పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'డార్క్ నైట్'. ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, అంతగా ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
హేమ (పూర్ణ)కి .. అలెక్స్ (విధార్థ్)కి వివాహమవుతుంది. అలెక్స్ ఎప్పుడూ బిజీగా ఉండే ఒక లాయర్. అతను హేమకి ఒక ఖరీదైన జీవితాన్ని ఇస్తాడు. ఆయన నుంచి హేమ ప్రేమానురాగాలను ఆశిస్తుంది. అయితే అతను వాటికి చాలా దూరంగా కనిపిస్తూ ఉంటాడు. హేమ ఫీలింగ్స్ ను ఎంతమాత్రం పట్టించుకోకుండా అతను తన పని చేసుకు వెళుతుంటాడు. అందుకు కారణం సోఫియా ( శుభశ్రీ) అనే విషయం హేమకి తెలుస్తుంది.
అలెక్స్ ఆఫీసులో సోఫియా పనిచేస్తూ ఉంటుంది. ఆమెతో అతను అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. భార్యకి అలెక్స్ దూరం కావడంలో సోఫియా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్యనున్న అక్రమ సంబంధం హేమకి తెలుస్తుంది. అప్పటి నుంచి ఆమెకి రోజులు భారంగా గడుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె ఒక రోజున రోషన్ (త్రిగుణ్) అనే ఒక యువకుడికి కార్ తో డ్యాష్ ఇస్తుంది. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది.
తన భర్త తన పట్ల ప్రేమగా లేకపోవడం వల్లనే తాను రోషన్ కి చేరువ కావడానికి ట్రై చేస్తున్నానేమో అనే ఒక ఆలోచన హేమకి వస్తుంది. దాంతో ఇకపై తమ మధ్య కాస్త దూరంగా ఉండటం మంచిదని రోషన్ తో చెబుతుంది. తనకు దగ్గరవుతుందని భావించిన హేమ, తిరిగి దూరంగా వెళుతుండటాన్ని రోషన్ తట్టుకోలేకపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతను తీసుకున్న ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.
ఈ కథ మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ నడుస్తుంది. మిగిలిన పాత్రలు నామ మాత్రంగా కనిపిస్తాయి .. అవి కూడా కొన్నే. తనని పట్టించుకోని భర్త .. తనని మాత్రమే పట్టించుకునే ఓ పరిచయస్తుడు .. ఆ ఇద్దరి మధ్య ఎటూ తేల్చుకోలేని యువతిగా పూర్ణ. ఈ మూడు పాత్రలే ఈ కథలో ప్రధానమైనవిగా కనిపిస్తాయి. నాలుగో ప్రధానమైన పాత్ర అనేది తెరపై కనిపించదు.
ఫస్టాఫ్ లో చాలావరకూ వివాహమైన ఒక యువతికీ, అనుకోకుండా ఆమెకి పరిచయమైన ఒక యువకుడికి మధ్య జరుగుతుంది. వాళ్లిద్దరి మధ్య సంబంధం హద్దులు దాటబోతుండగా ఆమె భర్త పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి సెకండాఫ్ గా ఈ కథ మరింత పుంజుకుంటుంది. వివాహమైంది గనుక ఆ బంధానికి ఆమె కట్టుబడి ఉంటుందా? తన భర్త చూపించని ప్రేమ వేరొకరు అందిస్తున్న కారణంగా అటువైపు మొగ్గు చూపుతుందా? అనేది ఆసక్తికరమైన అంశంగా మారుతుంది.
వైవాహిక జీవితం - అక్రమ సంబంధం అనే రెండు అంశాల చుట్టూ అల్లుకోబడిన కథ ఇది.
వైవాహిక జీవితం నమ్మకంపై నడుస్తుందని అంటారు. ఆ నమ్మకమే కోల్పోయినప్పుడు ఆ జంట ఇక ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించలేదు అనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. తన భర్త తనని మోసం చేస్తున్నాడని భార్య భావించినప్పుడు, తాను కూడా అదే తప్పు చేస్తే తప్పేంటి? అనే ఆలోచన కొంతమందికి రాకుండా ఉండదు.
అలాగే భర్త ప్రేమకి దూరమైనయువతి .. ఆ ప్రేమను అందించేవారి పట్ల ఆసక్తిని కనబరచడం కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇదే అదనుగా భావించి ఆ ఇద్దరి జీవితాల్లోకి ప్రవేశించే మోసగాళ్లు మరికొంతమంది ఉండనే ఉంటారు. అలా దర్శకుడు ఈ కథను మూడు కోణాలలో ఆవిష్కరించాడు. మన చుట్టూ తిరుగుతున్న పాత్రలనే మనం తెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
అక్రమ సంబంధాల దిశగా సాగే అన్ని కథలకు దాదాపుగా ఒకే ముగింపు ఉంటుంది. చంపడమో .. చావడమో. అదే దారిలో నడిచే ఈ కథకు దర్శకుడు ఇచ్చిన ముగింపు ఏమిటనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడం సహజం.. అయితే ఆ గొడవలను తమకి అనుకూలంగా మార్చుకునే వ్యక్తులు చుట్టూనే ఉంటారు. అలాంటి వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చాటే కాన్సెప్ట్ ఇది.
'డార్క్ నైట్' నేపథ్యంలో ప్రధానంగా నడిచే కథ కావడం వలన, ఈ టైటిల్ ను సెట్ చేశారు. దర్శకుడు ఎంచుకున్న ఈ కథ కొత్తదేమీ కాదు, ఇంతకు ముందు ప్రేక్షకులకు పరిచయం లేనిది కాదు. గతంలో ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి కాన్సెప్ట్ ను మరింత సింపుల్ గా చెప్పడానికి ట్రై చేశారు. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం కొత్తగా అనిపించకపోగా కాస్త గందరగోళంలోకి నెడుతుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. పూర్ణ నటన ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. కార్తీక్ ముత్తుకుమార్ అందించిన ఫొటోగ్రఫీ .. మిస్కిన్ నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. రొటీన్ కథను మరింత సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నించడమే ఈ కథలో కనిపించే ప్రధానమైన లోపమని చెప్పుకోవాలి.
'డార్క్ నైట్' (ఆహా) మూవీ రివ్యూ!
Dark Night Review
Movie Details
Movie Name: Dark Night
Release Date: 2026-04-10
Cast: Poorna, Vidharth, Trigun, Subhasree
Director: Adithya
Music: Mysskin
Banner: Sri Balaji
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer