'నెరు' - (హాట్ స్టార్) మూవీ రివ్యూ

  • మోహన్ లాల్ ప్రధాన పాత్రగా 'నెరు' 
  • కోర్టు రూమ్ డ్రామా జోనర్లో సాగే సినిమా
  • ఆసక్తికరమైన కథాకథనాలు
  • కదలనీయని సన్నివేశాలు 
  • ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్  

మలయాళంలో దర్శకుడిగా జీతూ జోసెఫ్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన నుంచి వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు, మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లోను ప్రేక్షకుల ఆదరణను పొందాయి. అలాంటి జీతూ జోసెఫ్ రూపొందించిన 'నెరు' సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రగా 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ రోజు నుంచే తెలుగుతో పాటు మిగతా భాషల్లోను 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ కథ కేరళలో నడుస్తుంది .. మహ్మద్ (జగదీశ్) దంపతుల ఏకైక సంతానమే సారా (అనస్వర రాజన్). ఆర్థికపరమైన ఇబ్బందులు లేని కుటుంబమే వారిది. 'సారా'కి ఒక అరుదైన వ్యాధి కారణంగా 12వ యేట చూపుపోతుంది. ఎదుటివారి స్పర్శ కారణంగా వారి స్వభావం .. ఒకసారి తడిమి చూస్తే, మట్టితో  వారి బొమ్మను చేయగల నైపుణ్యం ఆమె సొంతం. యవ్వనంలోకి అడుగుపెట్టిన సారాను ఆ దంపతులు ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటారు. 

ఒక రోజున మహ్మద్ దంపతులు ఒక ఫంక్షన్ కి వెళతారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న 'సారా'పై ఒక యువకుడు అఘాయిత్యం చేస్తాడు. అతను ముంబైకి చెందిన శ్రీమంతుడి కొడుకు మైఖేల్( శంకర్). ఆమె అతని మట్టిబొమ్మ చేసి కుటుంబ సభ్యులకు చూపిస్తుంది. దాని ఆధారంగా పోలీసులు అతణ్ణి అరెస్టు చేస్తారు. మైఖేల్ తల్లిదండ్రులు తమ కొడుకుకి శిక్ష పడకుండా చేయమని చెప్పి, సీనియర్ లాయర్ రాజశేఖర్ (సిద్ధిఖీ)ను రంగంలోకి దింపుతారు. అతని కూతురు పూర్ణిమ రాజశేఖర్ (ప్రియమణి)  కూడా పేరున్న లాయర్.

మైఖేల్ ను కాపాడటం కోసం రంగంలోకి దిగిన రాజశేఖర్, తన పరపతిని ఉపయోగించి 'సారా' తరఫున ఎవరూ వాదించకుండా చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో 'సారా' తల్లిదండ్రులు, విజయ్ మోహన్ (మోహన్ లాల్)ను కలుస్తారు. కొన్ని కారణాల వలన .. కొంతకాలంగా ఆయన కోర్టుకు దూరంగా ఉంటూ ఉంటాడు. అందుకు కూడా రాజశేఖర్ కారణం. ముందుగా ఈ కేసు జోలికి పోకపోవడమే మంచిదనుకున్న విజయ్ మోహన్, ఆ తరువాత 'సారా' తరఫున పోరాడాలని నిర్ణయించుకుంటాడు.

'సారా'కి చూపులేదు .. స్పర్శ ద్వారా ఆమె నేరస్థుడిని గుర్తించడం వలన .. బొమ్మను చేసి చూపించడం ద్వారా కేసు గెలిచే అవకాశం లేదు. మైఖేల్ అత్యాచారం చేశాడనడానికి ఇతర ఆనవాళ్లు ఏమీ లభించవు. సీసీటీవీ కెమెరా పుటేజ్ కూడా దొరక్కుండా రాజశేఖర్ చేస్తాడు. ఆ రోజున మైఖేల్ అసలు ఆ ఊళ్లోనే లేడని కోర్టును రాజశేఖర్ నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు విజయ్ మోహన్ ఏం చేస్తాడు? రాజశేఖర్ తో అతనికి గల గొడవ ఏంటి? 'సారా' కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది మిగతా కథ. 

శాంతి మాయాదేవి - జీతూ జోసెఫ్ కలిసి రాసుకున్న కోర్టు రూమ్ డ్రామా ఇది. కథలో చాలా వరకూ కోర్టులోనే జరుగుతుంది. నిజానికి కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలోని చాలా కథలు బోర్ కొడుతూ ఉంటాయి. ఒకే చోటున కథ నడవడం .. అదే పనిగా సాగే వాదోపవాదనలు .. చూడటానికి చాలామంది పెద్దగా ఆసక్తిని కనబరచరు. కానీ ఈ కథ అలా కాదు .. మొదటి నుంచి చివరి వరకూ అలా కూర్చోబెట్టేస్తుంది. కథ కోర్టులోనే ఎక్కువగా నడుస్తున్నట్టు అనిపించినా, దాని వెనుక గల కారణాలు కుతూహలాన్ని రేపుతాయి. 

కంటిచూపు కోల్పోయిన ఒక యువతి తనపై అఘాయిత్యానికి పాల్పడినవాడిని చట్టానికి పట్టించడానికి ఆరాటపడే సన్నివేశాలు .. ఆమెకి ఎలాగైనా న్యాయం జరగడం కోసం లాయర్ గా విజయ్ మోహన్ చేసే ప్రయత్నాలు .. ఆ ప్రయత్నాలకు అడ్డుపడటానికి రాజశేఖర్ వేసే ఎత్తుగడలు ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతూ కథతో పాటు పరుగులు పెట్టిస్తాయి. ప్రీ క్లైమాక్స్ ..  క్లైమాక్స్ చూసిన తరువాత ఈ కథ మరింత బలమైనదనే విషయం మనకి అర్థమవుతుంది. 

మోహన్ లాల్ ... సిద్ధికీ .. ప్రియమణి నటన సహజత్వానికి  చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఈ ముగ్గురూ సీనియర్ ఆర్టిస్టులు కావడం వలన, వాళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కానీ ఈ సినిమాలో అంధురాలిగా చేసిన 'అనస్వర రాజన్' నటనను అభినందించకుండా ఉండలేం. ఈ పాత్ర కోసం నిజంగానే అంధురాలిని తీసుకున్నారేమో అనిపించకమానదు. ఆ యువతి నటన అంత గొప్పగా కనిపిస్తుంది. ఆ తరువాత కూడా ఆ పాత్ర గుర్తుండిపోతుంది. 

ఎక్కడా కూడా 'అతి'గా అనిపించే హడావిడి కనిపించదు. ప్రధానమైన పాత్రలన్నీ కలిసి వాస్తవంలోకి మనలను లాగుతూ ఉంటాయి. అనవసరమైన సన్నివేశాలు .. కృత్రిమంగా అనిపించే నాటకీయతకు చోటే లేదు. ప్రతి సన్నివేశం మనముందు జరుగుతున్నట్టుగా .. బెంచ్ పై కూర్చుని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. విష్ణుశ్యామ్ నేపథ్య సంగీతం కథకు మరింత బలాన్ని ఇచ్చింది. సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయక్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. 

నేరస్థులకు అవినీతిపరుల అండదండలు ఉంటాయి. డబ్బుంటే శిక్షల నుంచి తప్పించుకోవచ్చనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ తమకి తప్పకుండా న్యాయం జరుగుతుందని భావించిన బాధితుల నమ్మకాన్ని నిలబెట్టడానికి ఆ న్యాయం ఎవరో ఒకరి రూపంలో వస్తుంది .. చివరికి గెలిపిస్తుంది అనే సందేశాన్ని అందించే చిత్రం ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులను సంపాదించుకునే కంటెంట్ ఇది. 

Movie Details

Movie Name: Neru

Release Date: 2024-01-23

Cast: Mohanlal, Priyamani, Siddique, Anaswara Rajan, Jagadish, Ganesh Kumar

Director: Jeethu Joseph

Producer: Antony Perumbavoor

Music: Vishnu Shyam

Banner: Aashirvad Cinemas

Review By: Peddinti

Neru Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews