'నవాబ్ కేఫ్' .. శివకందుకూరి కథానాయకుడిగా నటించిన సినిమా. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో నిర్మితమైన సినిమా ఇది. ఈ సినిమాతో తేజు అశ్విని కథానాయికగా పరిచయమైంది. ఓటీటీ హక్కులను 'ఈటీవీ విన్' దక్కించుకుంది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది.

రాజా (శివ కందుకూరి) హైదరాబాద్ పాత బస్తీకి చెందిన యువకుడు. అతని ముత్తాతల కాలానికి చెందిన మూర్తి,  గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళతాడు. 'టీ' పెట్టడంలో ఆయనకి గల ప్రావీణ్యం నవాబ్ అభిమానాన్ని సంపాదించిపెడుతుంది. ఆయన పనితీరును మెచ్చుకుంటూ  నవాబ్ రాసిచ్చిన ఆస్తులు రాజా పెదనాన్న సొంతమవుతాయి. రాజా తండ్రి రంగనాథం (రాజీవ్ కనకాల)కి టీ దుకాణం మాత్రమే మిగులుతుంది. తన పూర్వీకుల మాదిరిగా 'టీ' పెట్టడం ఆయన ప్రత్యేకత. 

నవాబ్ ప్రశంసలు అందుకున్న కారణంగా అప్పటి నుంచి అది 'నవాబ్ కేఫ్'గా పిలవబడుతూ ఉంటుంది. తన తరువాత తన వారసుడిగా ఆ కేఫ్ ను రాజా నడపాలనేది రంగనాథం కోరిక. అయితే ఇంజనీరింగ్ పూర్తిచేసిన రాజా, అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకు అవసరమైన డబ్బును  ఏర్పాటు చేసుకోవడానికి స్నేహితుడు సీజర్ (రాజ్ కుమార్ కసిరెడ్డి)తో కలిసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో పరిచయమైన సఖి (తేజు అశ్విని)తో ప్రేమలో పడతాడు. 

ఈ నేపథ్యంలోనే రాజా పెదనాన్న కొడుకైన కుమార్ (చైతన్య కృష్ణ) కన్ను, 'నవాబ్ కేఫ్' బిల్డింగ్ పై పడుతుంది. తనకు మాదిరిగానే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే, ఆ బిల్డింగ్ ను తనకి 50 కోట్లకు అమ్మేయమని రాజాను అడుగుతాడు కుమార్. దాంతో 'నవాబ్ కేఫ్'ను  అమ్మాల్సిందేనని తండ్రితో రంగనాథం గొడవపడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటనతో రాజా జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.    

పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను అనుభవించాలేగానీ అమ్మేయకూడదు. వారసత్వంగా వచ్చిన విద్యను తమ తరువాత వారికి అందించాలే గాని వదిలేయకూడదు అనే బలమైన భావన చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే తరాల మధ్య అంతరం కారణంగా, ఒకప్పటివారి ఆలోచన .. ఆ తరువాత తరం వారికి ఛాదస్తం మాదిరిగా అనిపిస్తుంది. ఇక్కడే రెండు తరాల వారి మధ్య ఘర్షణ - సంఘర్షణ మొదలవుతుంది. 'నవాబ్ కేఫ్' కథ కూడా ఇదే. 

తన తండ్రి తనకి అప్పగించిన కేఫ్ పేరును నిలబెట్టాలనే రంగనాథం ఒక వైపు. ఆ కేఫ్ ను అమ్మేస్తే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చని భావించే రాజా మరొక వైపు. ఈ ఇద్దరి చుట్టూ తిరిగే కథనే ఇది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కేఫ్ ను కొడుకు కోసం రంగనాథం అమ్మేస్తాడా? అవకాశం ఉండి కూడా ఆనందంగా బ్రతకలేని ఆస్తులు ఎందుకనే ఆలోచనకి రాజా కట్టుబడి ఉంటాడా? అనే ప్రధానమైన అంశాల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.

లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాకి, దర్శకుడు అక్కడక్కడా యాక్షన్ టచ్ కూడా ఇచ్చాడు. అయితే లవ్ ట్రాక్ అంత బలంగా కనిపించదు. అవకాశం ఉన్నప్పటికీ అంత ఆకర్షణీయంగా మలిచే ప్రయత్నం జరగలేదని అనిపిస్తుంది. ఇక కామెడీ విషయానికి వస్తే, ఆశించినస్థాయిలో అది కూడా పేలలేదు. రాజ్ కుమార్ కసిరెడ్డి వైపు నుంచి వదిలిన కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

ప్రధానమైన లైన్ గా తీసుకున్న తండ్రీ కొడుకుల ఎమోషన్స్ మాత్రం కొంతవరకూ ఫరవాలేదు. అలాగే రాజా తల్లి వైపు నుంచి కూడా ఎమోషన్స్ పాళ్లు పెంచితే బాగుండునని అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రను మరింత బలంగా .. డిఫరెంట్ గా డిజైన్ చేయవలసిందని అనిపించక మానదు. మెయిన్ లైన్ పైనే పూర్తి ఫోకస్ పెట్టడం, మిగతా వైపుల నుంచి బలహీనంగా ఉన్న ట్రాకులపై దృష్టి పెట్టకపోవడం కనిపిస్తుంది. 

క్రాంతి ఫొటోగ్రఫీ .. ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం .. పవన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ఒకటి రెండు బాణీలు ఫరవాలేదు. ఆర్టిస్టులంతా ఎవరి పాత్ర పరిధిలో వారు చేశారు. 

పూర్వీకుల నుంచి సంక్రమించే ఆస్తులను కేవలం ఖరీదు దృష్టితో మాత్రమే చూడలేం. ఆస్తుల వెనుక వాళ్ల కలలు .. ఆశలు .. ఆశయాలు ఉంటాయి. వాటిని కొనసాగించడమే అసలైన వారసత్వం అని చాటే సినిమా ఇది. అయితే మెయిన్ లైన్ పై పెట్టిన శ్రద్ధ, మిగతా ట్రాక్స్ పై పెట్టలేకపోయారు.  దాంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావితం చేయలేక, ఓ మాదిరి కంటెంట్ గానే మిగిపోయిందని చెప్పాలి.