'మలయాళీ ఫ్రమ్ ఇండియా' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

  • నివిన్ పౌలి హీరోగా 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'
  • మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైన సినిమా 
  • అందుబాటులో ఉన్న తెలుగు వెర్షన్
  • చివరి 20 నిమిషాలకు మాత్రమే ప్రాధాన్యం 
  • అందుకోసం అంగీకరించవలసిన మిగతా సినిమా

మలయాళ సినిమాలకు ఓటీటీ వైపు నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సింపుల్ లైన్ తో సహజత్వానికి చాలా దగ్గరగా వెళ్లే కంటెంట్ పట్ల మిగతా భాషలకి చెందిన ఆడియన్స్ కూడా కుతూహలాన్ని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మలయాళం నుంచి మరో సినిమా 'సోనీ లివ్' ట్రాక్ పైకి వచ్చేసింది. ఆ సినిమా పేరే 'మలయాళీ ఫ్రమ్ ఇండియా'.  నివిన్ పౌలి కథానాయకుడిగా, డిజో జోస్ ఆంటోని దర్శకుడిగా మే 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తెలుగులోను అందుబాటులో ఉంది. 

 గోపీ (నివిన్ పౌలి) ఒక విలేజ్ కి చెందిన యువకుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి - చెల్లి అదే అతని కుటుంబం. తండ్రి లేడుకదా అని అతను కుటుంబ బరువు బాధ్యతలను మీద వేసుకోడు. తన స్నేహితుడు మల్ ఘోష్ (ధ్యాన్ శ్రీనివాసన్)తో కలిసి కాలక్షేపం చేస్తుంటాడు. పనీ పాటా లేకుండా తిరుగుతున్న తన కొడుకును కాస్త దార్లో పెట్టమని అతని తల్లి తన సోదరుడితో చెబుతుంది. దాంతో అతనికి ఎక్కడైనా ఏదైనా జాబ్ చూసే పనిలో మేనమామ ఉంటాడు. 

ఖాళీగా ఉండే గోపీ .. కృష్ణ (అనశ్వర రాజన్) ను ప్రేమిస్తూ ఉంటాడు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, ఆ ఊళ్లో రాజకీయాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గోపీని వెంట తీసుకుని వెళ్లి, వేరే పార్టీ వారిపై మల్ ఘోష్ దాడి చేస్తాడు. జరిగిన సంఘటనకి కారకులు వీరిద్దరూ అనే విషయం అవతల పార్టీ వారికి తెలిసిపోతుంది. ఆల్రెడీ మల్ ఘోష్ వారి చేతికి చిక్కుతాడు. తన కొడుకు ఏం చేస్తారోనని గోపీ తల్లి ఆందోళన చెందుతూ ఉంటుంది. 

దాంతో గోపీ కొంతకాలం పాటు ఆ ఊరికి దూరంగా వెళ్లడం మంచిదని భావించిన మేనమామ, అతను విదేశాలకి వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడప్పుడే కరోనా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. విమానం దిగిన గోపీ, తన కోసం వచ్చిన మోమిన్ ను కలుసుకుంటాడు. తనని తన మేనమామ చెప్పిన చోటుకి తీసుకెళ్లమని చెప్పి కార్లో పడుకుంటాడు. నిద్రలేచి చూసేసరికి అతను పాకిస్థాన్ బోర్డర్ లో ఉంటాడు. అక్కడ షేర్ ఖాన్ అనే పాకిస్థానీయుడికి గోపీని అప్పగించి మోమిన్ జారుకుంటాడు. పారిపోదామని గోపీ అనుకుంటే ఇక్కడ లాక్ డౌన్ విధిస్తారు. 

తాను పాకిస్థాన్ భూభాగంలో ఉన్నానని తెలుసుకున్న గోపీ ఏం చేస్తాడు? అక్కడికి అతని మేనమామ ఎందుకు పంపిస్తాడు? అక్కడ గోపీకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ప్రపంచమంతా కరోనాతో ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటే, పాకిస్థాన్ బోర్డర్ లో గోపీ ఏం చేస్తాడు? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.  

సాధారణంగా మలయాళ సినిమాలు సింపుల్ లైన్ తో .. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందుతూ ఉంటాయి. చాలా తక్కువ పాత్రలతోనే వాళ్లు ఎమోషనల్ గా మంచి ఫీల్ ను వర్కౌట్ చేస్తుంటారు. కానీ 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' విషయానికి వస్తే, ఈ లైన్ మంచిదే. ఆకతాయిగా తిరిగే ఒక యువకుడు తనకి తెలియకుండగా వచ్చేసి పాకిస్థాన్ బోర్డర్ లో పడితే, ఎలాగో అలా ఇండియాకి తిరిగి వెళ్లిపోదామని అనుకుంటే లాక్ డౌన్ వచ్చిపడినప్పుడు అతను ఏం చేస్తాడనే ఆసక్తికరమైన కంటెంట్ ఉన్నదే. 

కానీ హీరో ఆకతాయి వేషాలతోనే ఫస్టాఫ్ అంతా నెట్టుకుంటూ వెళ్లిన దర్శకుడు. సెకండాఫ్ లో పాకిస్థాన్ బోర్డర్లో చాలా వరకూ రెండు పాత్రల మధ్యనే కథను నడిపించాడు. హిందూ - ముస్లిమ్ మధ్య స్నేహభావం ఉండాలనే సందేశం దిశగా హీరో ముందుకు వెళ్లడం మంచి విషయమే. కానీ అందుకు తగిన సన్నివేశాలను పట్టుగా అల్లుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 

చివర్లో ఏదో సందేశం ఉందికదా అని, మొదటి నుంచి అక్కడి వరకూ ఈ కథను ఓపికగా భరించడం కష్టమే. మొదటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు పడుంటే, చివర్లో సందేశానికి ఒక ప్రయోజనం దక్కేదేమో. అక్కడక్కడా కాస్త కామెడీ .. చివర్లో ఎమోషన్స్ తప్ప ఆడియన్స్ ను ప్రభావితం చేసే మిగతా అంశాలేవీ కనిపించవు. అనశ్వర రాజన్ వంటి హీరోయిన్ ను పెట్టుకుని, ఎటూ కాకుండా వదిలేశారు. 

ఇక ఈ సినిమాలో చెప్పుకోదగినది ఏమైనా ఉందంటే .. అది ఫొటోగ్రఫీ. అప్పుడప్పుడు కనిపించే అందమైన లొకేషన్స్ ప్రేక్షకుడికి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఫస్టాఫ్ హీరో, అతని ఫ్రెండ్ పై నడుస్తుంది. సెకండాఫ్ హీరో .. షేర్ ఖాన్ పాత్రలతో నడుస్తుంది. మిగతా పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం ఈ కథలో కనిపించే లోపంగానే చెప్పుకోవచ్చు. 

Movie Details

Movie Name: Malayalee From India

Release Date: 2024-07-05

Cast: Nivin Pauly, Dhyan Sreenivasan, Anaswara Rajan, Deepak Jethi, Manju Pillai

Director: Dijo Jose Antony

Producer: Listin Stephen

Music: Jekes Bejoy

Banner: Magic Frames

Review By: Peddinti

Malayalee From India Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews