'బ్రో' - మూవీ రివ్యూ

  • పవన్ - సాయితేజ్ నుంచి వచ్చిన 'బ్రో'
  • అందరినీ నడిపించేది .. శాసించేది కాలమే అని చెప్పే కాన్సెప్ట్
  • సముద్రఖని కథ .. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం 
  • కామెడీ పరంగా కనిపించని త్రివిక్రమ్ మార్క్ 
  • తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ 
  • పవన్ ఫ్యాన్స్ కి నచ్చేలా అమర్చిన అంశాలు

పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో రీమేకులపై ఎక్కువగా దృష్టి పెడుతూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన 'వకీల్ సాబ్' .. 'భీమ్లా నాయక్' భారీ విజయాలను నమోదు చేశాయి. అదే తరహాలో ఆయన ఈ సారి చేసిన సినిమానే 'బ్రో'. 2021లో సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో హిట్ కొట్టిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. అక్కడ స్టార్స్ ఎవరూ లేకుండా ఆడిన సినిమా అది. ఆ కథకి పవన్ క్రేజ్ ను యాడ్ చేస్తే కథలోని సహజత్వం దెబ్బతింటుందనే కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ కి దూరంగా సముద్రఖని ఈ కథను తీసుకెళ్లాడా? పవన్ క్రేజ్ కి తగినట్టుగా బ్యాలెన్స్ చేయగలిగాడా? అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ హైదరాబాదులో నడుస్తుంది .. మార్కండేయ (సాయితేజ్) ఓ కార్పొరేట్ సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాడు. తల్లి ... ఇద్దరు చెల్లెళ్లు .. ఒక తమ్ముడు .. ఇది అతని కుటుంబం. తండ్రి లేని ఆ కుటుంబానికి అతనే పెద్దగా అందరికీ కావలసినవి సమకూర్చిపెడుతూ ఉంటాడు. అతను సమయానికి చాలా విలువనిస్తూ ఉంటాడు. తన టైమ్ ను ఎవరు వేస్టు చేయడానికి ట్రై చేసినా అతను ఒప్పుకోడు. త్వరలో తనని జనరల్ మేనేజర్ చేసే అవకాశం ఉండటంతో మరింత ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు. 

ఇక రమ్య (కేతిక శర్మ) మార్కండేయను లవ్ చేస్తూ ఉంటుంది. తనని పెళ్లి చేసుకోమని వెంటపడుతూ ఉంటుంది. తన పెద్ద చెల్లెలు వీణ (ప్రియా ప్రకాశ్ వారియర్)కి పెళ్లి చేయాలనీ, అలాగే తన చిన్న చెల్లెలు చదువు .. తమ్ముడు సెటిల్ కావడం పై తాను ఫోకస్ పెట్టాలని మార్కండేయ అంటాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుందామని నచ్చజెబుతాడు. కంపెనీ పనిపై వైజాగ్ వెళ్లిన మార్కండేయ, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో అతను చనిపోతాడు. 

మార్కండేయ ఆత్మ పరలోకానికి చేరుకుంటుంది. అక్కడ అతను కాలపురుషుడు (పవన్ కల్యాణ్)ను చూస్తాడు. తాను చనిపోయానని తెలుసుకున్న మార్కండేయ, అర్ధాంతరంగా తనని ఇలా తీసుకుని వచ్చేయడం కరెక్టు కాదని కాలపురుషుడి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తాడు. తాను లేకపోతే తన కుటుంబం రోడ్డున పడుతుందనీ .. తనకి బ్రతకాలని ఉందని చెబుతాడు. తన బాధ్యతలను తీర్చుకునే అవకాశం ఇవ్వమనీ .. కొంతకాలం పాటు బ్రతికే ఛాన్స్ ఇవ్వమని కోరతాడు. 

కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటుందనీ, ఎవరు లేకపోయినా ఏదీ ఆగదని కాలపురుషుడు చెబుతాడు. పరిస్థితులను బట్టి ఎవరికి వారు తమ మనసులను ... మార్గాలను మార్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారని అంటాడు. అలాంటివారి కోసం బాధపడొద్దని చెబుతాడు. అయినా మార్కండేయ వినిపించుకోడు. దాంతో కాలపురుషుడు అతనికి 90 రోజుల పాటు బ్రతికే అవకాశం ఇస్తాడు. సమయాన్ని గుర్తు చేయడం కోసం మార్కండేయతో కలిసి  భూలోకానికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? చివరికి మార్కండేయ తెలుసుకునేదేమిటి? అనేదే కథ.

సముద్రఖని చాలా సీనియర్ డైరెక్టర్ .. మంచి రైటర్ కూడా. ఈ సినిమా మూలకథ ఆయన రాసుకున్నదే. ఈ భూమ్మీదకి అందరూ అతిథులుగా వచ్చినవారే .. ఎవరికి వారుగా ఇక్కడి నుంచి నిష్క్రమించవలసిందే. ఈ నాలుగు రోజుల దానికి ఇంత ఆరాటం .. తపన అవసరం లేదు. మరణం తరువాత బాధపడకూడదంటే, ఉన్నన్నాళ్లు నిజాయతీగా .. సేవాగుణంతో జీవించడమే అనే కాన్సెప్ట్ తో ఆయన ఈ సినిమాను తెరకెక్కించాడు. అవసరం .. అవకాశమే తప్ప, ఇక్కడ  ఎవరూ ఎవరినీ పట్టుకుని వ్రేళ్లాడరు అనే సందేశం కూడా అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది . 

ఈ తరహా కథలు ఇంతకుముందు వచ్చినవే. అయితే వాటి బాటలో ఈ కథ నడవదు. పవన్ కల్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోకి జోడీ లేకుండా .. ఆయనను ఒక ప్రత్యేకమైన పాత్రలో చూపించి ప్రేక్షకులను ఒప్పించడం కష్టమే. ఆయన పాత్రను బ్యాలెన్స్ చేయడం కూడా కష్టమే. కానీ సముద్రఖని ప్రేక్షకులకు అసంతృప్తి కలగనీయకుండా ఇటు పవన్ పాత్రను .. అటు సాయితేజ్ పాత్రను డిజైన్ చేసుకున్నాడు. పవన్ పాత్రను చాలా మోడ్రన్ గానే చూపిస్తూ .. చాలా యాక్టివ్ గా ప్రెజెంట్ చేస్తూ వెళ్లాడు. పవన్ పై ఆయన హిట్ సినిమాల్లోని పాప్యులర్ పాటల బిట్స్ ను ప్లే చేస్తూ, ఫ్యాన్స్ ను హుషారెత్తించాడు. 

ఇక సముద్రఖని కథ తరువాత చెప్పుకోవలసింది, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే గురించి .. ఆయన చేసిన మేజిక్ గురించి. తెరపై .. పరలోకంలో మొత్తం చీకటి. 'ఇక్కడ పవర్ లేదా?' అని సాయితేజ్ అనగానే ఒక మెరుపుతో పాటు పవన్ ఎంట్రీ ఇచ్చిన తీరుతో ఫ్యాన్స్ గోలపెట్టేస్తారు. అలాగే ఇంట్రడక్షన్ లో 'టి' గ్లాస్ పట్టుకుని మాస్ లుక్ తో పవన్ వేసే సింపుల్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. చాలా చోట్ల పవన్ 'టి' గ్లాస్ పట్టుకుని కనిపిస్తాడు. 'వీళ్లకి ట్రెండింగ్ కీ .. ట్రోలింగ్ కి తేడా తెలియదేంట్రా బాబూ'  అంటూ, కొంతమందిని టార్గెట్ చేస్తూ చురకలు అంటిస్తాడు. అవన్నీ త్రివిక్రమ్ మేజిక్ లోనివే. 


అయితే సముద్రఖని - త్రివిక్రమ్ ఇద్దరూ కూడా, పవన్ ను ఆయన అభిమానులు ఆశించినట్టుగానే స్టైలీష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో ఆ పాత్ర ఔన్నత్యం దెబ్బతినకుండా చూసుకున్నారు. సాధారణంగా ఇలాంటి కథల కోసం పరలోకం సెట్ వేయిస్తుంటారు. కానీ అలాంటివేం లేకుండా .. వెలుగు - చీకటి మధ్య లోనే పరలోకానికి సంబంధించిన సీన్స్ ను నడిపించారు. తాము అనుకున్న కంటెంట్ ను నీట్ గా .. బోర్ లేకుండగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయగలిగారు.

పవన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ తెరపై సందడి చేశాడు. ఇక సాయితేజ్ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. అయితే లుక్ పరంగా ఆయన ఇంకా బరువు తగ్గాలనిపిస్తుంది. కేతిక గ్లామరస్ గానే ఉంది .. కానీ ఆమె నుంచి రొమాన్స్ రాబట్టుకునే సమయం కథలో లేదు. ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ ను సాయితేజ్ కి చెల్లెలిగా చూపించడం మరికొంత నిరాశపరిచే విషయం. సుబ్బరాజు పాత్ర అనవసరం అనిపిస్తే, పృథ్వీ పాత్ర అతికించినట్టు అనిపిస్తుంది. పవన్ కాంబినేషన్లోని బ్రహ్మానందం .. తనికెళ్ల భరణి సీన్స్ నుంచి, వెన్నెల కిశోర్ సీన్స్ నుంచి త్రివిక్రమ్ స్థాయి కామెడీ రాకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.           


సుజిత్ వాసుదేవ్ ఫొటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ ను చాలా బాగా చిత్రీకరించాడు. ఇక తమన్ విషయానికి వస్తే 'బ్రో' థీమ్ మ్యూజిక్ .. 'మైడియర్ మార్కండేయ' సాంగ్ బాగా కనెక్ట్ అవుతాయి. అయితే 'జాణవులే .. 'అంటూ తమన్ పాడిన పాటలో ఆయన వాయిస్ సాయితేజ్ కి సెట్ కాలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఆయన రెచ్చిపోయాడు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా ఓకే. ఇది పవన్ మార్క్ సినిమా .. థియేటర్స్ కి వెళ్లిన ఆయన అభిమానులతో కాసేపు సందడి చేయించే  సినిమా అనే చెప్పచ్చు. 

ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పవన్ మార్క్ స్టైల్ .. ఆయన పాప్యులర్ సాంగ్స్ బిట్స్ ను ప్లే చేయడం .. 'బ్రో' థీమ్ మ్యూజిక్.  


మైనస్ పాయింట్స్: కామెడీలో త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడం, కేతిక పాత్ర వైపు నుంచి రొమాన్స్ కి ఛాన్స్ ఇవ్వకపోవడం .. బ్రహ్మానందం .. వెన్నెల కిశోర్ పాత్రలు తేలిపోవడం .. క్లైమాక్స్ ఏంటనేది ఆడియన్స్ కి ముందే తెలిసినప్పటికీ, దానిని చూపించిన తీరు తాము ఆశించిన స్థాయిలో లేదని ఆడియన్స్ కి అనిపించడం. 

Movie Details

Movie Name: BRO

Release Date: 2023-07-28

Cast: Pavan Kalyan, Sai Tej, Kethika Sharma, Priya Prakash, Brahmanandam, Vennela Kishore, Rohini

Director: Samudrakhani

Producer: Vishwaprasad

Music: Thaman

Banner: People Media Factory

Review By: Peddinti

BRO Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews