దూరంగా వెళ్లినప్పటికీ ప్రేక్షకులను గట్టిగానే ఆకట్టుకుంటుంది. ఎదగడమంటే కోట్లు కూడబెట్టడం కాదు, మన చుట్టూ ఉన్నవాళ్ల బతుకులను బాగు చేయడం అనే సందేశాన్ని ఇచ్చిన సినిమాగా ఇది మంచి మార్కులు కొట్టేస్తుంది. 

Movie Details

Movie Name: Kuberaa

Release Date: 2025-06-20

Cast: Dhanush, Nagarjuna,Rashmika Mandanna,Jim Sarbh,Sunaina

Director: Sekhar Kammula

Producer: Suniel Narang - Puskur Ram Mohan Rao

Music: Devi Sri Prasad

Banner: Sree Venkateswara Cinemas LLP

Review By: Peddinti

Kuberaa Rating: 3.25 out of 5

Trailer

More Movie Reviews