'దయా' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

  • జేడీ చక్రవర్తి ప్రధానమైన పాత్రగా 'దయా'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • ఆసక్తిని పెంచే కథాకథనాలు 
  • ఇబ్బందిపెట్టే హింస .. రక్తపాతం
  • అసలైన అంశాలు సీజన్ 2కి వదిలేసిన డైరెక్టర్  

ఈ మధ్య కాలంలో తెలుగు నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగే వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ 'దయా'. గతంలో రాజేంద్రప్రసాద్ తో 'సేనాపతి' చేసిన పవన్ సాదినేని ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు. తెలుగులో జేడీ చక్రవర్తి ఫస్టు టైమ్ చేసిన వెబ్ సిరీస్ ఇది. నిన్నటి నుంచి ఈ వెబ్ సిరీస్ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ వదిలారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

'దయా' (జేడీ చక్రవర్తి) 'కాకినాడ'కి దగ్గరలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతని భార్య 'అలివేలు' (ఈషా రెబ్బా) నిండుచూలాలు. దయా కాకినాడ రేవు నుంచి చేపలను సప్లై చేసే ఒక ఫ్రీజర్ వ్యాన్ కి డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి వినికిడి సమస్య ఉంటుంది .. చెవిలో నుంచి మిషన్ తీసేస్తే ఏమీ వినిపించదు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా పనిచేస్తూ వెళ్లిపోతుంటాడు. చేపల లోడ్ ఎక్కించే విషయంలో అతనికి 'ప్రభు' (జోష్ రవి) హెల్ప్ చేస్తూ ఉంటాడు.తన భార్యను డాక్టర్ చెకప్ కి తీసుకెళ్లాలనే టెన్షన్ లో దయా ఉంటాడు. 

ఇక ఇదే సమయంలో కవిత నాయుడు (రమ్య నబీసన్) ఒక సీనియర్ జర్నలిస్ట్. ఒక టీవీ ఛానల్ లో ఐదేళ్లుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ ఛానల్ కి సీఈవో గా విజయ్ ఉంటాడు. కాకినాడ ప్రాంతానికి చెందిన 'స్వేచ్ఛ' (గాయత్రి గుప్తా) రేప్ కి గురవుతుంది. మాస్క్ లేకుండా ఆమె ఫోటోను ప్రసారం చేసిన విషయంలో విజయ్ తో కవిత గొడవపడుతుంది. స్వేచ్ఛకి న్యాయం జరిగేలా చేయాలనే ఉద్దేశంతో, తన జూనియర్ 'షబానా' (విష్ణుప్రియ) ను వెంటబెట్టుకుని కాకినాడ చేరుకుంటుంది.

కాకినాడ ఎమ్మెల్యే 'పరశురామ్ రాజు' (పృథ్వీ) పెద్ద రౌడీ గ్యాంగ్ ను పెంచి పోషిస్తూ ఉంటాడు. అతనికి 'వీరప్పనాయుడు' అనే కేంద్ర మంత్రి అండదండలు ఉంటాయి. అందువలన ఆయన ఆగడాలకు హద్దులేకుండా పోతుంది. తన బావమరిది ద్వారా ఆయన అన్ని రకాల అరాచకాలను కొనసాగిస్తూ ఉంటాడు. స్త్రీలోలుడైన ఆయనలో మానవత్వం మచ్చుకి కూడా కనిపించదు. ఆయనకి తెలియకుండా కాకినాడలో ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగవు.

 కవిత వైవాహిక జీవితం విషయానికి వస్తే కొన్ని ఇబ్బందులను ఆమె ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆమె 
భర్త కౌశిక్ ( కమల్ కామరాజు) కూతురు శిరీష. భర్తకి .. ఆమెకి మధ్య కొంతకాలంగా విడాకుల దిశగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ రేప్ కేసు విషయంపై కాకినాడ వెళ్లిన కవిత హత్య చేయబడుతుంది. ఆమె శవం 'దయా'కి తెలియకుండా ఆయన వ్యాన్ లోకి చేర్చడం జరుగుతుంది. ఆ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక ఆయన భయపడిపోతుంటాడు. అది జర్నలిస్ట్ కవిత శవం అనే విషయం టీవీ వార్తల వలన అతనికి  తెలుస్తుంది. 

అప్పుడు దయా ఏం చేస్తాడు? కవితను హత్య చేసింది ఎవరు? ఆమె శవం దయా వ్యాన్ లోకి ఎలా వచ్చింది? భర్తకి ఎదురైన పరిస్థితి తెలియని అలివేలు ఏం చేస్తుంది? కవిత మరణం పట్ల ఆమె భర్త కౌశిక్ ఎలా స్పందిస్తాడు? కవిత వెంట వెళ్లిన షబానా ఏమైపోతుంది ? ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఏసీపీ హరి ఎందుకు కౌశిక్ ను అనుమానిస్తాడు? ఈ పాత్రలను వెదుకుతూ వెంటాడే 'కబీర్' ఎవరు? వంటి మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ఈ కథ చాలా సాధారణంగా మొదలవుతుంది .. ఆ తరువాత నుంచి చిక్కబడుతూ వెళుతుంది. ఫస్టు ఎపిసోడ్ బ్యాంగ్ నుంచే దర్శకుడు కథపై ఆసక్తిని పెంచుతూ వెళ్లాడు. కవిత అనే ఒక జర్నలిస్ట్ హత్యతో ఈ కథ మొదలవుతుంది. అయితే చివరి వరకూ ఆమె హత్యకి దారితీసిన పరిస్థితులు తెరపై కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక వైపున ఆమె శవం చుట్టూ .. మరో వైపున ఆమె బ్రతికున్నప్పుడు ఫేస్ చేసిన సంఘటనల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. ఈ రకమైన స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా కనిపిస్తుంది ..  అదే సమయంలో సాధారణ ప్రేక్షకులకు కాస్త గందరగోళాన్ని కూడా కలిగిస్తుంది.  

దయా నిజ స్వరూపాన్నీ .. అలాగే ఆయన భార్య అలివేలు అసలు స్వభావాన్నీ దర్శకుడు రివీల్ చేసిన తీరు ఉత్కంఠను పెంచుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ మొత్తంలో ఇతర పాత్రలతో ఎలాంటి ప్రమేయం లేకుండా ఒంటరిగా ప్రయాణం చేస్తూ, వరుస హత్యలు చేసుకుంటూ వెళ్లే కబీర్ పాత్ర హైలైట్ గా కనిపిస్తుంది. సింగిల్ డైలాగ్ లేకుండా ఆ పాత్రను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో పాలుపంచుకోకుండా అనవసరంగా ఏ పాత్ర కూడా కనిపించదు. ప్రతి ఎపిసోడ్ బ్యాంగ్ .. ఆ తరువాత ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో బూతు డైలాగ్స్ లేవు .. కానీ ఒక చోట కాస్త ఘాటైన శృంగారం ఉంది .. ధైర్యం చేసి స్క్రీన్ వైపు చూడలేనంత హింస .. రక్తపాతం ఉన్నాయి. ఐస్ దిమ్మలను చిన్న చిన్న ముక్కలను చేసే మిషన్ లోకి ఒక వ్యక్తిని తల నుంచి కాళ్ల వరకూ తోసేయడం పరాకాష్ఠ. జేడీ చక్రవర్తి తన పాత్రలోని వేరియేషన్స్ ను బాగా చూపించాడు. ఈషా రెబ్బా పాత్రను టచ్ చేసింది చాలా తక్కువ. రమ్య నంబీసన్ .. నందగోపాల్ ... 'పెళ్లి' పృథ్వీ .. జోష్ రవి .. విష్ణు ప్రియా బాగా  చేశారు.

శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. వివేక్ కాలెపు ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. విప్లవ్ ఎడిటింగ్ కూడా నీట్ గానే ఉంది. ఫస్టు సీజన్ లో ఈ మిస్టరీకి తెరపడలేదు. స్వేచ్చ రేప్ కి సంబంధించి కవిత సంపాదించిన ఆధారాలతో కూడిన పెన్ డ్రైవ్ ఏమైందో తెలియదు. దయా .. అలివేలు పాత్రలకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేయలేదు .. ఈ కేసు వెనకున్న కేంద్రమంత్రి ఎవరన్నది చూపించలేదు. సూర్యుడు ఉదయించగానే మళ్లీ యుద్ధం మొదలవుతుందంటూ సీజన్ 2కి రెడీగా ఉండమని స్పష్టం చేశారు. 

ప్లస్ పాయింట్స్ : కథ .. కథనం .. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. జేడీ .. నందగోపాల్ యాక్షన్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ. 

మైనస్ పాయింట్స్: సెక్స్ .. హింస .. రక్తపాతం .. కొన్ని చోట్ల సంభాషణలు పొడిగించడం. 

Movie Details

Movie Name: Dayaa

Release Date: 2023-08-04

Cast: JD Chakravarthy, Eesha Rebba, Pruthvi, Ramya Nabeesan, Nandagopal, Vishnu Priya, Josh Ravi

Director: Pavan Sadineni

Producer: Srikanth Mohta - Mahendra Sony

Music: Shravan Bharadwaj

Banner: SVF

Review By: Peddinti

Dayaa Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews