'రిసార్ట్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

తమిళంలో రూపొందిన వెబ్ సిరీస్ 'రిసార్ట్'. కామెడీని .. ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే డ్రామా ఇది. ప్రవీణ్ బెన్నెత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, విజయ్ కుమార్ రాజేంద్రన్ ప్రధానమైన పాత్రను పోషించాడు. ఒక రిసార్ట్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సిరీస్ 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. 

వెట్రి (విజయ్ కుమార్ రాజేంద్ర) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. తల్లి .. చెల్లి ఇదే అతని కుటుంబం. తమ పరిస్థితికి కారకుడైన తండ్రి అంటే అతనికి కోపం ఉంటుంది. తండ్రి చేసిన అప్పులను తీర్చవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. అందువలన డిగ్రీ కూడా పూర్తిచేయలేక ఉద్యోగాన్ని వెతుక్కుంటూ బయల్దేరతాడు. అతని ఊరుకు సంబంధించిన 'ఉత్తమన్', 'మహాబలిపురం'లోని ఒక రిసార్టులో రూమ్ సర్వీస్ బోయ్ గా జాబ్ ఇప్పిస్తాడు. 

బీచ్ ఒడ్డునే ఉన్న ఖరీదైన రిసార్ట్ అది. రూమ్ సర్వీస్ బాయ్ గా అక్కడ ఉద్యోగం చేయడం అంత ఆషామాషీ విషయం కాదనేది 'వెట్రి'కి అర్థమవుతుంది. అక్కడ కిచెన్ లో 'చెఫ్'గా నెడుమారన్ (తలైవాసల్ విజయ్) పనిచేస్తూ ఉంటాడు. ఆయన టీమ్ ను కూడా అక్కడి వాళ్లంతా చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. రూమ్ సర్వీస్ బాయ్ లను కిచెన్ వైపు వెళ్లనీయరని తెలిసి వెట్రి బాధపడతాడు. 

మొదటి నుంచి కూడా అతనికి వంట చేయడం ఇష్టం. చెఫ్ గా పనిచేయడం ఇష్టం. ఆ కారణంగా కిచెన్ వైపు వెళ్లిన ప్రతిసారి అతను నెడుమారన్ తో చీవాట్లు తింటాడు. అదే కిచెన్ లో ఐశ్వర్య పనిచేస్తూ ఉంటుంది. తొలి చూపులోనే ఆమెను వెట్రి ఇష్టపడతాడు. అయితే ఆమె నెడుమారన్ కూతురని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆమెకి చేరువకావడం అనుకున్నంత తేలిక కాదనే విషయం అతనికి అర్థమైపోతుంది.

నెడుమారన్ మాటకి ఆ రిసార్ట్ లో ఎదురుండదు. ఆయన అంటే అందరికీ భయమే. ఆ రిసార్టులో పనిచేసే మేనేజర్ రాజన్ నుంచి అంతా ఆయన మాటకి ఎస్ చెప్పాల్సిందే. అందుకు కారణం ఆ రిసార్ట్ యజమాని రఘుపతికి .. నెడుమారన్ కి మధ్య గల స్నేహమే. త్వరగా అప్పులు తీర్చడం కోసం వెట్రి రాత్రి వేళలో స్ట్రీట్ ఫుడ్ తయారు చేస్తూ ఉంటాడు. అతని కారణంగా ఆ బండి దగ్గరికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది.

ఒక రోజున కార్లో తన స్నేహితులతో కలిసి అటుగా వచ్చిన నెడుమారన్, వెట్రి బండి దగ్గర ఆగి సూప్ టేస్ట్ చేస్తాడు. అది తన సిగ్నేచర్ సూప్ కావడంతో షాక్ అవుతాడు. తన సూప్ రెసిపీని కాపీ చేసిన వెట్రిపై కోపంతో రగిలిపోతాడు. మరో వైపున నెడుమారన్ కూతురు ఐశ్వర్య, తన స్నేహితులైన వేణి - శ్రీనిధితో కలిసి వెట్రిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ తండ్రీకూతుళ్ల కారణంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? రఘుపతి కూతురు రియా ఎంట్రీతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? వెట్రి తండ్రి ఎవరు? అనేది మిగతా కథ.          
 
ఈ మధ్య కాలంలో ఒక ఆఫీస్ ను గానీ .. హాస్పిటల్ ను గాని ప్రధానమైన కేంద్రంగా చేసుకుని నడిచే కథలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఎక్కువగా వస్తున్నాయి. అలా 'ఆఫీస్' .. 'హార్ట్ బీట్' తరహాలో రూపొందిన సిరీస్ గా 'రిసార్ట్' కనిపిస్తుంది. ఒక పేదింటికి చెందిన యువకుడికి తాను చెఫ్ కావాలని ఉంటుంది. అయితే అప్పుల బాధల కారణంగా ఒక ఖరీదైన రిసార్టులో సర్వీస్ బాయ్ గా చేరతాడు. అక్కడ అతనికి ఎదురయ్యే అనుభవాల చుట్టూ దర్శకుడు అల్లుకున్న కథ ఇది. 

ఎవరికైనా ఒక లక్ష్యానికి చేరుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. ఎన్నో అవరోధాలు .. అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి అడ్డంకులను దాటుకుంటూ ఒక యువకుడు ఎలా ముందుకు వెళతాడు? అందుకోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనే అంశాలు ఈ కథలో ప్రధానమైన సన్నివేశాలను ఆవిష్కరిస్తూ వెళతాయి. ఈ కథ రిసార్ట్ చుట్టూ తిరుగుతూనే, ఆ రిసార్ట్ తో సంబంధం ఉన్న వారి జీవితాలలోకి బయట నుంచి తొంగిచూస్తూ ఉంటుంది.

ఒక వైపు నుంచి రఘుపతి .. ఆయన కూతురు రియా ..  మరో వైపున నెడుమారన్ .. ఇంకో వైపు నుంచి వెట్రి తండ్రి ఫ్లాష్ బ్యాకులకు సంబంధించిన హింట్ చివరి ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది. ఈ ట్రాకుల వైపు నుంచి ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటూ ఈ కథ మరింత ఆసక్తికరంగా పరిగెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.      
       
రిసార్టులో పనిచేసేవారి జీవితాలు .. అక్కడి స్టాఫ్ లో కొందరి మధ్య నడిచే ప్రేమకథలు .. అక్కడికి వచ్చేవారి స్వభావాలు .. ఫ్లాష్ బ్యాకులు .. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమైపోతోంది. ఇంతవరకూ పరిచయమైన నటీనటులంతా తమ పాత్రలలో మెప్పిస్తున్నారు. కథ - స్క్రీన్ ప్లే ..  ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. 

లవ్ .. కామెడీ .. సస్పెన్స్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కంటెంట్ ఇది. కథ ఇప్పుడిప్పుడే పాకాన పడుతున్న తీరు చూస్తే, మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుందనే అనిపిస్తోంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన కథగానే చెప్పుకోవచ్చు.   

Movie Details

Movie Name: Resort

Release Date:

Cast: Vijay Kumar Rajendran,Thalaivasal Vjay,Abheneya,Darshana,keerthi Amal

Director: Preveen Benneth

Producer: Venkatesh Babu

Music: Rashaarth Arwin

Banner: Global Villagers

Resort Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews