నవీన్ కస్తూరియా .. సన్నీ హిందూజా ప్రధానమైన పాత్రలను పోషించిన సిరీస్ 'ఆస్పిరెంట్స్ 3'. మొదటి సీజన్ 2021లో ప్రేక్షకుల ముందుకు రాగా, రెండో సీజన్ 2023లో పలకరించింది. ఇక మూడో సీజన్ ఈ  నెల 13వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులో ఉంది. దీపేశ్ సుమిత్ర జగదీశ్ దర్శకత్వం వహించిన మూడో సీజన్, 5 ఎపిసోడ్స్ తో అందుబాటులోకి వచ్చింది.

అభిలాష్ శర్మ (నవీన్ కస్తూరియా) సందీప్ (సన్నీ హిందూజా) ఒకప్పుడు స్నేహితులే అయినా, ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. రామ్ పూర్ కి డీఎమ్ గా ఉన్న అభిలాష్ శర్మ, సందీప్ కారణంగా ఒక విచారణను ఎదుర్కుంటూ ఉంటాడు. ఆ విచారణ ఫలితం ఎలా ఉండనుందోననే ఆందోళన అతనిని వెంటాడుతూనే ఉంటుంది. అయినా అభిలాష్ తన బాధ్యతలను తాను నిర్వర్తిస్తూ వెళుతుంటాడు.

ఈ నేపథ్యంలోనే రామ్ పూర్ ను 'ఎడ్యుకేషన్ టౌన్' గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అందుకు అవసరమైన ప్రాజెక్టు కోసం వెయ్యి ఎకరాల భూమిని సేకరించే బాధ్యతను అభిలాష్ కి అప్పగిస్తారు. ఆ సమయంలోనే 'సంభాల్' డీఎమ్ గా పవన్ కుమార్ (జతిన్ గోస్వామి) అక్కడ అడుగుపెడతాడు. ఆ ప్రాజెక్టును 'సంభాల్'లో చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.             

ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని సేకరించడం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని పవన్ కుమార్ అంటాడు. ఈ విషయంలో తనకి సందీప్ సహకారం ఉంటుందని చెబుతాడు. ఊహించని విధంగా అక్కడికి వచ్చిన పవన్ కుమార్ ను చూసిన అభిలాష్, తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. తన శత్రువైన సందీప్ తో కలిసి పనిచేస్తానని పవన్ కుమార్ చెప్పడం అభిలాష్ కి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది. 

అభిలాష్ కీ .. పవన్ కుమార్ కి మధ్య యూపీఎస్సీ ప్రిపరేషన్స్ నుంచి గొడవలు ఉంటాయి. దీప( టెంగం సెలిన్) తో ప్రేమలో ఉన్న అభిలాష్, 'ఆస్థా'తో లవ్ లో ఉన్న పవన్ కుమార్ మధ్య ఆ రోజులలోనే గొడవలు ఉంటాయి. అందుకు గల కారణం ఏమిటి? దీప .. ఆస్థా ఏమైపోయారు? పాత కాలం నాటి శత్రుత్వం ఇప్పటి వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ. 
  
జీవితమంటే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెళ్లడమే, నేర్చుకుంటూ .. మార్చుకుంటూ వెళ్లడమే. అలా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్లే ఇద్దరు యువకుల కథగా ఈ సీజన్ కనిపిస్తుంది. ఈ రెండు పాత్రలను ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ కథను నడిపించాడు. యూపీఎస్సీ ప్రిపరేషన్స్ నేపథ్యంలో కొంత కథ, ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో కొంత కథ కొనసాగుతుంది. 

యూపీఎస్సీకి సంబంధించిన కోచింగ్ .. స్టూడెంట్స్  సమావేశాలు .. తెలుగు మీడియం విద్యార్థుల అసంతృప్తి .. ప్రధానమైన అంశాలుగా ఈ కథలో కనిపిస్తాయి. అలాగే ప్రధానమైన పాత్రల కుటుంబ నేపథ్యాలతో పాటు, ప్రేమ .. స్నేహం ..పేదరికం అనే అంశాలను టచ్ చేస్తూ సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది.

5 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సీజన్ లో, దర్శకుడు ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రధానమైన రెండు పాత్రల స్వరూప స్వభావాలను తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. ఒక పాత్ర ఆవేశానికీ .. మరో పాత్ర ఆలోచనకి ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆలోచన వెనుక గల ఆంతర్యాన్ని .. ఆవేశం వెనుక గల ఆశయాన్ని తెలుసుకోవలసిన అవసరాన్ని గురించి ఈ కథ చెబుతుంది. 

మొదటి నుంచి చివరివరకూ కూడా ఈ కథ చాలా నిదానంగా నడుస్తుంది. కొన్ని సన్నివేశాలు మరింత నిదానంగా మారిపోయి నీరసంగా కూడా అనిపిస్తాయి. అయితే చివరి ఎపిసోడ్ లో చోటుచేసుకునే ఎమోషన్స్ తో కూడిన మలుపులు, అప్పటివరకూ నడిచిన కథకు మరికాస్త బలాన్ని చేకూర్చుతాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆరిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీచిత్ విజయ్ ఫొటోగ్రఫీ .. సంగీత్ - సిద్ధార్థ్ నేపథ్య సంగీతం .. తుషార్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. 

ఎవరి ఆలోచనలు వారికి కరెక్టుగా అనిపిస్తాయి. ఒకరి ఆలోచన ఒకరికి స్వార్థంగా అనిపించవచ్చు. ఒకరి ఆవేశం మరొకరికి అహంభావం క్రింద అనిపించవచ్చు. సమాజంలో రకరకాల మనస్తత్త్వాలవారు తారసపడుతూ ఉంటారు. మంచి ఎవరిలో ఉన్నా తీసుకోవాలి. మార్పు అవసరమైతే మనం మారడానికి కూడా సిద్ధపడాలి అనే సందేశంతో సాగే ఈ కంటెంట్ ఆలోచింపజేస్తుంది.