ధనుశ్ మేనల్లుడు 'పవీష్' హీరోగా రూపొందిన రెండో సినిమానే 'లవ్ ఓ లవ్'. జులై 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, యూత్ నుంచి మంచి మార్కులను కొట్టేసింది. అలాంటి ఈ సినిమా, జులై 31వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మగేశ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా తెలుగు అమ్మాయి 'నాగదుర్గ' నటించింది. ఫోక్ సాంగ్స్ తో పాప్యులర్ అయిన నాగదుర్గని, కోలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.
రఘు (పవీష్) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. తల్లి .. తండ్రి .. ఓ చెల్లెలు .. ఇదే అతని కుటుంబం. పవీష్ తండ్రి పద్ధతి కలిగిన యజమాని. అప్పులు చేయడం అతనికి ఇష్టం ఉండదు. క్రెడిట్ కార్డుల ప్రస్తావన కూడా తీసుకురానీయడు. కార్పొరేట్ సంస్థలో పనిచేసి రఘు తెచ్చిన శాలరీని తండ్రి ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేస్తుంటాడు. అలాంటి పరిస్థితులలోనే రఘుకి 'అవంతిక' (నాగదుర్గ) పరిచయమవుతుంది. ఆమె కూడా ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. తండ్రిలేని ఆమెను తల్లి పెంచుతుంది.
అవంతికపై మనసుపడిన రఘు, ఆమె కోరిక మేరకు షాపింగులు .. సినిమాలు .. షికార్లు అంటూ తిప్పుతుంటాడు. అతని శాలరీ సరిపోకపోవడంతో అప్పులు చేయడం మొదలుపెడతాడు. చివరికి బ్యాంకు లోన్లు తీసుకోవడం చేస్తుంటాడు. అవంతిక కోరిక మేరకే ఆమెను తీసుకుని 'ఊటీ'కి వెళతాడు. అయితే ఆమె తల్లి, తన కూతురును రఘు కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దాంతో రఘు తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్ కి తీసుకుని వెళతారు.
'అవంతిక' కారణంగా రఘు జాబ్ పోతుంది. అతను వాయిదాలు కట్టని కారణంగా బ్యాంకు వాళ్లు 'బైక్' తీసుకుని వెళ్లిపోతారు. ఈ సమయంలోనే తన కొడుకు అప్పులు చేస్తున్నాడనీ .. తప్పించుకు తిరుగుతున్నాడనే విషయం రఘు తండ్రికి తెలుస్తుంది. జరుగుతున్న అవమానాలను భరించలేని రఘు తల్లిదండ్రులు, తమ కూతురు తీసుకుని సొంత ఊరు వెళ్లిపోతారు. తనని ఈ స్థితికి తీసుకొచ్చిన అవంతిక విషయంలో రఘు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? వాళ్ల ప్రేమ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది మిగతా కథ.
ప్రేమలో పడటం .. బ్రేకప్ చెప్పుకోవడం ఈ కాలంలో చాలా ఈజీ అయిపోయింది. లవ్ లో పడటమంటే అబ్బాయిలు - అమ్మాయిలు కలిసి సరదాగా తిరగడం, పార్టీలు .. సినిమాలు అంటూ జల్సాలు చేయడం సర్వ సాధారణమైపోయింది. అబ్బాయిలతో అమ్మాయిలు ఇష్టానుసారంగా ఖర్చు చేయించడం .. మనసిచ్చిన అమ్మాయి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా అబ్బాయిలు ఆలోచన చేయకపోవడం .. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే అంశాన్ని దర్శకుడు తెరపైకి తీసుకుని వచ్చాడు.
'దుబాయ్' ఫ్లైట్ ఎక్కవలసిన రఘు పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ 'హరిశ్చంద్ర' ముందు ఉంటాడు. 'అవంతిక' అనే అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి, అతను దుబాయ్ కి పారిపోతున్నాడని మహిళా సంఘాలు గొడవ చేస్తుండటంతో ఈ కథ మొదలవుతుంది. అంతవరకూ జరిగిన కథను, పోలీస్ ఆఫీసర్ కి రఘు వివరించే క్రమంలో ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హీరో - హీరోయిన్ మధ్య జరిగిన వ్యవహారమంతా ఫస్టాఫ్ గా ఆడియన్స్ ను అలరిస్తుంది.
ఇక తాను 'దుబాయ్'కి వెళ్లకుండా ఉండాలంటే .. అవంతికతో పెళ్లి విషయాన్ని గురించి ఆమె తల్లితో మాట్లాడాలంటే, అవంతిక ఒక షరతుకు ఒప్పుకోవలసి ఉంటుందని పోలీస్ ఆఫీసర్ తో రఘు తేల్చిచెబుతాడు. ఆ షరతు .. దాని తాలూకు ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది. నిజానికి ఈ సినిమాలో రఘు పెట్టే ఈ షరతే కొత్తగా అనిపిస్తుంది .. కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఆడియన్స్ ఎంజాయ్ చేసే పాయింట్ కూడా ఇదే.
లవ్ .. రొమాన్స్ .. ఫ్రెండ్షిప్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ కథను బోర్ కొట్టకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ వరకూ అమ్మాయిల ధోరణిని తప్పుబడుతూ వచ్చిన దర్శకుడు, అక్కడి నుంచి కథను బ్యాలెన్స్ చేయడానికి తనదైన పద్ధతిలో ప్రయత్నం చేశాడు. అది కూడా సమర్థవంతంగానే అనిపిస్తుంది. కాకపోతే అక్కడివరకూ చర్చిస్తూ వచ్చిన అంశాన్ని, హఠాత్తుగా డైవర్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్టాఫ్ వరకూ ఈ సినిమా చాలా సరదాగా సాగుతుంది. ఇక సెకండాఫ్ లో హీరో షరతు ఏమిటనేది తెలిసిన తరువాత, కథ ఎటు వైపు వెళుతుందనేది ప్రేక్షకులు క్లైమాక్స్ వరకూ ఊహించగలుగుతారు. ప్రధానమైన పాత్రధారులంతా బాగా చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్, ఈ కంటెంట్ పెర్ఫెక్ట్ గా రావడానికి తమవంతు సపోర్టును అందించాయని చెప్పాలి. ప్రధానమైన పాత్రలు ఎమోషన్స్ నేపథ్యంలో చెప్పే డైలాగ్స్ బలంగా కనెక్ట్ అవుతాయి.
ప్రేమలో పడటంలో తప్పులేదు. కానీ అబ్బాయి ప్రేమను ఆసరాగా చేసుకుని, అమ్మాయిలు అతనితో ఇష్టానుసారం ఖర్చు చేయించకూడదు. ఆ ఎఫెక్ట్ అతని కెరియర్ పై .. అతని ఫ్యామిలీ పై పడుతుందనే విషయాన్ని మరిచిపోకూడదు. అలాగే 'నిజమైన ప్రేమ నిందచేయదు .. మన్నిస్తుంది' అనే విషయాన్ని అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. యూత్ కి కరెక్టుగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
'లవ్ ఓ లవ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Love Oh Love Review
Movie Details
Movie Name: Love Oh Love
Release Date: 2026-07-31
Cast: Pavish, Nagadurga, KS Ravikumar
Director: Magesh Rajendran
Music: Foxn
Banner: Zinema Media
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer