'ఖలీఫా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Advertisement
మలయాళ కథానాయకులలో పృథ్వీరాజ్ సుకుమారన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా రూపొందిన సినిమానే 'ఖలీఫా'. జిను అబ్రహం నిర్మించిన ఈ సినిమాకి వైశాఖ్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 20వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో రూపొందిన ఈ సినిమా, తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

యూనస్ అలీ .. ఒక నిజాయితీ పరుడైన బిజినెస్ మేన్. అయితే గతంలో అతని తండ్రి అహ్మద్ అలీ స్మగ్లింగ్ చేయడం వలన, ఆ మచ్చ అతని కెరియర్ పై పడుతుంది. ఆ కారణంగా అతని బిజినెస్ కూడా చిక్కుల్లో పడుతుంది. దాంతో అతను రాజకీయనాయకుడైన రాఘవన్ ను ఆశ్రయిస్తాడు. అతను ఒక పథకం ప్రకారం యూనస్ అలీ పై స్మగ్లింగ్ కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. ఊహించని ఈ సంఘటనకి యూనస్ కొడుకైన ఆమీర్ అలీ (పృథ్వీరాజ్ సుకుమారన్) షాక్ అవుతాడు. 

ఆమిర్ అలీకి ఫిజా (మాళవిక శర్మ)తో వివాహమవుతుంది. అతను తన భార్యతో కలిసి ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ధర్మ బద్ధమైన జీవితాన్ని గడపాలనుకునే తండ్రినే అతనికి ఆదర్శం. అలాంటి పరిస్థితులలో తండ్రి జైలుకు వెళ్లడం ఆయనను కలచి వేస్తుంది. కావాలని తన తండ్రిని ఈ కేసులో ఇరికించారనే విషయం ఆయనకి అర్థమైపోతుంది.  రాజకీయనాయకుడైన రాఘవన్ .. అతని కొడుకు వినాయకన్ .. హారీస్ అందుకు కారకులని ఆయన గ్రహిస్తాడు.    

ఈ కేసు నుంచి తన తండ్రిని బయటికి తీసుకురావాలంటే,పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందనే విషయం ఆమీర్ అలీకి అర్థమవుతుంది. అప్పటి వరకూ తండ్రి సంపాదించినందంతా సీజ్ చేయబడుతుంది. దాంతో తనకి అవసరమైన డబ్బుకోసం అతను తన తాత మాదిరిగానే స్మగ్లింగ్ బాటపడతాడు. ఆ ప్రయాణంలో ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? అనేది మిగతా కథ.

నీతిగా ఉండాలనుకోవడం .. నిజాయితీగా బ్రతకాలనుకోవడం అనుకున్నంత తేలిక కాదు. ధర్మబద్ధంగా నడచుకోవాలనుకోవడమే ఈ రోజులలో అసలైన సవాల్. అలాంటి ఒక నిజాయితీపరుడు .. కొంతమంది అరాచకుల వలన జైలుపాలవుతాడు. తన ఆస్తిపాస్తులపై అధికారాన్ని కోల్పోతాడు. అది భరించలేకపోయిన అతని కొడుకు, అవినీతిపరులకు ఎలా గుణపాఠం చెబుతాడు? అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది.

తన తండ్రి కోరుకున్నట్టుగా తాను నీతిగా .. న్యాయంగా బ్రతకాలని ఒక కొడుకు ఆశపడతాడు. అయితే అదే తండ్రిని రక్షించుకోవడం కోసం అతను తన తాత మాదిరిగా గోల్డ్ స్మగ్లింగ్ చేయవలసి వస్తుంది. తన కుటుంబానికి అన్యాయాన్ని తలపెట్టించిన రాజకీయనాయకుడికి పోటీగా ఎలా నిలబడతాడు?  అలవాటు లేని ఆ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివి? తన చుట్టూ ఉన్న శత్రువులను అతను ఎలా గెలుచుకుంటూ వెళతాడు? అనేది ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి. 

హీరో కుటుంబం .. ఆ కుటుంబానికి విలన్ అన్యాయం చేయడం .. తన తండ్రిని కాపాడుకోవడం కోసం విలన్ ఎదిరించడానికి హీరో రంగంలోకి దిగడంతో ఫస్టు పార్ట్ కొనసాగుతుంది. గోల్డ్ స్మగ్లింగ్ లో విలన్ కి వ్యతిరేకంగా హీరో నిలబడటం .. ఈ విషయంలో వాళ్లిద్దరి మధ్య నడిచే వ్యూహాలు .. ప్రతి వ్యూహాలతో సెకండాఫ్ నడుస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కి తగినట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైటింగులు .. కార్లు .. బైకులు ఛేజింగుల హడావిడి ఎక్కువగానే కనిపిస్తుంది. జైల్లో హీరోను విలన్ గ్యాంగ్ చుట్టుముట్టినప్పుడు జరిగే ఫైట్ ను .. విలన్ అనుచరుల బారి నుంచి హీరో ఫ్యామిలీని సెక్యూరిటీవాళ్లు కాపాడే ఫైట్ ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ రెండు ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

ఇక కస్టమ్స్ ఆఫీసర్స్ కళ్లుగప్పి బంగారం స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎన్ని మార్గాల ద్వారా జరుగుతుంది? అనేది దర్శకుడు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. హీరో ఫ్యామిలీ వైపు నుంచి ఎమోషనల్ డ్రామా ఉంది గానీ .. దానికి ఇచ్చిన స్పేస్ చాలా తక్కువని చెప్పాలి. పృథ్వీ రాజ్ సుకుమారన్ సరసన మాళవిక శర్మ కనిపిస్తుంది అంతే. ఆమె కథానాయిక అని చెప్పలేము. హీరో - హీరోయిన్ల మధ్య ఎలాంటి లవ్ .. రొమాన్స్ ప్లాన్ చేయలేదు. ఆ వైపు నుంచి ఆశలు పెట్టుకున్న ఆడియన్స్ కి మాత్రం నిరాశ తప్పదు.

ఇది భారీ సినిమాగానే చెప్పుకోవలసి ఉంటుంది. జోమన్ జాన్ ఫొటోగ్రఫీ బాగుంది. ఆయా లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఫరవాలేదు. భారీ యాక్షన్ దృశ్యాలను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఛమన్ చాకో ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. టెక్నికల్ గా ఈ సినిమా మంచి మార్కులనే సంపాదించుకుంటుంది.  

ఈ తరహా జోనర్ కథలకు తగినట్టుగానే, ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దిశగా కథ వెళుతున్నా కొద్దీ యాక్షన్ పాళ్లు ముదురుతూ వెళతాయి. ఈ కథలోను అంతే. కథలో స్పష్టత ఉంది .. ఆ కథ కోసం కాస్త గట్టిగానే ఖర్చు పెట్టారు కూడా. కాకపోతే ఎక్కడా కొత్తదనం గురించిన ఆలోచన చేయలేదు .. అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరగలేదు. చాలా కాలంగా వచ్చిన చాలా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో ఒకటిగానే ఇది కనిపిస్తుంది.  

Movie Name: Khalifa

Genre: Action, Thriller

Release Date: 2026-10-09

Cast: Prithviraj Sukumaran,Neil Nitin Mukesh,Suresh Oberoi ,Malvika Sharma,Sanju Sivram

Director: Vysakh

Music: Jakes Bejoy

Banner: Jakes Bejoy

Review By: Peddinti

Khalifa Rating: 2.00 out of 5

Advertisement
KhalifaVysakhJinu V Abraham - Suraj KumarPrithviraj SukumaranNeil Nitin MukeshSuresh OberoiMalvika SharmaSanju Sivram

More Movie Reviews

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24 Oct, 17:41

'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24 Oct, 12:00

'418' - మూవీ రివ్యూ!

23 Oct, 15:13

'నా వైఫ్ మిస్సింగ్' (ఆహా) మూవీ రివ్యూ!

22 Oct, 22:15

'రిపోర్టింగ్ లైవ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

22 Oct, 11:37

'లెనిన్ పాండియన్' ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

21 Oct, 15:16

'ఆశ' (జీ 5) మూవీ రివ్యూ!

19 Oct, 17:14

'ఎన్నా విలై' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

18 Oct, 17:27

'డీసీ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

18 Oct, 12:04
..More Movie Reviews