దర్శకుడిగా ప్రతిభను చాటుకున్న తరుణ్‌ భాస్కర్‌ నటుడిగా కూడా నిరూపించుకోవాలని కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు నటుడిగా ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదు. ప్రేక్షకులు కూడా ఆయన్నీ నటుడిగా పూర్తిస్థాయిలో యాక్సెప్ట్‌ చేయలేదు. తరుణ్‌ మాత్రం దర్శకత్వం కంటే ఎక్కువగా నటనే మీద ఫోకస్‌ పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాయపడ్డ సింహం'. ఈ చిత్రమైనా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిందా? గాయపడిన సింహంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? అనేది తెలుసుకోవాలంటే సినిమా సమీక్ష చదవాలి. 

ధరహాస్‌ (తరుణ్‌ భాస్కర్‌), గాయత్రి (మానస చౌదరి) ప్రేమించుకుంటారు. అయితే గాయత్రిని, ధరహాస్‌కు ఇచ్చి పెళ్లి చేయాలంటే ధరహాస్‌ అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని కండిషన్‌ పెడతాడు గాయత్రి తండ్రి (అనీష్‌ కురువిల్లా). ఇక దరహాస్‌ పలు ఇబ్బందులతో వీసా సంపాందించి అమెరికా వెళతాడు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పెట్టిన నిబంధనలతో... ధరహాస్‌ కేవలం 34 గంటల్లోనే అమెరికా ఎయిర్‌పోర్ట్‌ నుంచే.. మళ్లీ ఇండియాకు తిరిగి రావాల్సి వస్తుంది.  దీంతో తన గాయత్రితో పెళ్లి జరగడం కుదరదని తెలియడంతో తన జీవితాన్ని నాశనం చేసిన ట్రంప్‌పై దరహాస్‌ పగ తీర్చుకోవాలనుకుంటాడు. 

తన స్నేహితుడికి స్నేహితుడైన భైరవదాస్‌ (శ్రీ విష్ణు)తో ట్రంప్‌పై చేతబడి (బ్లాక్‌ మ్యాజిక్‌) చేయించాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఆ తరువాత ఏం జరిగింది? ట్రంప్‌పై భైరవదాస్‌ చేతబడి చేశాడా? ధరహాస్‌ మళ్లీ అమెరికాకు వెళ్లాడా? తన ప్రేయసి, గాయత్రిని పెళ్లి చేసుకున్నాడా? లేదా?  ఈ క్రమంలో బ్రూటల్‌ ధర్మ (జేడీ చక్రవర్తి)కి ఈ కథకు సంబంధమేమిటి? ఈ కథతో  శాలినికి  (ఫరియా అబ్దుల్లా) ఉన్న లింకేమిటి?  భైరవదాస్‌ ఎంట్రీతో కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మిగతా కథ. 

కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలను ప్రేక్షకులకు ఆదరిస్తున్నారు.. మనం కూడా కొత్తగా చేయాలి అనే ఆలోచనతో నేటి దర్శకులు కథా రచయితలు వింత వింత కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆ కోవలోకి చెందినదే. అమెరికా అధ్యక్షుడిపై చేతబడి చేయించడం అనే వింత కాన్సెప్ట్‌ ఫన్నీగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి కథలు పేపరు మీద ఉన్నప్పుడు ఫన్నీగా అనిపించినా, తెరపైకి వచ్చే సరికి సిల్లీగా అనిపిస్తాయి. ఇది అలాంటి సినిమానే. కాన్సెప్ట్‌ కొత్తగా ఉన్నప్పటికి ఈ సినిమాను ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ప్లేతో తెరపై తీసుకరావడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా ఆద్యంతం ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. 

బొమ్మరిల్లు, పోకిరి, అర్జున్‌ రెడ్డి, సినిమాలపై వేసిన సెటైర్లు కొంత మందికి నవ్వులు తెప్పిస్తే, మరి కొంత మందికి చిరాకు కలిగిస్తాయి. దర్శకుడిగా తమ ప్రతిభను వర్జినల్‌ కంటెంట్‌తో చూపించే ప్రయత్నంను విస్మరించి, సక్సెస్‌ఫుల్‌ సినిమాలపై కామెడీ చేయడం కొంత మంది దర్శకులకు అలవాటుగా మారిపోయింది. ఈ చిత్రంలో కశ్యప్ శ్రీనివాస్‌ కూడా అదే పంథాను అనుసరించాడు. ఫస్టాఫ్‌ నెమ్మదిగా కొనసాగుతూ, ఇంటర్వెల్‌కు వచ్చే సరికి ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్‌ కలిగించే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. 

సినిమా సెకండాప్‌ చూడాలనే ఉత్సుకత కలిగించలేదు. ఫస్టాఫ్‌తో పొలిస్తే, సెకండాఫ్‌ పరవాలేదనిస్తుంది. అయితే ఓవరాల్‌గా గాయపడ్డ సింహం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరచడంలో సక్సెస్‌ కాలేదు. కాసిని నవ్వులతో ఆద్యంతం బోరింగ్‌గానే కొనసాగింది. కాన్సెప్ట్‌ మినహా సినిమా మొత్తంలో ఎక్కడా కూడా కొత్తదనం కనిపించలేదు. 

తరుణ్‌ భాస్కర్‌ నటన ఫర్వాలేదనిపించినా.. ఇంకా ఆయన నటనలో మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఫరియా అబ్దుల్లా పాత్ర రెగ్యులర్‌గా బోరింగ్‌గా అనిపించింది. ఫరియా కొత్త పాత్రలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దరహాస్‌ స్నేహితుడిగా నటించిన ఈ చిత్ర దర్శకుడు కశ్యప్‌ శ్రీనివాస్‌ నటుడిగా కొన్ని నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. శ్రీ విష్ణు పాత్ర మొదట్లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, ఆ తరువాత బోరింగ్‌గా కొనసాగింది. శుభలేఖ సుధాకర్‌, హర్షవర్థన్‌ తమ పరిధి మేరకు నటించారు. జేడీ చక్రవర్తి మార్క్‌ ఈ సినిమాలో కనిపించలేదు. మాసస చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదు.

సినిమాటోగ్రఫీ బాగుంది. పాటుల, నేపథ్య సంగీతం ఇంప్రెసివ్‌గా లేవు. నిర్మాణ విలువలు పర్వాలేదు. 

అక్కడక్కడా కాసిని నవ్వులు మినహా 'గాయపడ్డ సింహం' అంతా బోరింగ్‌గానే ఉంది. ఈ సింహంలో ఎనర్జీ, పవర్‌ మిస్‌ అయ్యింది. ప్రేక్షకులను అలరించడంలో ఈ 'గాయపడ్డ సింహం' చతికిలపడి.. వెనకడుగు వేసింది.