'ప్రేమ విమానం' - (జీ 5) మూవీ రివ్యూ

  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • కొత్తదనం లేని కథాకథనాలు
  • రొమాన్స్ కి దూరంగా నడిచే లవ్ ట్రాక్  
  • కనెక్ట్ కాని ఎమోషన్స్ 
  • అనూప్ రూబెన్స్ బాణీలు ఓకే 
  • చివర్లో ఇచ్చిన సందేశం బాగుంది
సంగీత్ శోభన్ .. శాన్వి మేఘన ప్రధాన పాత్రధారులుగా, అనసూయ కీలకమైన పాత్రలో నటించిన సినిమా 'ప్రేమ విమానం'. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను 'జీ 5' ద్వారా నేరుగా రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. గ్రామీణ నేపథ్యంలో .. ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

ఈ కథ అంతా కూడా ప్రస్తుతానికీ .. 1998 కాలానికి మధ్య జరుగుతుంది. 'మేడిపల్లి' అనే గ్రామంలో నాగరాజు (రవివర్మ) అనే రైతు ఉంటాడు. అతని తల్లి .. భార్య శాంత (అనసూయ) పిల్లలు రాము (దేవాన్ష్ నామా) లక్ష్మణ్ (అనిరుధ్ నామా) .. ఇదీ అతని కుటుంబం. నాగరాజుకు కొద్దిపాటి పొలం ఉంటుంది. దానిని సాగుచేసుకుంటూ ఆ కుటుంబం జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఆ ఊరు సేఠ్ శివయ్యకి అతను కొంత బాకీ ఉంటాడు. ఆ బాకీ నిమిత్తం నాగరాజు పొలాన్ని స్వాధీనం చేసుకోవాలనేది శివయ్య ఆలోచన. 

ఇక నాగరాజు ఇద్దరు పిల్లలకు కూడా 'విమానం' అంటే ఎంతో ఇష్టం. విమానం ఎక్కాలనే ఒక బలమైన ఆలోచనతో వాళ్లుంటారు. అందుకు ఎంత అవుతుందండేది గోపాల్ సార్ (వెన్నెల కిశోర్)ను అడిగి తెలుసుకుంటారు. వాళ్లను విమానం ఎక్కించాలనే అనుకున్న నాగరాజు, సేఠ్ టార్చర్ తట్టుకోలేక ఉరేసుకుని చనిపోతాడు. దాంతో సేఠ్ పెట్టిన 6 నెలల గడువులోగా అప్పు తీర్చడం కోసం శాంత నానా కష్టాలు పడుతుంటుంది. విమానం ఎక్కడం కోసం అవసరమైన డబ్బు కోసం, తల్లికి తెలియకుండా ఇద్దరు పిల్లలు ఒక హోటల్లో పనిచేస్తుంటారు. 

ఇక మరో వైపున సర్పంచ్ (సుప్రీత్ రెడ్డి) కూతురైన అబిత ( శాన్వి మేఘన)ను కిరాణ షాపు నడుపుకునే మల్లయ్య (గోపరాజు రమణ) కొడుకు మణి ( సంగీత్ శోభన్) ప్రేమిస్తూ ఉంటాడు. అబితకి అమెరికా సంబంధాన్ని తండ్రి చూస్తాడు. అందుకు సంబంధించిన పెళ్లి మాటలు జరుగుతూ ఉంటాయి. దాంతో కంగారుపడిపోయిన అబిత, గుడిలో మణిని కలుసుకుంటుంది. వాళ్ల ప్రేమ వ్యవహారం గురించి అబిత తల్లి భవానికి తెలిసి ఇద్దరినీ హెచ్చరిస్తుంది.

3 రోజుల్లో సేఠ్ కి డబ్బులు చెల్లించి తన పొలాన్ని విడిపించుకోవాలని శాంత అనుకుంటుంది. అందుకు అవసరమైన డబ్బును ఆమె పోగు చేస్తూ ఉంటుంది. ఆ డబ్బుతో ఇంట్లో నుంచి పారిపోయి, విమానం ఎక్కాలని ఆమె పిల్లలు నిర్ణయించుకుంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆ ఊరు నుంచి బయటపడాలని మణి - అబిత భావిస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? పర్యవసానాలు ఎలాంటివి? అనేది కథ. 

దర్శకుడు సంతోష్ తయారు చేసుకున్న కథ ఇది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ చూడొచ్చు. ఎక్కడా కూడా అసభ్యకరమైన సన్నివేశాలుగానీ .. ఆ తరహా డైలాగ్స్ కానీ లేవు. ఏ పాత్ర ఏ బూతు డైలాగ్ పలుకుతుందోనని టెన్షన్ తో టీవీల ముందు కూర్చునే ఈ రోజుల్లో, ఇలాంటి ఒక కంటెంట్ ను సహజత్వానికి దగ్గరగా నడిపించిన దర్శకుడు పనితీరును మెచ్చుకోవలసిందే. అయితే ఈ కథలో ప్రతి ట్రాక్ ను కొత్తదనంతో ముడిపెట్టి వుండుంటే ఆయనకి మరికొన్ని మార్కులుపడేవే. 

 అప్పులు తీర్చలేక భర్త చనిపోతే, ఆ అప్పులు తీర్చలేక భార్య నానా తిప్పలు పడటం .. పిల్లలు తమలోని ఒక బలమైన కోరికను తీర్చుకోవడం కోసం తప్పుదారి పట్టడం .. ఒక డబ్బున్న అమ్మాయి .. మిడిల్ క్లాస్ అబ్బాయితో లవ్ లోపడి, తండ్రి చంపేస్తాడేమోనని భయపడి లవర్ తో కలిసి ఆ ఊరు నుంచి పారిపోవడం. మొత్తంగా చూసుకుంటే మూడు వైపుల నుంచి నడిచే కథ ఇది. గతంలో చాలా సినిమాలలో ఈ తరహా దృశ్యాలను చూసి చూసి ప్రేక్షకులు అలసిపోయారు ... విసిగిపోయారు కూడా. 

సాధారణంగా పల్లెటూళ్లలో ఎవరు లవ్ లో పడినా ఊరంతా తెలిసిపోవడానికి ఎన్నో రోజులు పట్టదు. అందునా గొప్పింటి అమ్మాయిని టచ్ చేస్తే పెద్ద రచ్చ జరిగిపోతుంది. కానీ హీరో ఆ బంగ్లాకు వెళ్లి .. హీరోయిన్ కిటికీకి ఎదురుగా తాపీగా నిలబడి తీరుబడిగా కాగితం విమానాలు చేసి విసురుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా అదే పద్ధతిలో సందేశాలు పంపుతూ ఉంటుంది. ఇద్దరూ తరచూ గుళ్లో కలుసుకుంటూ ఉంటారు .. అయినా ఎవరూ చూడరు .. పట్టించుకోరు.

సరే ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు గదా అని చెప్పేసి, రొమాన్స్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కి నిరాశే మిగులుతుంది. ఐలవ్ యు చెప్పుకోవడమే పెద్ద విషయం అన్నట్టుగా ఆ రెండు పాత్రలు  ప్రవర్తిస్తాయి. 1998ని దాటేసి మనం మరీ అంత దూరం వచ్చేశామా అని మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పోనీ పాటల్లోనైనా రొమాన్స్ ను వర్కౌట్ చేశారా అంటే అదీ లేదు. కాగితం విమానాల మీద ఈ ప్రేమికుల రాతలు .. ఆకాశంలో ఎగిరే విమానాల మీద ఇద్దరు పిల్లల ఆశలు  చూస్తూ కూర్చోవలసిందే.

తెరపై కథ అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఎక్కడా ఆసక్తిని రేకెత్తించే అంశాలుగానీ .. ట్విస్టులు గానీ .. ఏం జరగనుందనే ఉత్కంఠను పెంచే సన్నివేశాలుగాని .. ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడంగాని  లేకపోవడమే ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. ఫొటోగ్రఫీ ... ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అనూప్ రూబెన్స్ బాణీలు మాత్రం ఫరవాలేదు. 'దొరసాని దొరసాని .. ' ... 'ఆనందం ఉప్పొంగెలే' అనే పాటలు బాగానే ఉన్నాయి. చివర్లో ఇచ్చిన సందేశం బాగుంది. కథలో కొత్తదనం లేకపోయినా, ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ఉంటే ఇంకాస్త కనెక్ట్ అయ్యేదేమో.

Movie Details

Movie Name: Prema Vimanam

Release Date: 2023-10-12

Cast: Sangeeth Sobhan, Shanvi Meghana, Supreeth Reddy, Goparaju Ramana, Devansh Nama, Anirudh Nama

Director: Santhosh

Producer: Abhishek Nama

Music: Anup Rubens

Banner: Abhishek Pictures

Review By: Peddinti

Prema Vimanam Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews