'పేట్రియాట్' (జీ 5) మూవీ రివ్యూ!

మలయాళంలో రూపొందిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్'. ఆంటోనీ జోసెఫ్ నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి .. మోహన్ లాల్ ..  ఫహద్ ఫాజిల్ .. కుంచాకో బోబన్ .. నయనతార ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా,మే 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 

డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) DRW అనే డిఫెన్స్ సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తుంటాడు. స్మార్టు ఫోన్లు .. ల్యాప్ టాప్ లు వాటి పనితీరుపై ఆయనకి మంచి అవగాహన ఉంటుంది. వాటిలో ఇన్ స్టాల్ చేసే కొన్ని యాప్స్ కారణంగా, అవి ఇతరుల సమాచారాన్ని ఎలా బయటపెడతాయనేది ఆయనకి బాగా తెలుసు. అలాంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం అతణ్ణి ఎంచుకుంటుంది మినిష్టర్ నళిని రామకృష్ణన్ (రేవతి). అయితే ఆ వెంటనే ఆమె చనిపోవడం డేనియల్ కి అనుమానాన్ని కలిగిస్తుంది. 

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పిల్లలకి ఫ్రీగా ల్యాప్ టాప్ లు అందజేస్తారు.ఆ ల్యాప్ టాప్ లు మినిష్టర్ సుందరానికి సంబంధించిన శక్తి గ్రూప్ తయారు చేస్తుంది. ఆ ల్యాప్ టాప్ లలో  రహస్యంగా అమర్చిన కెమెరాలు అవి ఉపయోగించేవారి సమాచారాన్ని బయటికి పంపుతూ ఉంటాయి. ఈ నెట్ వర్క్ వెనుక ఎవరున్నాదనేది కనిపెట్టడానికి డేనియల్ రంగంలోకి దిగుతాడు. 

అయితే అప్పటికే అందుకు సంబంధించిన ఆధారాలు జ్యోతి (దర్శన రాజేంద్రన్) చేతికి చిక్కుతాయి. శక్తి గ్రూప్ కి చెందిన శక్తి సుందరం ఆమెను చంపడానికి ప్లాన్ చేస్తాడు. శక్తి దగ్గర పనిచేసే మైకేల్ (కుంచాకో బోబన్), జ్యోతితో సహజీవనం చేస్తుంటాడు. అతను జ్యోతిని తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శక్తి గ్రూప్ ను చట్టానికి పట్టించాలనుకున్న డేనియల్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అతని భార్య లతిక ( నయనతార) అతనికి ఎందుకు దూరంగా ఉంటోంది? డేనియల్ కి సహకరించే రహీమ్ సాహెబ్ (మోహన్ లాల్) ఎవరు? అనేది మిగతా కథ.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని వైపుల నుంచి విజృంభిస్తోంది. స్మార్టు ఫోన్లు .. ల్యాప్ టాప్ ల  వినియోగం చాలామందికి తప్పనిసరి అయిపోయింది. అందువల్లనే వాటి ఆధారంగానే కొంతమంది తమకి కావలసిన కంటెంట్ ను రహస్యంగా రాబట్టేస్తున్నారు. సంబంధిత వ్యక్తికి తెలియకుండానే అతనికి సంబంధించిన వీడియోలు సైతం వెళ్లిపోతున్నాయి. ఇలాంటి వాటిని ఎలా నియంత్రించవలసి ఉంటుందనే అంశం చుట్టూ అల్లుకోబడిన కథ ఇది. 
   
ఇతరుల ముందు మాత్రమేకాదు, ల్యాప్ టాప్ ముందు కూడా బట్టలు మార్చుకోకూడదని నాకు తెలియదు అనే డైలాగ్, ఆఫర్ ఉందని చెప్పి పాత ఫోన్లు ఇచ్చేసి కొత్త ఫోన్లు కొంటే, మన జీవితంలోని అనేక విషయాలు పాత ఫోన్ల ద్వారా బయటికి వెళ్లిపోవడం ఖాయమనే డైలాగ్ .. నేటి ఆధునిక ప్రపంచంలో అందరూ ఎంత జాగ్రత్తగా మసలుకోవాలనేది చెబుతాయి. ఎక్కడో ఉంటూ సీక్రెట్ గా మనలను వాచ్ చేస్తున్నవారికి తగిన గుణపాఠం చెప్పడానికి రంగంలోకి దిగిన ఒక యోధుడి కథగా ఇది కనిపిస్తుంది.

మిగతా అన్ని సినిమాల మాదిరిగానే ఫస్టాఫ్ లో సమస్య .. సెకండాఫ్ లో పరిష్కారం ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అయితే ఫస్టాఫ్ లో అసలు సమస్య ఏమిటనేది ప్రేక్షకులకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఇక ఆ సమస్యకి కారకులు ఎవరనే విషయాన్ని కనుక్కోవడానికి హీరో చేసే ప్రయత్నం అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు. అతనిపై దేశ ద్రోహిగా ముద్ర వేయడం .. అతను విదేశాలకు పారిపోవడం వంటి సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. 

ఇక హీరో మమ్ముట్టి చేసే పోరాటానికి మోహన్ లాల్ తోడు కావడం .. ఈ ఇద్దరి చెంతకి కుంచాకో బోబన్ చేరుకోవడం సినిమాటిక్ గా అనిపిస్తాయి. వాళ్ల అభిమానులను అలరించడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తాయి. పోనీ అలా చూసుకున్నా, వాళ్ల క్రేజ్ కి తగినస్థాయిలో ఆ పాత్రలను డిజైన్ చేయలేదు. ప్రతి పాత్రలోనూ పవర్ తగ్గడం మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఇందుకు నయనతార పాత్ర కూడా మినహాయింపు కాదు.

ఇక కథలో మూడు వైపుల నుంచి మూడు ప్రధానమైన పాత్రలుగా మమ్ముట్టి .. మెహన్ లాల్ .. కుంచాకో బోబన్ తెరను ఆక్రమిస్తూ వస్తుంటే, మరో వైపు నుంచి విలన్ గా ఫహద్ ఫాజిల్ విరుచుకుపడటం చూపించాలి. కానీ ఆ పాత్రను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయలేకపోయారు.
ఒక అరుదైన కలయికగా .. గొప్ప కలయికగా కనిపించే ఈ కాంబినషన్, ఆశించిన స్థాయిలో డిజైన్ చేయకపోవడంతో ఆడియన్స్ డీలాపడేలా చేస్తుంది. 

కథ ఢిల్లీ .. ఆగ్రా .. లండన్ .. కొచ్చి అంటూ అనేక పంతాలకు మారుతూ ఉంటుంది. ఆయా లొకేషన్స్ బావున్నాయనిపిస్తుంది. కానీ కథాపరంగా మాత్రం ఉత్కంఠను రేకెత్తించలేకపోయింది. అందరూ సీనియర్ స్టార్స్ .. వాళ్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు గానీ, పాత్రలలో విషయం లేకపోవడం వలన వాళ్లు ఏమీ చేయలేకపోయారు.

నిర్మాణ విలువలు బాగున్నాయి. మనుష్ నందన్ ఫొటోగ్రఫీ .. సుషీన్ శ్యామ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. రాహుల్ రాధాకృష్ణన్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫస్టాఫ్ లో ట్రిమ్ చేయవలసిన సన్నివేశాలు కనిపిస్తాయి.

స్టార్స్ కి తగిన కథ లేకపోవడం .. వాళ్ల ఇమేజ్ కి తగిన విధంగా పాత్రలను డిజైన్ చేయకపోవడం .. తెరపై లొకేషన్స్ మారుతూ ఉంటాయిగానీ, ఆ స్థాయిలో కథనం పుంజుకోకపోవడం నిరాశను కలిగిస్తుంది. భారీతారాగణాన్ని చూసి థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ అసంతృప్తికి గురికావడానికి కారణాలు ఇవేనని అనిపిస్తాయి.   

Movie Details

Movie Name: Patriot

Release Date:

Cast: Mammootty,Mohanlal ,Fahadh Faasil ,Kunchacko, Boban,Nayanthara,Revathi

Director: Mahesh Narayanan

Producer: Anto Joseph

Music: Sushin Shyam

Banner: Anto Joseph Film Company

Patriot Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews