వడ్డే నవీన్ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. తను హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ చిత్ర కథేంటి? ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన త్రిమూర్తులు (వడ్డే నవీన్) కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేడు. నీతి నీజాయితితో ఉద్యోగం చేస్తుండటంతో ఎక్కడ కూడా పట్టుమని మూడు నాలుగు నెలలు నికరంగా ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. దాదాపు 55 సార్లు రకరకాల ఊర్లకు ట్రాన్స్ ఫర్ అవుతూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుగా పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి అమలాపురం నుంచి అరకులో తన తండ్రి పనిచేసిన పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అవుతాడు. ఈ పోలీస్‌స్టేషన్‌లో అనుకోకుండా గిరిజన అమ్మాయి ప్రియమ్మ అత్యాచారంకు సంబంధించిన కంప్లయిట్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు, ఇందుకు సంబంధించిన ఓ ఫైల్ దొరుకుతుంది.
ఈ కేసులోనే అత్యంత నిజాయితీగా ఉన్న తన తండ్రి శ్రీనివాసులు (దేవి శ్రీ ప్రసాద్) ప్రాణాలు కూడా కోల్పోతాడు. అయితే ఈ అత్యాచారం ఘటనకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కమలమ్మ (శిల్పా శిలస్కర్), ఆమె తనయుడు కాబోయే సీఎం సంతోష్ (వివేక్ రఘువంశీ) కారణం అని తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైన బాధిత ప్రియమ్మకు న్యాయం చేయాలని, కమలమ్మ, సంతోష్‌లకు కోర్టులో శిక్ష వేయించాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తరువాత జరిగిందేమిటి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కమలమ్మతో ఎలా పోరాడాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? బాధితురాలికి ఎలా న్యాయం చేశాడు అనేది మిగతా కథ.
వడ్డే నవీన్ చాలా కాలం గ్యాప్ తరువాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం కమర్షియల్ కథను సిద్దం చేసుకోవాలనే తపనతో అన్ని అంశాలు జోడించి ఓ సాదాసీదా కథను సిద్దం చేసుకున్నాడు. ఈ సినిమాకు వడ్డే నవీన్ హీరోగా, కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా మూడు బాధ్యతల్ని నిర్వర్తించాడు. ఓ నిజయితీ కానిస్టేబుల్ జీవితం ఎలా ఉంటుంది? సాదాసీదా కానిస్టేబుల్ ఒక్కడే పోరాడి ఏకంగా ముఖ్యమంత్రితో ఎలా ఢీకొట్టాడు? తన వ్యూహాంతో 20 సంవత్సరాల క్రితం జరిగిన అత్యాచారం కేసును రీ ఓపెన్ చేసి భాదితురాలికి ఎలా న్యాయం చేశాడు అనేది ఈ చిత్ర కథ. ఇందులో భాగంగా ప్రస్తుత పోలీస్ వ్యవస్థను, రాజకీయ రంగంలో ఉండే లోపాలను ఈ కథలో ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.
అయితే కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో సినిమా పర్వాలేదనే స్థాయి నుంచి ముందుకు కదల్లేదు. కథలో ఉన్న పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న అందుకు తగ్గట్టుగా కథనంలో వేగం లేకపోవడంతో ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమా ప్రారంభంలో అత్యాచారం కేసుతో సినిమాను సీరియస్ మోడ్‌లో ప్రారంభించిన ఆ తరువాత పట్టు తప్పడంతో స్క్రీన్‌ప్లేలో వేగం కనిపించలేదు. ప్రథమార్థం పర్వాలేదపించినా, సెకండాఫ్‌లో పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే కోర్టు సన్నివేశాలు మినహా చెప్పుకోదగ్గ అంశాలేమీ లేవు.
సీఎంకు సంబంధించినా సన్నివేశాలు, సీఎంపై జరిగే దాడి, దానిని త్రిమూర్తులు అడ్డుకోవడం ఇవన్నీ ఏ మాత్రం లాజిక్ లేకుండా చిత్రీకరించినట్లు అనిపించింది. అయితే ఈ కథలో త్రిమూర్తులు అత్యాచారం కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష వేయించి, బాధితురాలికి న్యాయం చేయడం, ఇలాంటి సన్నివేశాలు అలరిస్తాయి. పతాక ఘట్టాల్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు పెద్ద సినిమాల యాక్షన్ సన్నివేశాల్ని తలపించాయి. కథలో, స్క్రీన్‌ప్లేలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు 90ల తరంలో విడుదల కావాల్సిన సినిమానా అనే సందేహం కలుగుతుంది.
చాలా కాలం విరామం తరువాత వడ్డే నవీన్ ఈ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించాడు. అంతేకాదు వన్ మ్యాన్ షోతో చిత్రాన్ని నిలబెట్టాలని ప్రయత్నించాడు. త్రిమూర్తులు పాత్రలో హుషారుగా నటించాడు. ఆయన నటనలో ఈజ్ ఏ మాత్రం తగ్గలేదు. మంచి కథతో వస్తే తప్పకుండా వడ్డే నవీన్ హీరోగా మళ్లీ విజయం అందుకుంటాడనే భావన కలిగించాడు. రాశి సింగ్ పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. సీఎంగా శిల్పా పాత్ర హుందాగా కనిపించింది. రఘుబాబు పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది. సంగీతం, ఫోటోగ్రఫీ పర్వాలేదు.
ఓ సాదాసీదా కథతో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇచ్చిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఓ కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. నెమ్మదిగా సాగే కథ, కథనాలతో, ఊహలకందే సన్నివేశాలతో ప్రేక్షకులకు ముందుకొచ్చిన త్రిమూర్తులు అక్కడక్కడా అలరించినా, పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.
'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' మూవీ రివ్యూ
Transfer Trimurthulu Review
Movie Details
Movie Name: Transfer Trimurthulu
Release Date: 2026-06-19
Cast: Vadde Naveen, Rashi Singh, Shilpa Tulaskar, Vivek Raghuvanshi, Raghu Babu, Siva Narayana, Vadlamani Srinivas, Jwala Koti, Devi Prasad, Surya, Baba Bhaskar, Pramodini, Sathvik Raju, Anjali Priya, Gayatri Chaganti
Director: Kamal Teja Narla
Music: Kalyan Nayak
Banner: Vadde Creations
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer